నగరానికి ఊపిరి ఆడనివ్వడం లేదు : రైతు సంఘంతో సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-10-01T18:38:45+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీకి ఊపిరి ఆడనివ్వడం లేదని రైతు

నగరానికి ఊపిరి ఆడనివ్వడం లేదు : రైతు సంఘంతో సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీకి ఊపిరి ఆడనివ్వడం లేదని రైతు సంఘాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కొత్త సాగు చట్టాలపై నిరసన తెలిపేందుకు హైవేలను దిగ్బంధనం చేయడంపై మండిపడింది. జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం నిర్వహించేందుకు కిసాన్ మహా పంచాయత్ అనుమతి కోరడంతో అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. 


జంతర్ మంతర్ వద్ద కనీసం 200 మంది రైతులు/నిరసనకారులు సత్యాగ్రహం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, అందుకు తగిన స్థలాన్ని కేటాయించే విధంగా అధికారులను ఆదేశించాలని కిసాన్ మహా పంచాయత్ సుప్రీంకోర్టును కోరింది. ఈ సత్యాగ్రహాన్ని శాంతియుతంగా, అహింసాయుతంగా నిర్వహిస్తామని తెలిపింది. 


ఈ పిటిషన్‌పై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సీటీ రవి కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘మీరు మొత్తం నగరాన్ని ఊపిరి ఆడకుండా చేశారు. ఇప్పుడు మీరు నగరంలోకి రావాలనుకుంటున్నారు. నగరవాసులు ఈ నిరసనతో సంతోషంగా ఉన్నారా? ఇటువంటి పనిని ఆపాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఒకసారి కోర్టును ఆశ్రయించిన తర్వాత న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండాలని తెలిపింది. వివాదాన్ని పరిష్కరించనివ్వాలని పేర్కొంది. ‘‘మీకు కోర్టుల మీద నమ్మకం ఉంటే, నిరసనలు తెలపడానికి బదులుగా అత్యవసర విచారణ జరపాలని కోరండి. మీరు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా నిరసన తెలుపుతున్నారా?’’ అని ప్రశ్నించింది. 


రైతులు హైవేలను దిగ్బంధనం చేస్తూ, నిరసన శాంతియుతమని చెప్తున్నారని పేర్కొంది. ప్రజలకు కూడా సంచరించే హక్కులు ఉన్నాయని తెలిపింది. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొంది. ‘‘మీరు భద్రతపై కూడా ప్రభావం చూపిస్తున్నారు. మీరు డిఫెన్స్ సిబ్బందిని కూడా ఆపారు’’ అని పేర్కొంది. 


దీనిపై రైతు సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తాము హైవేలను దిగ్బంధనం చేయలేదని, పోలీసులు తమను అక్కడ నిర్బంధించారని చెప్పారు. 


Updated Date - 2021-10-01T18:38:45+05:30 IST