గంజాయి రవాణాపై నిఘా

ABN , First Publish Date - 2021-10-29T05:26:30+05:30 IST

జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలు, మూలాలపై నిఘా పటిష్టం చేసినట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో గంజాయి నియంత్రణపై అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

గంజాయి రవాణాపై నిఘా
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

 - ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, అక్టోబరు 28: జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలు,  మూలాలపై నిఘా పటిష్టం చేసినట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో గంజాయి నియంత్రణపై అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి విక్రయదారులపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలన్నారు. గంజాయిని నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గంజాయి  రవాణా చేస్తున్న వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. గంజాయితోపాటు గుట్కా, ఇతర మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో నియంత్రించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో కొందరు మిర్చి, పత్తితోపాటు గంజాయిని సాగుచేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాటి మూలాలను తొలగించాలన్నారు. గంజాయి తాగేవారు ప్రత్యేకంగా వాట్సప్‌గ్రూప్‌ ఏర్పాటు చేసుకుంటున్నారని, వారి కదలికలపై నిఘా పెంచాలని అన్నారు. జిల్లాలో గంజాయి తాగేవారి డాటాను సేకరించాలని, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయదారుల వివరాలు సేకరించాలని, ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని పేర్కొన్నారు. గంజాయిని నియంత్రించడంలో ఫలితాలు సాధించిన పోలీసు అధికారులకు రివార్డులు అందజేస్తామన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కళాశాలలు, ఇతర ప్రాంతాలపై దృష్టి సారించాలని, గంజాయి అమ్మకాలు, వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.  సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు చంద్రశేఖర్‌, చంద్రకాంత్‌, రవికుమార్‌, సీఐలు అనిల్‌కుమార్‌, ఉపేందర్‌, మొగిలి, వెంకటేశ్‌, సర్వర్‌, ఎస్సైలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:26:30+05:30 IST