నిఘా నేత్రం

ABN , First Publish Date - 2022-05-18T04:50:50+05:30 IST

ఎవరూ చూడడం లేదని దర్జాగా దొంగతనం, హత్యలు, రోడ్డు ప్రమాదాలు చేసి పరారయ్యే నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.

నిఘా నేత్రం
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

- జిల్లాలో పెరుగుతున్న సీసీ కెమెరాల ఏర్పాట్లు

- దొంగతనాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాల్లో కీలకం

నారాయణపేట క్రైం, మే 17 : ఎవరూ చూడడం లేదని దర్జాగా దొంగతనం, హత్యలు, రోడ్డు ప్రమాదాలు చేసి పరారయ్యే నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. పోలీసుల కృషి, దాతల సహకారంతో పట్టణాల నుంచి పల్లెల దాకా సీసీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి.  పోలీస్‌ శాఖ ప్రత్యేక చొరవ తీసుకొని నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా పట్టణాలు, పల్లెల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎస్పీ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేసి నలుగురు పోలీస్‌ సిబ్బందిచే 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పెట్రోలింగ్‌ పోలీసులకు తెలియజేసి నిందితులను పట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా 1408 సీసీ కెమెరాలు..

జిల్లా వ్యాప్తంగా నేను సైతం, కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా మొత్తం 1408 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో పోలీస్‌శాఖ అవగాహన కార్యక్రమాలతో వ్యాపారస్తులు, ఇంటి యజమానులు స్వచ్ఛందంగా 1097 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోగా, జిల్లా పోలీస్‌శాఖ 311 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించింది. కాగా జిల్లాలో సీసీ కెమెరాలు పనితీరును మరింత మెరుగుప ర్చేందుకు పోలీస్‌శాఖ విజ్ఞప్తి మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఎంపీ నిధుల నుంచి రూ.28 లక్షలను కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ.10 లక్షలను జిల్లా పోలీస్‌శాఖకు అందించగా అత్యాధునికమైన సీసీ కెమెరాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. 

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి..

దొంగతనాలు జరిగిన తర్వాత మేల్కొనేకంటే ముం దస్తు జాగ్రత్తలో భాగంగా ప్రజలు సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేసుకుంటే ఎంతో మంచిది. వ్యక్తిగత భద్రతలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చట్టం లో కూడా ఉంది. కాబట్టి ప్రతీ  ఇంటి యజమాని, వ్యాపారస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. 

- ఎన్‌.వెంకటేశ్వర్లు, ఎస్పీ, నారాయణపేట



Updated Date - 2022-05-18T04:50:50+05:30 IST