Puri Jagannath temple : దేవాలయం చుట్టూ నిర్మాణాలపై పిటిషన్... తోసిపుచ్చిన సుప్రీంకోర్టు...

ABN , First Publish Date - 2022-06-03T23:53:53+05:30 IST

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథుని దేవాలయం పరిసరాల్లో

Puri Jagannath temple : దేవాలయం చుట్టూ నిర్మాణాలపై పిటిషన్... తోసిపుచ్చిన సుప్రీంకోర్టు...

న్యూఢిల్లీ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథుని దేవాలయం పరిసరాల్లో ఒడిశా ప్రభుత్వం చట్టవిరుద్ధంగా తవ్వకాలు, నిర్మాణాలు జరుపుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ నిర్మాణాలు విస్తృత ప్రజాప్రయోజనాల రీత్యా అవసరమని తెలిపింది. పిటిషనర్ కు ఖర్చులను విధించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హిమ కొహ్లీ ధర్మాసనం ఈ చర్య తీసుకుంది. 


ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా లేనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ప్రజా ప్రయోజనానికి హానికరమని పేర్కొంది. ఇటీవలి కాలంలో పిల్స్ పెరిగిపోతున్నాయని, అల్పమైన కారణాలతో పిల్స్ దాఖలు చేయడం చట్టాన్ని దుర్వినియోగపరచడమేనని తెలిపింది. ప్రచార యావతో దాఖలయ్యే పిల్స్ ఎక్కువవుతున్నాయని మండిపడింది. ఇటువంటి పిల్స్ ను తాము అనుమతించబోమని తెలిపింది. దీనివల్ల న్యాయ వ్యవస్థ సమయం వృథా అవుతుందని, అభివృద్ధి పనులు ఆగిపోకుండా చూడటం కోసం దీనిని మొగ్గలోనే తుంచేయాలని పేర్కొంది. 


ఒడిశా ప్రభుత్వం పూరీ జగన్నాథుని దేవాలయం వద్ద చట్టవిరుద్ధంగా తవ్వకాలు, నిర్మాణాలను జరుపుతోందని ఆరోపిస్తూ అర్ధేందు కుమార్ దాస్, తదితరులు ఈ పిల్ ను దాఖలు చేశారు. ప్రాచీన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాలు, అవశేషాల చట్టంలోని సెక్షన్ 20ఏను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ పనుల వల్ల పురాతన దేవాలయానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 


ఇదిలావుండగా, ఇదే అంశంపై ఒరిస్సా హైకోర్టు విచారణ జరుపుతోంది. దేవాలయం చుట్టూ తవ్వకాలు జరపడం వల్ల ఆ నిర్మాణం భద్రతకు హాని జరుగుతుందని పూరీ పట్టణవాసులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. 


Updated Date - 2022-06-03T23:53:53+05:30 IST