ప్రాణాలు తీసిన ఈత సరదా

ABN , First Publish Date - 2020-08-02T10:04:20+05:30 IST

పుట్టిన రోజు సందర్భంగా సముద్రంలో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంత య్యారు..

ప్రాణాలు తీసిన ఈత సరదా

సముద్రంలో ఇద్దరుచిన్నారులు గల్లంతు

 కోస్టల్‌ బ్యాటరీ ఎదుట ఘటన

 కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు


విశాఖపట్నం, ఆగస్టు 1: పుట్టిన రోజు సందర్భంగా సముద్రంలో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంత య్యారు.. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు.. మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో సంఘటన జరగ్గా సమాచారం అందుకున్న పోలీసులు రెండు పడవలతో గజ ఈతగాళ్లను పెట్టి చీకటి పడే వరకు వెదికినా వారి ఆచూకీ లభించలేదు. వన్‌టౌన్‌ పోలీసుల కథనం మేరకు... జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన కడగాని సిద్ధార్థ పుట్టిన రోజు కావడంతో అతనితోపాటు అదే ప్రాంతానికి చెందిన యశోవర్థన్‌ (14), రోహిత్‌ (13), ఎస్‌.యువరాజు , బి.రూపేష్‌, వి.రాకేష్‌, జి.హేమంత్‌, బి.రాకేష్‌ సముద్రంలో ఈతకు శనివారం మధ్యాహ్నం వెళ్లారు. ఎవరికీ ఈత రాదు. కోస్టల్‌ బ్యాటరీ వద్ద స్నానం చేస్తున్నారు. యశోవర్దన్‌, రోహిత్‌లకు సమీపంలో ఓ థర్మాకోల్‌ షీట్‌ లభించడంతో దాన్ని పట్టుకుని కాస్త లోపలికి వెళ్లారు.


ఆ సమయంలో వచ్చిన కెరటం ఇద్దరినీ లోపలికి లాగేసింది. దీంతో ఆందోళన చెందిన మిగిలిన ఆరుగురు పిల్లలు అరవడంతో స్థానిక మత్స్యకారులు వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలిం చలేదు. అందరూ చూస్తుండగానే ఇద్దరూ మునిగిపోయారు. చలపతిరావు, ఎలీషా దంపతులకు రోహిత్‌ ఏకైక కొడుకు. ఏడో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం ఇంటి వద్దే ఆడుకుంటుండేవాడని తల్లి ఎలీషా భోరుమంది. తొమ్మిదో తరగతి చదువుతున్న యశోవర్దన్‌కు తండ్రి గతంలో చనిపోగా తల్లి ధనలక్ష్మి వున్నారు. మధ్యాహ్నం స్నేహితులతో బయటకు వెళ్తానంటే వద్దనన్నానని, ఎంతచెప్పినా వినకుండా నాకు కడుపుకోత మిగిల్చాడని ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న ధనలక్ష్మి గుండెలవిసేలా రోదిస్తోంది. 

Updated Date - 2020-08-02T10:04:20+05:30 IST