భార్య మరణ వాంగ్మూలం సాక్ష్యమే

ABN , First Publish Date - 2022-05-15T08:20:52+05:30 IST

భర్త పెట్టిన హింసలపై భార్య ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీలోని సెక్షన్‌ 498ఏ (భర్త, ఆయన తరఫు బంధువులు వేధింపులకు

భార్య మరణ వాంగ్మూలం సాక్ష్యమే

సుప్రీంకోర్టు స్పష్టీకరణ 


న్యూఢిల్లీ, మే 14: భర్త పెట్టిన హింసలపై భార్య ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీలోని సెక్షన్‌ 498ఏ (భర్త, ఆయన తరఫు బంధువులు వేధింపులకు గురిచేయడం) కింద కేసు పెట్టినప్పుడు దీన్ని సాక్ష్యంగా స్వీకరించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం తెలిపింది. అయితే ఇందుకు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకటోది...మరణానికి కారణాలు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు దీన్ని సాక్ష్యంగా పరిశీలించవచ్చని తెలిపింది. రెండోది... మరణానికి దారి తీసిన పరిస్థితులన్నింటినీ పరిశీలనలోకి తీసుకున్న అనంతరం దీన్ని సాక్ష్యంగా భావించవచ్చని పేర్కొంది. అన్ని కేసులకూ ఒకే విధమైన నిబంధనలు పాటించాలని చెప్పడం సాఽధ్యం కాదని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.


కేరళ హైకోర్టు తనను సెక్షన్‌ 304బీ (భార్యను గాయపరచడం, అగ్ని ప్రమాదానికి గురిచేయడం) కింద నమోదు చేసిన ఆరోపణల నుంచి విముక్తి కలిగించినా, సెక్షన్‌ 498ఏ కింద శిక్షించడాన్ని సవాలు చేస్తూ ఓ వ్యక్తి చేసిన అప్పీలుపై ఇచ్చిన ఆదేశాల్లో ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. మృతురాలి తల్లి ఇచ్చిన వాంగ్మూలంలోనూ భర్త వేధింపులకు గురిచేసినట్టు రుజువయిందని పేర్కొంది. పెళ్లయిన కొద్ది నెలలకే అదనపు కట్నం తీసుకురావాలని భార్యను పుట్టినింటికి పంపించి వేశాడు. కట్నం తీసుకురాకుంటే ఆమెను విడిచిపెట్టి మరో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ బాధలు భరించలేక ఆమె ఒకసారి విషం తాగి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. ఇవన్నీ భర్త వేధింపులను రుజువు చేస్తున్నాయని, అందువల్ల భార్య ఇచ్చిన మరణ వాంగ్మూలం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఈ కారణంగా వారం రోజుల్లోగా సంబంధిత అధికారులకు లొంగిపోయి మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించాలని ఆదేశించింది. 

Updated Date - 2022-05-15T08:20:52+05:30 IST