Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 30 2021 @ 14:22PM

Social Media Postలపై చర్యలు తీసుకున్నారో జాగ్రత్త : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి విలయం నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు లేదా ఇతర విధాలుగా సాయం కోరేవారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రజల గళాన్ని విందామని, సమాచారాన్ని అణచిపెట్టవద్దని కోరింది. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు 70 ఏళ్ళనాటివని, ప్రస్తుత ప్రొసీడింగ్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాలను కానీ విమర్శించడానికి కాదని వివరించింది. కేవలం ప్రజల ఆరోగ్యం పట్ల మాత్రమే తాము శ్రద్ధ చూపుతున్నామని, తప్పొప్పులను నిర్ణయించేందుకు కాదని స్పష్టం చేసింది. 


కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా, మందుల సరఫరా, వ్యాక్సినేషన్ విధానం వంటివాటికి సంబంధించిన సమస్యలపై ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు స్వీయ విచారణకు చేపట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన విచారణలో, కోవిడ్-19 సోకిన ఆరోగ్య సేవల సిబ్బందికి చికిత్స చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సాధారణ పౌరుడిగా, న్యాయమూర్తిగా ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ప్రజలు తమ సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటే, ఆ సమాచారాన్ని తొక్కిపెట్టాలని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రజల గళాలను విందామన్నారు. ఆసుపత్రిలో పడకను కానీ, ఆక్సిజన్‌ను కానీ కోరిన వ్యక్తులను హింసించరాదని, అటువంటివారిని హింసించడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం మానవాళి సంక్షోభంలో ఉందన్నారు. వైద్యులు, ఆరోగ్య సేవల కార్యకర్తలకు సైతం ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉండటం లేదన్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. వ్యాక్సిన్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలన్నారు. వ్యాక్సిన్ల తయారీ కోసం ప్రైవేటు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సహాయపడటం చాలా ముఖ్యమని చెప్పారు. 


ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యలను చెప్పుకున్నపుడు, వారు చెప్తున్న మాటలు పూర్తిగా తప్పు అని ముందుగానే భావించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడం కోసం ఆసుపత్రులు, దేవాలయాలు, మసీదులు, ఇతర మతపరమైన ప్రదేశాలను అందుబాటులో ఉంచాలని తెలిపింది. 


కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలను ప్రస్తావిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు వేర్వేరు ధరలు ఎందుకు నిర్ణయించారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నూటికి నూరు శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు ఉండటంలో ఔచిత్యం ఏమిటని అడిగింది. 50 శాతం వ్యాక్సిన్ డోసులను వదిలిపెడుతున్నామని, రాష్ట్రాలు కొనుక్కోవాలని కేంద్రం చెప్పిందని, ఇది సమానత్వాన్ని ప్రోత్సహిస్తుందా? అని ప్రశ్నించింది. ధరల విషయం చాలా తీవ్రమైనదని పేర్కొంది. 50 శాతం వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందుబాటులో ఉంటాయని, వాటిని ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం, 45 ఏళ్ళ వయసుపైబడినవారి కోసం వాడతారని, మిగిలిన డోసులను 18 ఏళ్ళ వయసు పైబడినవారి కోసం ఉపయోగిస్తారని చెప్తున్నారని పేర్కొంది. దేశంలో 18-45 ఏళ్ళ మధ్య వయస్కులు 59 కోట్ల మంది ఉన్నారని, వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి పేదలు, అణగారిన వర్గాలవారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీసింది. ఇటువంటి ప్రైవేటు రంగ విధానం ఉండకూడదని పేర్కొంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మనం అమలు చేస్తున్న జాతీయ రోగ నిరోధక విధానాన్ని అమలు చేయడం తప్పనిసరి అని తెలిపింది. 


ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన వాదనను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపుల గురించి వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. లాక్‌డౌన్ తరహా ఆంక్షలు, చర్యల గురించి వివరించాలని కోరింది. నిరక్షరాస్యులు వ్యాక్సినేషన్ కోసం ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని, వారికి ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? అని ప్రశ్నించింది. శ్మశాన వాటికల సిబ్బందికి వ్యాక్సినేషన్ చేస్తున్నారా? పేటెంట్ చట్టంలోని సెక్షన్ 92ను అమలు చేస్తున్నారా? అత్యవసర పరిస్థితుల్లో లైసెన్సుల జారీ విధానం ఏమిటి? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 


Advertisement
Advertisement