కాటేస్తుందని కుమిలిపోకు.. బతుకుపై భారం పెంచుకోకు!

ABN , First Publish Date - 2020-07-08T11:07:36+05:30 IST

నాలుగు రోజుల క్రితం నెల్లూరులో ఓ మహిళకు..

కాటేస్తుందని కుమిలిపోకు.. బతుకుపై భారం పెంచుకోకు!

పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన రోగం కాదు..

లక్షణాలు బయటపడితేనే వ్యాధిగ్రస్థుడు

గతంతో పోల్చితే గణనీయంగా తగ్గిన వైరస్‌ బలం


నెల్లూరు (ఆంధ్రజ్యోతి): నాలుగు రోజుల క్రితం నెల్లూరులో ఓ మహిళకు కరోనా నిర్ధారణ పరీక్ష చేశారు. ఫలితాలు రాకముందే ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు బలవన్మరణానికి పాల్పడింది.


మూడు రోజుల క్రితం ఓ ఉద్యోగి ఇదే తరహా ఆందోళనతో గుండెపోటుకు గురై మరణించారు. వారం రోజులకు ముందు ఈయనకు కరోనా టెస్ట్‌ చేశారు. ఫలితాలు వెల్లడి కాలేదు. వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో, నిజంగా తనకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో విపరీతమైన ఆందోళనకు గురి కావడంతో గుండెపోటుకు గురై మరణించాడు.


ఈ ఉద్యోగి ఘటన జరిగిన రెండు రోజుల్లోనే ఆయన స్నేహితుడు ఇదే తరహాలో మృతి చెందాడు. ఈయనకూ కరోనా టెస్ట్‌కు స్వాబ్‌ తీశారు. తన స్నేహితుడికి కరోనా వచ్చింది కదా.. తనకూ వచ్చి ఉంటుందేమోనన్న ఆందోళనతో గుండెపోటుకు గురై మృత్యువాతపడ్డాడు.

 

వాస్తవానికి ఈ ముగ్గురికి కరోనా పాజిటివ్‌ ఉందని టెస్టులో తేలింది. అయితే ఆ రిపోర్టులు వెలువడకముందే వీరు మరణించారు. కాస్త ధైర్యంగా ఆలోచించి ఉంటే ఈ ముగ్గురు మరణించే అవకాశమే లేదు. టెస్టుల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిందే తప్ప వీరిలో వ్యాధి లక్షణాలు మచ్చుకు కూడా కనిపించలేదు. అంటే వైరస్‌ వీరిని ఆశ్రయించినా వీరి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి  వైరస్‌ను సమర్ధవంతంగా అడ్డుకుంది. ఆ కారణంగానే వీరిలో వ్యాధి లక్షణాలు బయటపడలేదు. శరీరం వైరస్ను జయించే స్థితిలో ఉన్నా, మానసికంగా బలహీనపడటంతో ఇతర రూపాల్లో వీరిని మృత్యువు కబళించింది. 


ఇన్ఫెక్షన్‌.. డిసీజ్‌ కాదు. అంటే కరోనా వైరస్‌ శరీరంలో ప్రవేశించినంత మాత్రాన కరోనా వ్యాధిగ్రస్థులు కారు. వ్యాధి లక్షణాలు, దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోలేకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడే కరోనా వ్యాధిగ్రస్థుడిడుగా గుర్తించాలి. బాధాకరం ఏమంటే స్వాబ్‌ టెస్టుల్లో పాజిటివ్‌ వస్తే కరోనా రోగులుగా భావిస్తున్నారు. భయపడిపోతున్నారు. మన శరీరంలో కరోనా వైరస్‌ ఉండవచ్చు. అంతమాత్రన అది ప్రమాదకరం కాదు. దగ్గు, జర్వం తదితర వ్యాధి లక్షణాలు కనిపించనంత వరకు దాని గురించి బాధితులకు కాని, ఇతరులకు కాని ప్రమాదం లేదు. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చి, రోగ లక్షణాలు కనిపించలేదంటే ఆ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఆ వైర్‌సను బలపడకుండా కట్టడి చేస్తోందన్నమాట. అయితే ప్రజల్లో దీనిపట్ల అవగాహన లేకపోవడంతో పాజిటివ్‌ వచ్చిందంటేనే హడలిపోతున్నారు. అంతెందుకు ఫలితాలతో సంబంధం లేకుండా కరోనా టెస్ట్‌ చేశారంటేనే వారిని అంటరానివారుగా గుర్తించి వెలివేస్తున్నారు. సమాజంలో నెలకొన్న ఈ అనవసర భయాలు కరోనా పాజిటివ్‌ కేసులు, వారి కుటుంబ సభ్యుల పట్ల ఉరితాళ్లు పేనుతున్నాయి. ప్రజల్లో మార్పు రావాలంటే కరోనా పట్ల వారిలో అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేయాలి. 


భయం లేదు... 

కరోనా వైరస్‌ గణనీయంగా బలహీనపడిందన్నది వైద్యుల అభిప్రాయం. కరోనా ఆరంభం నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధిగ్రస్థులకు చికిత్సలు అందిస్తున్న డాక్టర్ల అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. జిల్లాలో ఏప్రిల్‌ మొదటి వారం నుంచి కరోనా కేసులు ఆరంభమయ్యాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఈ వైరస్‌ బారిన పడిన వారిలో 40 శాతం మంది తీవ్రమైన వ్యాధి లక్షణాలతో బాధపడేవారు. జ్వరం, తీవ్రమైన ఆయాసంతో ఇబ్బందిపడేవారు. వీరిలో ఆక్సిజన్‌ శ్యాచురేషన్‌ స్థాయి కూడా చాలా తక్కువగా ఉండేది. మనం తీసుకునే శ్వాస నుంచి 90 శాతం ఆక్సిజన్‌ శరీరంలోకి వెళ్లాలి. కానీ అప్పటి కేసుల్లో 70 నుంచి 75 శాతానికి తగ్గిపోయింది.


ఇది ప్రమాకర దశ. 22 రోజులపాటు ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స చేసిన తరువాత పరీక్షలు జరిపినా 40 శాతం మందికి పాజిటివ్‌ రిపోర్టులే వచ్చేవి. వీరిని మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం వస్తున్న కేసుల్లో ఈ పరిస్థితి లేదు. చాలా మందిలో అసలు వ్యాధి లక్షణాలే కనిపించడం లేదు. పది రోజుల చికిత్స తరువాత టెస్టులు చేస్తే నెగిటివ్‌ రిపోర్టులు వస్తున్నాయి. ఈ విషయాల అధ్యయనం ద్వారా వైరస్‌ బలహీనపడిందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. వైరస్‌ ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపించే సరికి కొంత బలహీనపడుతుంది. అతడి నుంచి మరొకరికి వ్యాపించే సరికి మరి కొంత బలహీనపడుతుంది. ఇలా క్రమక్రమంగా వైరస్‌ బలహీనపడుతుందని సైన్స్‌ చెబుతోంది. ప్రస్తుతం అదే జరుగుతోందని, వైరస్‌ వెరులెన్స్‌ (బలం) తగ్గుతూ వస్తోందని, ఆ కారణంగానే పాజిటివ్‌ కేసుల్లో చాలా మందికి వ్యాధి లక్షణాలే కనిపిచడం లేదని, మరో 4, 5నెలల్లో వైరస్‌ ప్రభావం పూర్తిగా క్షీణించిపోతుందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 


అందరిలో మార్పు రావాలి

ప్రజల్లో ఆందోళన తగ్గాలంటే స్వాబ్‌ పరీక్షల ఫలితాలను సాధ్యమైనంత వేగంగా వెల్లడించాలి. ప్రస్తుతం కరోనా ఫలితాల వెల్లడికి ఐదు నుంచి 7 రోజుల సమయం పడుతోంది. వైరస్‌ సోకినా లేకున్నా పరీక్షలకు నమూనాలు ఇచ్చిన ప్రజలు ఈ వారం రోజుల పాటు నరకం అనుభవిస్తున్నారు. స్వాబ్‌ ఫలితాలు ఎలా వస్తాయో, తనకు కరోనా వచ్చిందా, రాలేదా.. వచ్చుంటే ఏమైపోతాను, తన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అనే ఆందోళనతో మానసికంగా కుంగిపోతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొంత మంది తనువు చాలిస్తున్నారు. స్వాబ్‌ ఫలితాలను వెంటనే వెల్లడించడమే దీనికి పరిష్కారం. నమూనా సేకరించిన 24 లేదా 48 గంటల్లో ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలి.


రిపోర్టును సదరు వ్యక్తి మొబైల్‌కు మెసేజ్‌ చేసి తగు జాగ్రత్తలు తీసుకునేలా సూచించాలి. మరోవైపు సమాజంలోనూ చైతన్యం తీసుకురావాలి. కరోనా తొలిరోజుల్లో వ్యాధిగ్రస్థుడి పట్ల ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. బాధితుడి చిరునామా నుంచి అన్ని విషయాల గోప్యంగా ఉంచింది. అయితే మంది ఎక్కువయ్యే కొద్ది మజ్జిగ పలుచన అన్న చందంగా కేసులు పెరిగే కొద్దీ ఈ జాగ్రత్తలు కనుమరుగయ్యాయి. ఏదైనా ఒక ఇంట్లో స్వాబ్‌ తీస్తే నిమిషాల్లో ఆ సమాచారం దావాలనంలా వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు కుమిలిపోతున్నారు.


ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే. కరోనా వైరస్‌ ఏ ఒక్కరికో పరిమితం కాదు. అది ఎవరికైనా సోకవచ్చు. దీనికి ఎవరూ మినహాయింపు కాదు.. అనే విషయం అందరూ గుర్తించాలి. ప్రభుత్వం, అధికారులు ఈ తరహా చైతన్యం ప్రజల్లో తీసుకురావాలి. కనీస జాగ్రత్తలు పాటిస్తూ, వైరస్‌ బారిన పడినా పెద్ద ప్రమాదం లేదని విశ్వసిస్తూ, వ్యాధి బాధిత కుటుంబాల పట్ల మానవీయత ప్రదర్శిస్తూ ముందుకెళితే కరోనా మహమ్మారిని జయించే రోజు మరెంతో దూరంలో లేదు.  

Updated Date - 2020-07-08T11:07:36+05:30 IST