తీపికబురు

ABN , First Publish Date - 2022-04-25T05:30:00+05:30 IST

తీపికబురు

తీపికబురు


  • పోలీసు ఉద్యోగాల భర్తీ షురూ!
  • నోటిఫికేషన్‌ విడుదల చేసిన సర్కార్‌
  • ఉమ్మడి జిల్లాలో భారీగా భర్తీ కానున్న పోస్టులు
  • హోంగార్డులకు 25శాతం వరకు రిజర్వేషన్‌
  • ఆనందంలో నిరుద్యోగులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)నిరుద్యోగులకు శుభవార్త. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పోస్టుల భర్తీ వెంటనే చేపడతామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోలీసు శాఖలో భారీగా కొత్త రిక్రూట్‌మెంట్‌ చేపడుతూ పోలీసు నియామకమండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖలో 16,164 పోస్టులు భర్తీ చేస్తుండగా ఇందులో 16,027 పోలీసు కానిస్టేబుళ్లు కాగా 589 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం  తీసుకున్న ఈ నిర్ణయంతో రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో పోలీసు నియామకాలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నింపనున్న పోస్టుల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కువగానే పోస్టులు ఉన్నాయి. ఎస్‌ఐ పోస్టులను జోన్ల వారీగా, కానిస్టేబుల్‌ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలు చార్మినార్‌ జోన్‌లోకి వస్తాయి. మేడ్చల్‌ జిల్లా యాదాద్రి జోన్‌లోకి వస్తుంది. చార్మినార్‌ జోన్‌లో (జోన్‌ 6) 180 సివిల్‌, 36 ఏఆర్‌, ఆరు పోస్టులు ఎస్‌ఐఆర్‌ విభాగంలో ఉన్నాయి. వీటికి తోడు జిల్లాల వారీగా పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులు కూడా భారీగానే నింపుతున్నారు. మొత్తంగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి తోడు కొంతకాలంగా ఆయా కేటగిరీల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులు కూడా భర్తీచేయనున్నారు. కొత్త జోనల్‌ విధానం ప్రకారం నియామకాలు జరగనున్నాయి. కానిస్టేబుల్‌ సివిల్‌, ఏఆర్‌, ఫైర్‌మెన్‌ను జిల్లాస్థాయిలో భర్తీ చేస్తుండగా టీఎ్‌సఎస్పీ కానిస్టేబుల్‌ మల్టీజోన్‌, జైల్‌ వార్డర్‌, ఎస్సై పోస్టులను జోన్‌లు, ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను రాష్టస్థాయిలో భర్తీ చేయనున్నారు. 

మే2 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఆయా పోస్టులకు  మే 2నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. మే20 దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు విధించారు. జిల్లాలు, జోన్‌లవారీగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఠీఠీఠీ.్టటజూఞటఛ.జీుఽ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఇప్పటికే కోచింగ్‌ తీసుకుంటున్న నిరుద్యోగులు

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించిన వెంటనే నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. పల్లెల నుంచి చాలామంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ వివిధ కోచింగ్‌ సెంటర్లలో చేరి చదువులు తీవ్రతరం చేశారు. అయుతే, ఈ సారి నిరుద్యోగులకు ఉమ్మడి జిల్లాలో ప్రజాప్రతినిధుల నుంచి చక్కటి సహకారం అందుతోంది. రూ. వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లలో చేరలేని పేదలకు చాలామంది ఎమ్మెల్యేలు స్థానికంగానే ఉచిత కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి వారికి కోచింగ్‌ ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగులకు కోచింగ్‌ ఇవ్వడంతో పాటు వారికి భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఈసారి పోలీస్‌ శాఖ కూడా అన్ని జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికి శిక్షణనిస్తోంది. పోలీస్‌ శిక్షణలో అనుభవమున్న అధికారులను వాటికి ఇన్‌చార్జిలుగా నియమించి నిరుద్యోగులకు చక్కటి శిక్షణనిస్తున్నారు.  ఫీజులు చెల్లించి ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌లో చేరకుండా నష్టపోతున్నామని మదనపడుతున్న పేద నిరుద్యోగులు ఈ ఉచిత కోచింగ్‌ సెంటర్లలో భారీగా చేరారు. 

నియామక ప్రక్రియలో మార్పు

 పోలీస్‌ పోస్టులను మూడు దశల్లో భర్తీ చేయనున్నారు. మొదట ప్రిలిమనరీ రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తుది రాతపరీక్ష ఉంటుంది. ఇదిలా ఉంటే నియామక ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. గతంలో  పురుష అభ్యర్థులకు 800 మీటర్ల పరుగుపందెం నిర్వహించే వారు ఇపుడు 1600 మీటర్ల పరుగును నిర్వహిస్తారు. దానిని 7.15నిమిషాల్లో పూర్తి చేయాలనే నిబంధన పెట్టారు. గతంలో మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగుపందెం ఉండగా ఇపుడు 800 మీటర్లకు పెంచారు. ఈ  దూరాన్ని  5.20 నిమిషాల్లో పూర్తి చేయాలి. అభ్యర్థుల పరుగును రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎ్‌ఫఐడీ) సాంకేతికతతో నమోదు చేస్తారు. 

పోటాపోటీగా చదువులు

ఉద్యోగాల ప్రకటన వెలువడినా నోటిఫికేషన్లు రాకపోవడంతో నిన్నటి వరకు నిరుద్యోగుల్లో కొంత నిరాశ కనిపించింది. కానీ, సోమవారం పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రావడంతో వారిలో ఆశలు రేకెత్తాయి. ఇప్పటికే పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగులు దానికి మరింత పదునుపెట్టారు. ఎలాగైనా పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. 

రిజర్వేషన్లు ఇలా..

మహిళా అభ్యర్థులకు సివిల్‌ పోస్టుల్లో 33 శాతం, ఏఆర్‌లో 10 శాతం రిజర్వేషన్‌  అమలు చేయనున్నారు. హోంగార్డులకు ఆయా పోస్టులను బట్టి 15 నుంచి 25శాతం వరకు రిజర్వేషన్‌ కల్పించారు.

భర్తీకానున్న పోస్టులు

సివిల్‌ కానిస్టేబుళ్లు

ప్రాంతం బ్యాక్‌లాగ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌

సైబరాబాద్‌ 7 41

రాచకొండ 8 325

వికారాబాద్‌ 2 33

ఏఆర్‌ కానిస్టేబుళ్లు

సైబరాబాద్‌ 11 392

రాచకొండ 12 505

వికారాబాద్‌ 02 70

జిల్లాస్థాయి పోస్టులు ( పోలీసు మినహా)

జిల్లా బ్యాక్‌లాగ్‌ డైరెక్ట్‌ 

రిక్రూట్‌మెంట్‌

రంగారెడి ్డ 1 24

మేడ్చల్‌ 0 21

వికారాబాద్‌ 0 16

విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ

జిల్లా బ్యాక్‌లాగ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌

రంగారెడ్డి 1(బీసీ-సీ) 24

మేడ్చల్‌ 0 21

వికారాబాద్‌         0 16

ఎస్‌ఐ పోస్టులు

జోన్‌ సివిల్‌ ఏఆర్‌ ఎస్‌ఏఆర్‌

చార్మినార్‌ జోన్‌ 180 36 6

సివిల్‌ కానిస్టేబుళ్ల బ్యాక్‌లాగ్‌ పోస్టులు

బ్యాక్‌లాగ్‌ పోస్టులు కేటగిరి బీసీ(సీ)

రాచకొండ 8

సైబరాబాద్‌ 7

వికారాబాద్‌ 2

ఏఆర్‌ కానిస్టేబుళ్ల బ్యాక్‌లాగ్‌ పోస్టులు

రాచకొండ బీసీ(ఎ)-1, బీసీ(సీ)-2, 

సైబరాబాద్‌ బీసీ(సీ)-10, బీసీ-ఇ-1

వికారాబాద్‌ బీసీ(సీ)-2

Updated Date - 2022-04-25T05:30:00+05:30 IST