ఒక నిమిషంలో 154 కిక్కులు.. దంపతుల గిన్నిస్‌ రికార్డు!

ABN , First Publish Date - 2020-02-11T16:02:49+05:30 IST

కొరియన్‌ ఆత్మరక్షణ కళ అయిన తైక్వాండోలో తమిళ దంపతులు గిన్నిస్‌ రికార్డు సృష్టించి చరిత్రకెక్కారు.

ఒక నిమిషంలో 154 కిక్కులు.. దంపతుల గిన్నిస్‌ రికార్డు!

  • తైక్వాండోలో మదురై దంపతుల గిన్నిస్‌ రికార్డు

చెన్నై: కొరియన్‌ ఆత్మరక్షణ కళ అయిన తైక్వాండోలో తమిళ దంపతులు గిన్నిస్‌ రికార్డు సృష్టించి చరిత్రకెక్కారు. 2000 తరువాత భారతదేశంలో ప్రాచుర్యం పొందిన తైక్వాండోకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ కళలో 15 గిన్నిస్‌ రికార్డులు సాధించారు మదురైకి చెందిన నారాయణన్‌. అతని భార్య శ్రుతితో కలిసి తాజాగా మరోసారి గిన్నిస్‌ బుక్‌లో ఎక్కారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన నారాయణన్‌ సరదాగా తైక్వాండో నేర్చుకున్నారు. అయితే ఈ క్రీడపై అతనికి అమితమైన ఆసక్తి ఏర్పడి ఇప్పుడు కోచ్‌గా కూడా మారారు. అదే సమయంలో తనకిష్టమైన ఈ క్రీడలోనే భిన్నంగా ఏదైనా చేయాలన్న తలంపుతో గిన్నిస్‌ సాధనకు సంకల్పించారు. ఈ విషయం తెలిసి పలువురు ఆయన్ని హేళన చేశారు కూడా. అయితే ప్రస్తుతం ఆయన సాధించిన 15 గిన్నిస్‌ రికార్డులను చూసి వారంతా నోరెళ్లబెడుతున్నారు. నారాయణన్‌ భార్య శ్రుతికి కూడా టేక్వాండోపై ఆసక్తి కలగడంతో స్వయంగా శిక్షణ ఇచ్చారు. ఆమె కూడా ఈ క్రీడలో ప్రావీణ్యం సాధించారు. 


ఆ తరువాత ఇద్దరూ కలిసి గిన్నిస్‌ రికార్డు సృష్టించాలని నిర్ణయించి.. ఏడాదిగా సాధన చేస్తున్నారు. ఆ క్రమంలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా వెనకడుగు వేయకుండా మరింత కృషి చేశారు. అలా గత జనవరి 20వ తేదీన (వారి పెళ్లి రోజు కూడా) నారాయణన్‌, శ్రుతి ఇద్దరూ కలిసి ఒక్క నిమిషంలో 154 కిక్కులిచ్చి.. ప్రపంచంలోనే ఒక్క నిమిషంలో అత్యధిక కిక్కులిచ్చిన దంపతులుగా రికార్డు సృష్టించారు. ఆ సాధనను పర్యవేక్షించిన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు తాజాగా ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. తన భార్యతో కలిసి గిన్నిస్‌ రికార్డు సృష్టించడం అమితానందంగా ఉందని ఆ సందర్భంగా నారాయణన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-02-11T16:02:49+05:30 IST