న్యూఢిల్లీ : మణిపూర్ ప్రభుత్వంలో చట్టానికి వ్యతిరేకంగా లాభదాయక పదవులను నిర్వహించిన 12 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ తాత్సారం చేస్తుండటంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిరవధికంగా అభిప్రాయం చెప్పకుండా ఉండకూడదని పేర్కొంది. గవర్నర్ ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
మణిపూర్ గవర్నర్‌గా లా గణేశన్ ఆగస్టులో నియమితులయ్యారు. ఈ వివాదం అంతకుముందు నుంచే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీడీ థైసీయీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, 12 మంది ఎమ్మెల్యేల అనర్హతపై ఎన్నికల కమిషన్ తన సిఫారసులను జనవరిలోనే గవర్నర్‌కు సమర్పించిందని తెలిపారు. వీరిలో కొందరు రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన వివాదంలో గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోవాలని, భారత రాజ్యాంగంలోని అధికరణ 192 ప్రకారం ఇది గవర్నర్ బాధ్యత అని తెలిపారు.
కపిల్ సిబల్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. గవర్నర్ తన నిర్ణయాన్ని దాటవేయకూడదని తెలిపింది. ఆయన ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీనిపై గురువారం ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది.
మణిపూర్ శాసన సభ పదవీ కాలం 2022 మార్చి 19తో ముగుస్తుంది. 60 మంది శాసన సభ్యులుగల ఈ రాష్ట్రంలో 2017 ఎన్నికల తర్వాత బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, లోక్ జనశక్తి పార్టీ ఈ కూటమిలో ఉన్నాయి. ఎన్ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 12 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా ముఖ్యమంత్రి 2017లో నియమించి, మంత్రి హోదా, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించారు. వీరి నియామకాలను 2020 సెప్టెంబరులో మణిపూర్ హైకోర్టు రద్దు చేసింది. దీంతో వీరిని అనర్హులుగా ప్రకటించాలని గవర్నర్‌ను కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.