Pegasus row: నివేదిక సమర్పణకు గడువు పెంచిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-05-20T20:46:24+05:30 IST

పెగాసస్ (Pegasus) సాఫ్ట్‌వేర్ సహాయంతో గూఢచర్యానికి పాల్పడినట్లు

Pegasus row: నివేదిక సమర్పణకు గడువు పెంచిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : పెగాసస్ (Pegasus) సాఫ్ట్‌వేర్ సహాయంతో గూఢచర్యానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నివేదికను సమర్పించేందుకు గడువును జూన్ 20 వరకు సుప్రీంకోర్టు (Supreme Court) పొడిగించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్ నేతృత్వంలో ఓ కమిటీని అత్యున్నత న్యాయస్థానం నియమించిన సంగతి తెలిసిందే. తాము 29 మొబైల్ డివైసెస్‌ను పరీక్షించామని, కొందరు పాత్రికేయులు, నిపుణులతో మాట్లాడామని ఈ కమిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. 


టెక్నికల్ కమిటీ తన నివేదికను మే నెలాఖరుకు పెగాసస్ ఓవర్‌సైట్ ప్యానెల్‌కు సమర్పిస్తుందని భావిస్తున్నారు. అనంతరం తుది నివేదికను జూన్ 20నాటికి అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.


పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ రూపొందించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి గూఢచర్యానికి, నిఘాకు పాల్పడుతున్నట్లు భారత దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఎన్ఎస్ఓ గ్రూప్ స్పందిస్తూ, తన సేవలను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందజేస్తున్నట్లు తెలిపింది. 


భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ (NV Ramana) నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆరోపణలపై విచారణ జరుపుతోంది. టెక్నికల్ కమిటీ నిర్వహించవలసిన ప్రక్రియ నాలుగు వారాల్లో పూర్తి చేసి, సూపర్‌వైజరీ జడ్జికి తెలియజేయాలని ఆదేశించింది. టెక్నికల్ కమిటీ నివేదికను స్వీకరించిన తర్వాత సూపర్‌వైజరీ జడ్జి తుది నివేదికను సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణ కోసం జూలైకి వాయిదా వేసింది. 


పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి నిఘా (Snooping) పెడుతున్నట్లు వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబరులో విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది.  ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి నిఘా పెట్టేందుకు ఉద్దేశించిన జాబితాలో దాదాపు 300 వెరిఫైడ్ ఇండియన్ మొబైల్ ఫోన్ నంబర్స్ ఉన్నాయని ఓ అంతర్జాతీయ మీడియా కన్సార్షియం వెల్లడించిన సంగతి తెలిసిందే. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించిన మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్.  ఈ రాష్ట్రం ఈ వివాదంపై గత ఏడాది దర్యాప్తునకు ఆదేశించింది. ఇదిలావుండగా, పెగాసస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులు పశ్చిమ బెంగాల్ పోలీసుల వద్దకు వచ్చారని, రూ.25 కోట్లకు దీనిని ఇస్తామని చెప్పారని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ ఏడాది మార్చిలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ ప్రతినిధులు చాలా మంది వద్దకు వెళ్ళారని, తాము మాత్రం దానిని కొనలేదని చెప్పారని ఆ వార్తా కథనాలు పేర్కొన్నాయి. భద్రతా కారణాలు, జాతి వ్యతిరేక శక్తులపై దీనిని వాడినంత వరకు అభ్యంతరం లేదన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుకుంటుండటం దురదృష్ణకరమని చెప్పినట్లు పేర్కొన్నాయి.


Updated Date - 2022-05-20T20:46:24+05:30 IST