‘ఎమర్జెన్సీ’లో లారీలో తప్పించుకున్నా!

ABN , First Publish Date - 2021-01-24T08:55:40+05:30 IST

‘1975 ఎమర్జెన్సీ సమయంలో నేను ఉత్సాహం ఉరకలేస్తున్న 18 ఏళ్ల యువకుడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, అప్పటి నా ఆత్మస్థైర్యాన్ని తలుచుకుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది’ అని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు...

‘ఎమర్జెన్సీ’లో లారీలో తప్పించుకున్నా!

  • అదొక మానవ విషాదం, నాటి దుర్మార్గాలు తెలిశాయి
  • ఆ పరిస్థితి నా దృక్పథాన్ని మార్చింది: జస్టిస్‌ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘1975 ఎమర్జెన్సీ సమయంలో నేను ఉత్సాహం ఉరకలేస్తున్న 18 ఏళ్ల యువకుడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, అప్పటి నా ఆత్మస్థైర్యాన్ని తలుచుకుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది’ అని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, ప్రొఫెసర్‌ ఖగేశ్‌ గౌతమ్‌ రచించిన ‘ద లా ఆఫ్‌ ఎమర్జెన్సీ- కంపారేటివ్‌ కామన్‌ లా పరిస్పెక్టివ్స్‌’ అన్న పుస్తకాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ ప్రసంగిస్తూ, ఎమర్జెన్సీ సమయంలో ఒక విద్యార్థిగా తన అనుభవాల్ని వివరించారు. 1975 జూన్‌ 25న తన స్వగ్రామంలో పౌరహక్కుల పరిరక్షణపై ఏర్పాటైన ఒక సభకు తాను అధ్యక్షత వహించాల్సి ఉన్నదని, అయితే ఈ సమావేశానికి వెళుతుండగా తన తండ్రి మరో జత బట్టలు తీసుకెళ్లమని సలహా ఇచ్చారని జస్టిస్‌ రమణ గుర్తు చేసుకున్నారు. సమావేశం జరుగుతున్నప్పుడు తనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని తండ్రి ముందుగానే ఊహించారని చెప్పారు. తన మిత్రుడు ఊరు పొలిమేరల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించనుందని చెప్పారని, ఇద్దరం లారీ ఎక్కి తన పిన్ని ఇంటికి చేరుకున్నామని ఆయన చెప్పారు. అపుడు తన దగ్గర పది రూపాయలే ఉన్నాయని, నాన్న మరికొన్ని డబ్బులిచ్చి ఉంటే బాగుండేదని అనుకున్నానని  ఆయన అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ కొన్ని తరాలపై సుదీర్ఘ కాలం ప్రభావం చూపిందని జస్టిస్‌ రమణ తెలిపారు. ఎమర్జెన్సీ తన దృక్పథంలో కూడా మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఎమర్జెన్సీ మూలంగా ఒక విద్యా సంవత్సరం కోల్పోవడంతోపాటు ఎంతో మానసిక వేదనను అనుభవించానని తెలిపారు. ఒక మానవ విషాదం, ఆకలి, బాధ, వేదన అంటే ఏమిటో తనకు ఆ కాలంలో తెలిసిందని, ఎమర్జెన్సీ దుర్మార్గాల గురించి అర్థం  చేసుకునే అవకాశం లభించిందని చెప్పారు. ఈ పుస్తకం న్యాయపరంగా రకరకాల అంశాలను అధ్యయనం చేసేందుకు వీలు కల్పించిందన్నారు.

Updated Date - 2021-01-24T08:55:40+05:30 IST