Advertisement
Advertisement
Abn logo
Advertisement

సర్వే..జనా!

 మత్తులో ముందుకు.. ఆరోగ్యంలో వెనుకకు

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి

రాష్ట్ర సగటుకన్నా జిల్లాలోనే మత్తు బానిసలు అధికం

మహిళల్లో కూడా మొదలైన మద్యం అలవాటు

పెరిగిన రక్తపోటు, మధుమేహ బాధితులు

10 శాతం మందికి ఇంకా కట్టెల పొయ్యిలే.. 

భారీగా పెరిగిన బాలికల శాతం

అయోడైజ్జ్‌ ఉప్పు అంటే తెలియని కుటుంబాలు 15శాతం

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి

  

జిల్లా జనాభా మత్తులో ముందుకు.. ఆరోగ్యంలో వెనకకు వెళుతున్నారా..? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అదే వెల్లడిస్తోంది. 2019-20 సంబంధించిన తాజా సర్వేలో పలు విషయాలు వెలుగు చూశాయి. జీవన ప్రమాణాలు మెరుగవుతున్నా వ్యక్తిగత శ్రద్ధలో మాత్రం వెనకబడిపోయాం..! గతంలో కంటే బీపీ, షుగర్‌ బాధితులూ జిల్లాలో పెరిగారు. విద్య, ఆరోగ్యం వంటి ముఖ్యమైన అంశాల్లో మహిళల్లో నిరాసక్తత, నిర్లక్ష్యం అలుముకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. తాజా సర్వేపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


గుంటూరు(తూర్పు), డిసెంబరు4: చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ మత్తు కోసం వెంపర్లాడుతున్నారు. పేదరికం, ఆరోగ్యం, విద్య వంటి అంశాలు జిల్లాలో పెద్దగా ఆందోళన కలిగించకపోయినా ప్రమాదకరమైన మత్తుకు బానిసలవుతున్న వారి సంఖ్య రాష్ట్ర సగటుకన్నా జిల్లాలో అధికంగా నమోదైంది. అరికట్టే చర్యలు ప్రారంభించకపోతే ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటూ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) తన తాజా నివేదికలో వెల్లడించింది. 2019-20 సంవత్సరానికి జిల్లా భౌగోళిక పరిస్థితులు, కుటుంబ స్థితిగతులు, శిశుసంరక్షణ, ఆరోగ్యం, ఆర్థికం వంటి దాదాపు 104 అంశాలపై చేసిన సర్వేకు సంబంధించిన గణాంకాలను ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ తాజాగా వెల్లడించింది.

-  రాష్ట్రవ్యాప్తంగా 11,346 కుటుంబాలను, 10,975 మహిళలు, 1,558 పురుషులపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో 851 కుటుంబాలు, 807మంది మహిళలు, 93మంది పురుషులు నుంచి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ వివరాలను సేకరించింది.

 

 అధికంగా మత్తు బానిసలు..

జిల్లాలో 15 సంవత్సరాలు దాటిన మగవారు మద్యానికి 24.5శాతం, పొగాకు, ఇతర మత్తు పదార్ధాలకు 25.4శాతం, అదే మహిళల్లో పొగాకు, ఇతర మత్తుపదార్ధాలకు 1.6శాతం, మద్యానికి 0.2(ప్రతి 1000 మందిలో ఇద్దరు), బానిసలయ్యారు. ఇదే అంశంలో రాష్ట్ర సగటు పురుషుల్లో మద్యం బారిన 20.5శాతం, పొగాకు ఇతర మత్తు పదార్ధాలకు 15.8 శాతం మంది బానిసలు ఉన్నారు. ఈ అంశంలో రాష్ట్ర సగటు కంటే జిల్లా సగటు ఎక్కువుగా నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం.


 పెరిగిన బీపీ, షుగర్‌ బాధితులు..

జిల్లాలోని పురుషులు 25.9శాతం మందిలో,  మహిళలు 25.8 శాతం మందిలో శరీరంలో చక్కెరస్థాయి అధికంగా ఉంది. రక్తపోటు బారిన పడినవారు పురుషులు 31.3 శాతం, మహిళలు 25.8 శాతం మంది ఉన్నారు. ఇదే సంస్థ 2015- 16లో ఇచ్చిన నివేదికలో వీటి బారిన పడినవారి శాతం 10లోపు మాత్రమే ఉంది. 


ట్రాఫిక్‌ నిబంధనలు పాటించం..

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించే విషయంలో పూర్తిగా వెనుకబడి ఉన్నాం. సిగ్నల్స్‌ దగ్గర ఆగకపోవడం, ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడపడం, పరిమితికి మించి ప్రయాణించడం వంటి విషయాల్లో 76.9శాతంగా ఉండగా, సరైన పత్రాలు, పూర్తిస్థాయిలో శిక్షణ లేకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందినవారు 81.9శాతంగా ఉన్నారు. భారీ వాహనాలను నడిపేవారు మాత్రం అన్ని నియమాలు పాటిస్తున్నారని, నగరం లోపల తిరిగే ద్విచక్రవాహనాలు, ఆటోడ్రైవర్లు ఎటువంటి నియమాలు పాటించడం లేదని నివేదికలో పేర్కొన్నారు.


ఇంకా కట్టెల పొయ్యిలే..

గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిమీద వంట చేసుకునే పేద కుటుంబాలు 10శాతం ఉన్నాయి. సరైన అవగాహన లేక, పెరిగిన గ్యాస్‌ ధరలు వంటి కారణాలతో కట్టెల పొయ్యి మీద వంట వండుతున్నారు.  90శాతం మంది వంటకు గ్యాస్‌ పొయ్యిను వినియోగిస్తున్నారు. 


భారీగా పెరిగిన బాలికల శాతం.. 

జిల్లాలో గత రెండుసంవత్సరాలు నుంచి నమోదైన జననాల్లో బాలికల శాతం గణనీయంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది బాలురు 1,055 మంది బాలికలు ఉన్నారు. గతంలో 1000 మందికి 941 మంది మాత్రమే ఉండేవారు. అబార్షన్‌లు, గర్భస్థ సమయంలో లింగ సంబంధిత పరీక్షలు వంటి వాటిపై కఠినంగా ఉండటం వల్లే జిల్లా ఈ ప్రగతిని సాధించిందని నివేదికలో పేర్కొన్నారు.


విద్య, ఆరోగ్యం పట్ల మహిళల్లో నిరాసక్తత

విద్య, ఆరోగ్యం వంటి ముఖ్యమైన అంశాల్లో మహిళల్లో నిరాసక్తత, నిర్లక్ష్యం అలుముకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అక్షరాస్యులైన మహిళలు 68.5శాతం, 10 లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న మహిళలు 32.6శాతం, 20-24 సంవత్సరాలు కలిగిన మహిళల్లో 18 సంవత్సరాలు కంటే ముందు వివాహం చేసుకున్న వారు 35.4 శాతం, 15-19 సంవత్సరాలకే గర్భం దాల్చుతున్న వారిసంఖ్య 20.7గా నమోదు అయింది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్న వారి సంఖ్య కేవలం 16.6 శాతంగా ఉంది. ఇది గతంలో కంటే (28.7శాతం) తక్కువుగా నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం.


శిశు ఆరోగ్యం మరింత క్షేమం

ప్రసవానంతరం మొదటి మూడునెలల్లో వైద్య పరీక్షలు చేయుంచుకున్న తల్లులు 89.4శాతం ఉన్నారు. అలాగే చైల్డ్‌ ప్రొటెక్షన్‌, రిజిస్టర్‌ గర్భాలు 38.2శాతం, ప్రసవానంతరం డాక్టర్‌, ఆరోగ్య సిబ్బంది ద్వారా సురక్షితంగా ఉన్న తల్లులు 94.0శాతం మంది ఉన్నారు. పుట్టిన పిల్లలకు అందించే టీకాలు, ఇతర ఆరోగ్య విషయాల్లో దాదాపు 80శాతం మంది తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.


తల్లిపాలు అంతంతమాత్రమే...

కేవలం 16శాతం మంది పిల్లలకు మాత్రమే 6 నెలలలోపు తల్లిపాలు అందుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. బాలింతల్లో ఉండే రక్తహీనత, సిజేరియన్‌ ద్వారా ప్రసవించిన జననాలు(72.2శాతం) వల్ల తల్లి, బిడ్డ కొంతకాలంగా దూరంగా ఉండటం వల్ల పుట్టిన పిల్లలకు తల్లిపాలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి.


మరికొన్ని ఆసక్తికర విషయాలు...

- జిల్లాలో అయోడైజ్డ్‌ ఉప్పు అంటే తెలియని కుటుంబాలు 15శాతం, స్వచ ్ఛత, పరిశుభ్రత పాటించని కుటుంబాలు 17శాతం ఉన్నాయి

 -ఆరోగ్యబీమా, జీవిత బీమాలు కలిగిన కుటుంబాలు-71.1శాతం

- కుటుంబ నియంత్రణకు అధునాతన పద్ధతులు వాడే వారిసంఖ్య 73.2శాతం ఉన్నారు. మగవారు ఎటువంటి నియమాలు పాటించడం లే దు.

- 5 సంవత్సరాలు లోపు వయసు ఉండి తగిన ఎత్తు, బరువులేని పిల్లల శాతం26.9, పూర్తి వైకల్యంతో బాధపడుతున్న వారు 8.1శాతం.

- బాడీమాస్‌ ఇండెక్స్‌ సాధరణంగా కంటే తక్కువుగా ఉన్న స్త్రీలు 21శాతం, ఇది గతంలో కేవలం 9.6శాతం మాత్రమే నమోదైంది.

- అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్న మహిళల శాతం 46.4- నడుము నొప్పి ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళల శాతం 53.4


వీటిల్లో ప్రగతి...

జీవన ప్రమాణాలు, మౌలిక వసతులు వంటి విషయాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా ముందు భాగంలో ఉంది. విద్యుత్‌ సదుపాయం కలిగిన గృహలు 99.2శాతం, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉన్నవారు 99.3శాతం, రుతుక్రమం సమయంలో పరిశుభ్రమైన రక్షణ పద్ధతులు అవలింబించే వారు 88శాతం, ఆరోగ్యకరమైన వాతావరణంలో జననాలు 98.5శాతం, 12-23 నెలల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్‌ అందించడంలో 100శాతం వంటి విషయాల్లో అగ్రగామిగా ఉన్నాం. 

 

Advertisement
Advertisement