తాలు పేరిట కొనుగోళ్ల నిలిపివేత

ABN , First Publish Date - 2021-04-21T07:02:53+05:30 IST

రిధాన్యంలో తాలు ఉందన్న సాకుతో నల్లగొండలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మిల్లర్లు లారీలను వెనక్కు మలిపారు.

తాలు పేరిట కొనుగోళ్ల నిలిపివేత
నల్లగొండలో రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు, రైతులు

 ఆగ్రహించిన రైతులు

 రాస్తారోకోతో స్తంభించిన రహదారులు

 పోలీసుల జోక్యంతో ధర్నా విరమించిన రైతులు

 నల్లగొండ రూరల్‌, ఏప్రిల్‌ 20: వరిధాన్యంలో తాలు ఉందన్న సాకుతో నల్లగొండలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మిల్లర్లు లారీలను వెనక్కు మలిపారు. వారం పదిరోజులుగా కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్న రైతులు ఆందోళనకు దిగారు.  నల్లగొండ మండలంలోని కంచనపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల రైతులు  మంగళవారం నల్లగొండ సమిపంలోని బత్తాయి మార్కెట్‌ వద్దగల సాగర్‌ రోడ్డుపైన ముందుగా ధర్నా నిర్వహించారు. రెండు గంటలపాటు రైతులు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసీ రైతుల ధర్నా విరమింప జేశారు. అయినా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో నల్లగొండ పట్టణంలోని హైదరాబాదులో రోడ్డు రైల్వే ట్రాక్‌ సమిపంలో రోడ్డుపై వాహనాలు అండంగా నిలిపి పెద్ద ఎత్తున్న రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారి కావడంతో ఎటూ రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోలో రైతు సంఘం నాయకులు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున మాట్లాడాతూ వరిధాన్యంలో తాలు ఉందనే సాకుతో రైతుల ధాన్యాన్ని జిల్లాలో మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదన్నారు. తరుగు పేరుతో  బస్తాకు పదిశాతం కోత విధిస్తామని అనడంతో రైతుకు అధికమొత్తంలో నష్టం వాటిల్లనుందని ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లర్లు సిండికేట్‌ అయి రైతులకు నష్టం కలిగే విధంగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సిండికేట్‌ విధానాన్ని రద్దు చేసి, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు రిపేర్‌, ఇతర సమస్యలు వస్తున్నాయని, వెంటనే కాంటాలను రిపేర్‌ చేసి, పాతవాటి స్థానంలో కొత్త కాంటాలను ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. గన్నీ బ్యాగులు పొడవు పెంచి వెడల్పు తంగ్గించడం వల్ల తూకం వేయడానికి ఇబ్బందిగా ఉన్నదని, కొనుగోలుకు ఆటంకంగా మరిందని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ప్రతిధాన్యపు గింజనూ ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. రాస్తారోకోలో సీపీఎం నాయకులు బొజ్జ వెంకన్న, ఊట్కూరి నర్సిరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పోలీ సత్యనారాయణ, బొజ్జా పాండు, బొజ్జ చిరంజీవి, బొజ్జ లింగయ్య పాల్గొన్నారు. 

షరతులు లేకుండా ధాన్యం కొనుగోలుచేయాలి

శాలిగౌరారం: ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని  మండలంలోని అడ్లూరు, ఆకారం, శాలిగౌరారం గ్రామాలకు చెందిన రైతులంతా కలిసి అడ్లూరు గ్రామంలో నకిరేకల్‌-మోత్కురు ప్రధాన రహదారిపై గంటకు పైగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్‌, మాట్లాడుతూ రైతులు కేంద్రాల్లో ధాన్యం పోసీ 15 రోజులకు పైగా పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు.  కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు బండపల్లి కొమరయ్య, భూపతి అంజయ్య, సర్పంచ్‌ కందాల సమరంరెడ్డి,  ఎంపీటీసీ నక్క శంకరమ్మ, మల్లేష్‌, చింత ధనుంజయ్‌, నరేష్‌, బోడ విజయ్‌, వలిశెట్టి సైదులు ఉన్నారు.

ఆరేళ్లుగా లేని తాలు ఇప్పుడెలా వచ్చింది: బొజ్జ వెంకన్న, రైతు

గత ఆరేళ్లుగా లేని తాలుశాతం ఇప్పడే ఎందుకు అధికంగా ఉంది. మిల్లర్లు కావాలనే రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. బస్తాకు 10శాతం తరుగు తీస్తే 100 బస్తాలు అమ్మిన రైతుకు పది బస్తాల నష్టం జరుగుతుంది. అధికారులు స్పందించి వెంటనే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలి.        

Updated Date - 2021-04-21T07:02:53+05:30 IST