భూరిజిస్ట్రేషన్లు నిలిపివేత

ABN , First Publish Date - 2022-07-03T04:35:07+05:30 IST

తిరిగి ఏమి జరిగిందో ఏమో కానీ.. శుక్రవారం సాయంత్రం నుంచి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

భూరిజిస్ట్రేషన్లు నిలిపివేత
ప్రజలు లేక శనివారం వెలవెలబోయిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

స్పష్టత లేని ప్రభుత్వ ఉత్తర్వులు 

లబోదిబోమంటున్న రియల్టర్లు

రాజంపేట, జూలై 2 : తిరిగి ఏమి జరిగిందో ఏమో కానీ.. శుక్రవారం సాయంత్రం నుంచి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అందులో భాగంగా అన్నమయ్య, కడప జిల్లాలతో పాటు రాజంపేట సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఒక్కసారిగా ఉన్నతాధికారుల నుంచి అనధికారిక ఉత్తర్వులు అందడంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఒక్క రాజంపేట ప్రాంతంలోనే దీనివల్ల ఒక్కసారిగా శుక్ర, శనివారాల్లో జరగాల్సిన వంద రిజిస్ట్రేషన్లకు పైబడి నిలిచిపోయాయి. గతంలో అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయవద్దని చెప్పడంతో సుమారు మూడు నెలల పాటు సంబంధిత అనధికార లేఅవుట్లుకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఇటీవల డైరెక్ట్‌రేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌కు అనధికార లేఅవుట్లను నిషిద్ధ జాబితాలో ఉంచే అధికారం లేదని పేర్కొంటూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడంతో కొన్ని రోజుల నుంచి తిరిగి రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. డీటీసీపీ అధికారులు అందజేసిన నిషిద్ధ జాబితాలో అనధికార లేఅవుట్లను జిల్లా రిజిస్ట్రార్లు సర్వే వారీగా డీనోటిఫై చేయడంతో ఈ రిజిస్ట్రేషన్లు పది రోజులుగా జరిగాయి. దీనివల్ల మూడు నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు ఊపందుకుని రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రావడంతో పాటు కొత్త వెంచర్లు వేసిన రియల్టర్లు, కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో శుక్రవారం సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్లను అనధికారికంగా నిలిపివేయడంతో రిజిస్ట్రేషన్‌ చేయడానికి సిద్ధం చేసిన వందలాది రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను పక్కన పడేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది రిజిస్ట్రేషన్లు ఆపివేశారు. దీంతో 2021 నుంచి వేసిన కొత్త వెంచర్‌దారులు, కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. తిరిగి ఏం ఉత్తర్వులు వస్తాయో.. అని ఆందోళన చెందుతున్నారు. దీనిపై రాజంపేట సబ్‌ రిజిస్ట్రార్‌ పార్వతిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా రిజిస్ట్రేషన్లపై సోమవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశముందని, అప్పటి వరకు రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2022-07-03T04:35:07+05:30 IST