ఇళ్ల‌లోనే బ‌క్రీద్ ప్రార్థ‌న‌లు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-07-21T11:26:13+05:30 IST

ఈరోజు బక్రీద్‌. ఇది ముస్లిం సోద‌రుల‌కు...

ఇళ్ల‌లోనే బ‌క్రీద్ ప్రార్థ‌న‌లు చేసుకోవాలి

డెహ్రాడూన్(ఉత్త‌రాఖండ్‌): ఈరోజు బక్రీద్‌. ఇది ముస్లిం సోద‌రుల‌కు ప్రధాన పండుగ. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈసారి బక్రీద్‌ను ఇళ్లలోనే జరుపుకుంటున్నారు. ముస్లిం సోద‌రులు త‌మ ఇళ్ల‌లోనే ప్రార్థ‌న‌లు చేసుకోవాల‌ని అధికారులు కోరుతున్నారు. ఈద్గాల‌లో ఐదుగురు మాత్రమే నమాజ్ చేయాల‌ని ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.  సిటీ ఎస్పీ సరితా దోవాల్ మాట్లాడుతూ కోవిడ్ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, బ‌క్రీద్‌ వేడుకలు జరుపుకోవాలని ముస్లిం సోద‌రుల‌ను కోరారు. 


ప‌ట్ట‌ణంలో ఎటువంటి ఉద్రిక్త‌త‌లు త‌లెత్త‌కుండా అన్ని పోలీసు స్టేషన్లలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. బ‌క్రీద్‌ను దృష్టిలో ఉంచుకుని డిప్యూటీ కలెక్టర్ ముందుగా అధికారుల‌తో ఒక‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పోలీసులతో సహా ఇతర విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్- 19 థ‌ర్ద్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని కరోనా నిబంధనలు పాటిస్తూ బ‌క్రీద్ జ‌రుపుకోవాల‌ని ముస్లిం సోద‌రుల‌ను కోరారు. అలాగే సిటీలో క‌రోనా ప్రొటోకాల్ అమ‌ల‌య్యేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం ఈ పండుగను జరుపుకోవాలని మసీదుల ఇన్‌ఛార్జీలను ఆదేశించినట్లు డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. మాస్క్, శానిటైజర్‌ల‌ను త‌ప్ప‌క వాడాల‌ని సూచించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని కోరారు. త్యాగం, సోదరభావం, శాంతికి బ‌క్రీద్ చిహ్న‌మ‌ని, ఈపండుగ‌ను ప్రశాంతంగా జరుపుకోవాల‌ని కోరారు.

Updated Date - 2021-07-21T11:26:13+05:30 IST