అడుగంటుతున్న.. పరికరాలు

ABN , First Publish Date - 2020-03-27T09:26:17+05:30 IST

కరోనా వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వారిని ఐసోలేషన్‌ వార్డులకు తరలించి వారి కళ్ళె నమూనాను సేకరించి తిరుపతి, పూణేలోని పరీక్షా కేంద్రాలకు పంపించాలి.

అడుగంటుతున్న.. పరికరాలు

వందలో 30కి పైగా పరీక్షలకు వినియోగం

ఇక గొంతులో కళ్లె(స్వాబ్‌) సేకరణ కష్టతరం 

 పాజిటివ్‌ కేసు నమోదుతో మరింత అవసరం


గుంటూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వారిని ఐసోలేషన్‌ వార్డులకు తరలించి వారి కళ్ళె నమూనాను సేకరించి తిరుపతి, పూణేలోని పరీక్షా కేంద్రాలకు పంపించాలి. ఇందుకోసం వినియోగించే పరికరాలు(స్వాబ్‌లు) జిల్లాలో వంద మాత్రమే ఉన్నాయి. ఇవి ఇక్కడెక్కడా దొరకవు. పూణే నుంచి సరఫరా కావాలి. గుంటూరులో ఉన్న వంద కిట్‌లలో ఇప్పటికే సుమారు 30 అయిపోయాయి. ఈ పరిస్థితుల్లో గుంటూరులో పాజిటివ్‌ కేసు నమోదుతో వీటి అవసరం మరింత ఎక్కువైంది. పైగా ఆ ఒకే ఒక్కడు రెండు మూడు రోజుల్లోనే అనేక మందితో కలివిడిగా మెలగడంతో వారందరినీ కూడా ఇప్పుడు పరీక్షలకు తరలిస్తున్నారు.


గురువారం ఒక్క రోజే గుంటూరులో 9 కిట్‌లను వినియోగించారు.   ఇదే తీవ్రత మరికొద్ది రోజులు ఉంటే ఆయా పరికరాలు లేక పరీక్షలు నిర్వహించలేక వైద్యులు చేతులెత్తేసే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఫూణే నుంచి తెప్పించుకోవాలంటే ప్రభుత్వం ఎంతో చొరవ చూపాలి. ఇప్పటికే వాటిని దిగుమతి చేసుకుని ఉంటే బాగుండేదని వైద్యులు సూచిస్తున్నారు.కరోనా నివారణకు ఇప్పటి వరకు వినియోగిస్తున్న మలేరియ మందుల కొరత కూడా తీవ్రంగా ఉంది. వచ్చిన వారికి ఐదు బిళ్లల చొప్పున ఇచ్చి పంపి రెండు రోజులు ఆగి రమ్మంటున్నారు. దీంతో ఆ లక్షణాలతో ఉన్న వారు కూడా ఆందోళనలో ఉన్నారు. 

Updated Date - 2020-03-27T09:26:17+05:30 IST