Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుమలలో ఉచిత దర్శనాలను అనుమతించాలి : స్వరూపానందేంద్ర స్వామి

విశాఖపట్నం : కొవిడ్ కారణంగా నిర్వీర్యమవుతున్న హిందూ ధర్మ ప్రచారంపై దృష్టి సారించాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం సూచించారు. నూతన పంధాలో ప్రచారం చేపట్టడం ద్వారా కొవిడ్ సమస్యలను అధిగమించవచ్చని అన్నారు. చాతుర్మాస్య దీక్షలో ఉన్న పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు గురువారం రిషికేష్‌లో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారు పలు కీలక సూచనలు చేశారు. తిరుమలలో ఉచిత దర్శనాలను కొవిడ్ కారణంగా నిలిపివేయడం సరికాదని, నిర్దిష్ట సంఖ్యలో భక్తులను నిత్యం ఉచిత దర్శనానికి అనుమతించాలని వైవీ సుబ్బారెడ్డికి సూచించారు. 

నూతన ఆలయాల నిర్మాణంపై శ్రద్ధ చూపుతున్నట్లే, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు సైతం టీటీడీ కృషి చేయాలని తెలిపారు. దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారం కోసం చైతన్య రథాలను నూతనంగా రూపొందించాలన్నారు. వైఎస్సార్ హయాంలో భజన బృందాలను ప్రోత్సహించినట్లే, ఈ ప్రభుత్వం హిందూ ధర్మ ప్రచారానికి వాటిని వినియోగించుకోవాలని సూచించారు. టీటీడీ నిర్వహణలోని హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా భజన బృందాలకు ఉచితంగా ప్రచార సామగ్రిని అందజేయాలని సూచించారు. అన్నమయ్య ప్రాజెక్టును ప్రక్షాళన చేయాలని అన్నారు. దేవాదాయ శాఖలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, వాటిని సరిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పారు. ఉన్నత ఆలోచనలతో పనిచేసే అధికారులను ఆలయాలకు ఈవోలుగా నియమించాలని అన్నారు. ఖాళీగా ఉన్న వేదపారాయణదారుల పోస్టులను టీటీడీ భర్తీ చేయాలని సూచించారు.

Advertisement
Advertisement