ఎందుకంత తొందర?

ABN , First Publish Date - 2020-08-27T07:04:34+05:30 IST

అమరావతి నుంచి కార్యాలయాలు తరలించేందుకు ఆరాటపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది...

ఎందుకంత తొందర?

  • అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై సుప్రీం సూటిప్రశ్న
  • స్టేటస్‌కో ఎత్తివేసేందుకు నిరాకరణ
  • రైతులకు అనుకూల తీర్పు వస్తే ఆఫీసులను వెనక్కి తీసుకొస్తారా?
  • హైకోర్టుకు వేరే పనులు, ప్రాధాన్యాలుండవా?: సుప్రీం వ్యాఖ్య
  • ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): అమరావతి నుంచి కార్యాలయాలు తరలించేందుకు ఆరాటపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు విధించిన స్టేట్‌సకో విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై హైకోర్టే త్వరగా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. కార్యాలయాల తరలింపునకు అంత తొందర ఎందుకని ప్రశ్నించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించిన నేపథ్యంలో...  కార్యాలయాలను తరలించకుండా అడ్డుకోవాలని అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కార్యాలయాల తరలింపుపై  హైకోర్టు తొలుత ఈనెల 14వ తేదీవరకు స్టేట్‌సకో విధించింది. ఆ తర్వాత దీనిని నెల 27వ తేదీ (గురువారం) వరకు పొడిగించింది. ఈలోపే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.


హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేదీ వాదనలు వినిపించారు. హైకోర్టు విధించిన స్టేట్‌సకోను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘హైకోర్టులో రైతులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతిస్తే (రైతులకు అనుకూలంగా తీర్పు ఇస్తే) విశాఖపట్నానికి తరలించిన కార్యాలయాలను తిరిగి అమరావతికి తరలిస్తారా? దీనివల్ల భారీ ఎత్తున ప్రజాధనం వృఽథా అవుతుంది కదా! హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో మేము జోక్యం చేసుకోం’’ అని తేల్చిచెప్పింది. కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్‌) ఎక్కడి నుంచి కార్యకలాపాలు సాగించాలో న్యాయ వ్యవస్థ నిర్ణయించలేదని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేదీ అన్నారు. కేసు  విచారణను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించాలని సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్థించారు.  దీనిపై సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘హైకోర్టుకు వేరే ఇతర పనులు ఉండవా?  కేసు ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి హైకోర్టు చూసుకుంటుంది. ఎటువంటి కాలవ్యవధిని నిర్దేశించం’’ అని తేల్చిచెప్పింది.


హైకోర్టు మాటేమిటి?

హైకోర్టును అమరావతి నుంచి తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ స్పందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రాష్ట్రపతి ఉత్తర్వులపై ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... హైకోర్టు తరలింపుపై మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం... మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.


Updated Date - 2020-08-27T07:04:34+05:30 IST