అఫ్ఘాన్ ప్రభుత్వం, తాలిబన్ల చర్చలకు బ్రేక్!

ABN , First Publish Date - 2020-04-09T01:08:22+05:30 IST

తాలిబన్ ఖైదీల విడుదలే లక్ష్యంగా.. ఆఫ్ఘాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య జరుగుతున్న చర్చలకు బ్రేక్ పడింది.

అఫ్ఘాన్ ప్రభుత్వం, తాలిబన్ల చర్చలకు బ్రేక్!

కాబుల్: తాలిబన్ ఖైదీల విడుదలే లక్ష్యంగా.. ఆఫ్ఘాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య జరుగుతున్న చర్చలకు బ్రేక్ పడింది. దీంతో ఆఫ్ఘానిస్థాన్‌లో శాంతి నెలకొల్పాలనుకున్న అమెరికా ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. దీనిపై స్పందించిన తాలిబన్లు.. ఖైదీల విడుదలకు దారితీయని చర్చల్లో పాల్గొనమని వ్యాఖ్యానించారు. ‘ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మా టెక్నికల్ బృందం ఒకటి జైళ్లను సందర్శించింది. విడుదలయ్యే ఖైదీలను గుర్తించేందుకు అక్కడి వెళ్లింది. కానీ ప్రభుత్వం మాత్రం ఏదోక కారణంతో ఖైదీల విడుదలను వాయిదా వేస్తోంది. దీంతో ఈ వ్యర్థ చర్చల్లో మేం పాల్గొన కూడదని నిర్ణయించుకున్నాం’ అని తాలిబన్లు ప్రకటించారు.


అయితే పెద్ద పెద్ద దాడులలో పాల్గొన్న 15 సీనియర్ కామెండర్లను విడుదల చేయాలని తాలిబన్లు ప్రభుత్వాన్ని కోరడంతోటే ఈ సమస్య ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కామెండర్లను విడుదల చేయాలని కోరడం.. తాలిబన్ల మొండి పట్టుదలకి నిదర్శనమని ఇండిపెండెంట్ డైరెక్టరేట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అధిపతి మాటిన్ బెక్ వ్యాఖ్యానించారు. తాలిబన్లు-ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల్లో ఆయన కూడా పాలు పంచుకున్నారు. ‘తొలి విడతలో మేము 400 మందిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ వారు మాత్రం సీనియర్ కమాండర్లను విడుదల చేయాలని కోరుతున్నారు. కానీ ఆ పదిహేను మంది చేతులు ప్రజల రక్తంతో తడిసాయి’ అని బెక్ వ్యాఖ్యానించారు. మరోవైపు తాలీబన్లు కూడా తీవ్రస్థాయిలోనే స్పందించారు. తమ బాధ్యతలు నిర్వర్తించడంలో అమెరికన్లు విఫలమవుతున్నారని తాలీబన్లు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-04-09T01:08:22+05:30 IST