సర్వే గుబులు

ABN , First Publish Date - 2022-08-12T05:35:59+05:30 IST

డీపట్టా భూములను లీజు రూపంలో కొనుగోలు చేసి అనుభవిస్తున్న వారిలో భూముల రీసర్వే గుబులు పుట్టిస్తోంది. ఆ భూములు రికార్డు పరంగా ఎవరి పేరున ఉన్నాయో వారి పేరునే మళ్లీ రీ సర్వే చేస్తున్నారు. దీంతో ఆ భూములు కొనుగోలు చేసిన వారిలో నిరాశ అలముకుంది.

సర్వే గుబులు


డిపట్టా భూముల కొనుగోలుదారుల్లో వణుకు
అసలు యజమానుల పేరుతోనే మార్పులు
నిరాశలో ప్రస్తుత అనుభవదారులు
కొన్నిచోట్ల సర్వే చేస్తున్న వారు మిలాఖత్‌


డీపట్టా భూములను లీజు రూపంలో కొనుగోలు చేసి అనుభవిస్తున్న వారిలో భూముల రీసర్వే గుబులు పుట్టిస్తోంది. ఆ భూములు రికార్డు పరంగా ఎవరి పేరున ఉన్నాయో వారి పేరునే మళ్లీ రీ సర్వే చేస్తున్నారు. దీంతో ఆ భూములు కొనుగోలు చేసిన వారిలో నిరాశ అలముకుంది. ఏమవుతాయోనని కలవర పడుతున్నారు. దశాబ్దాలుగా ఇతరుల అనుభవంలో ఉన్న ఆ భూములకు అసలు యజమానులను గుర్తు చేసే విధంగా పరిస్థితి మారడంతో కొన్నిచోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఇంకొన్ని గ్రామాల్లో సర్వే చేస్తున్న వారు మిలాఖత్‌ అవుతున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

భూమిలేని పేదలకు ప్రభుత్వం డి పట్టాలు అందిస్తుంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఎసైన్డ్‌ భూములు కూడా ఇస్తుంటుంది. ఈ భూముల్లో క్రయవిక్రయాలు చేయకూడదు. వాటిపై వంశపారంపర్యంగా అనుభవదారులకు హక్కులు సంక్రమిస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి భూములు అన్ని మండలాల్లోనూ చేతులు మారాయి. క్రయ విక్రయాలు జరిగాయి. డి పట్టా భూమి అమ్మకానికి అవకాశం లేని కారణంగా 99 ఏళ్లు లీజు రూపంలో అధికారికంగా రాయించుకునే విధానం జిల్లాలో ఎప్పటినుంచో నడుస్తోంది. అయితే భూమి హక్కులు మాత్రం రికార్డు పరంగా ముందుగా ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టా యజమానికే దక్కుతాయి. ఇప్పుడు జరుగుతున్న సర్వే కూడా అసలు యజమాని పేరుపైనే చేస్తున్నారు. దీంతో ప్రస్తుత అనుభవదారులు కలవర పడుతున్నారు.
ఇతర జిల్లాల నుంచి వచ్చి డీ పట్టా భూములను కొనుగోలు చేసిన వారు జిల్లాలో కోకొల్లలు. ఆ భూముల్లో క్రయ విక్రయాలకు అవకాశం లేని కారణంగా 99 ఏళ్ల లీజులో కొనసాగుతున్నాయి.  కాగా భూముల రీ సర్వే జిల్లాలో సాగుతోంది. సర్వేలో భూములు రికార్డు పరంగా ఎవరి పేరున ఉన్నాయో వారి పేరునే మళ్లీ రీ సర్వే చేస్తున్నారు. ఈ విషయం కొనుగోలు చేసిన వారిలో దడ పుట్టిస్తోంది. దశాబ్దాలుగా తమ అనుభవంలో ఉన్న భూములను తిరిగి రీ సర్వే పేరుతో అసలు యజమానులకు గుర్తు చేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో అనేక చోట్ల కొనుగోలుదార్లతో తగాదాలకు దిగుతున్నారు. రికార్డుల పరంగా తమ పేరున ఉంది కనుక ఆ భూములు తమకే చెందుతాయని కొందరు వాదిస్తున్నారు. ఒక్కోసారి ఇరువర్గాలూ ఘర్షణలకు దిగుతున్నారు.

 పూసపాటిరేగ మండలం ఒక్క కొల్లాయివలస గ్రామంలోనే సుమారు 100 ఎకరాల డీ పట్టా భూములు చేతులు మారాయి. ఈ మండలం మీదుగా జాతీయ రహదారితో పాటు సముద్ర తీరం ఉంది.  పరిశ్రమలు విస్తరించాయి. సమీపంలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణమవుతోంది. ఇలా వివిధ కారణాలతో భూములకు భారీ ధరలు పలుకుతున్నాయి. అయితే డీ పట్టా భూములు కాస్తా తక్కువకు వస్తాయన్న కారణంతో పెద్దఎత్తున ఈ మండలంలో డీ పట్టా భూములు చేతులు మారుతున్నాయి. దీంతో రీ సర్వే జరుగుతున్న నేపథ్యంలో ఈ మండలంలో అమ్మకం చేసిన రైతులు, కొనుగోలుదారులు, రీ సర్వే చేస్తున్న వారు కుమ్మకవుతున్నారు. ఈ క్రమంలో డబ్బులు కూడా చేతులుమారుతున్నాయి.

 డిపట్టా క్రయ విక్రయాల ద్వారా అన్ని మండలాల్లోనూ భూములు చేతులు మారాయి. అయితే ఉమ్మడి జిల్లాలోని ఏజన్సీలో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. మెంటాడ మండలం లోతుగెడ్డ గ్రామంలోని పరిస్థితి ఇందుకో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ల్యాండ్‌సీలింగ్‌ భూములను ప్రభుత్వం కొంత మంది రైతులకు డిపట్టాలుగా ఇచ్చింది. ఈ భూములు వారి పేరునే ఉన్నాయి. కాని వీటినే మరో రైతు కొనుగోలు చేసుకుని అనుభవదారునిగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే ఇరువర్గాల మధ్య వివాదాస్పదమవుతోంది. ఇదే సమస్య అన్ని మండలాల్లోనూ తలెత్తుతోంది. గ్రామాల్లో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

చురుగ్గా భూముల రీసర్వే : అజయ్‌ కల్లం
కలెక్టరేట్‌(శ్రీకాకుళం), ఆగస్టు 11: రాష్ట్రంలో చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం రీ సర్వే చురుగ్గా జరుగుతోందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లాం అన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబరు రెండు నాటికి మూడు జిల్లాల్లో సుమారు 400 గ్రామాల్లో భూ హక్కు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రీసర్వేతో  90 శాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయని  చెప్పారు. దీనిపై రైతులు కూడా సంతృప్తికరంగా ఉన్నారన్నారు.  30 శాతం  రోడ్‌ ఫైయింగ్‌ కూడా పూర్తయిందన్నారు. రికార్డులను ఎవరూ మార్చలేని విధంగా, ట్యాంపర్‌ చేయలేని విధంగా పారదర్శకంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో తొమ్మిది లక్షల 86 వేల ఎకరాల్లో భూ సర్వే చేపట్టాల్సి ఉందన్నారు. ఇందులో 1,466 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల తొమ్మిది నాటికి శ్రీకాకుళం డివిజన్‌లో 97, టెక్కలి డివిజన్‌లో 56, పలాస డివిజన్‌లో 40 గ్రామాల్లో రీసర్వే నోటిఫికేషన్‌ పూర్తయ్యిందని చెప్పారు. అక్టోబర్‌ రెండు నాటికి 480 గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని వివరించారు.  ఈ సమావేశంలో సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌, అదనపు సంచాలకులు శ్రీనివాసరావు, విజయనగరం, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు సూర్యకుమారి, నిశాంత్‌ కుమార్‌, శ్రీకాకుళం జేసీ ఎం.విజయసునీత, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-12T05:35:59+05:30 IST