మద్దతు ధర అంతంతే..

ABN , First Publish Date - 2021-06-10T06:46:51+05:30 IST

వ్యవసాయ ఉత్పత్తులకు ఈ యేడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలపై జిల్లాలోని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర బాగానే పెంచినా.. మరికొన్ని పంటలకు నామమాత్రంగా పెంచింది. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరి, మొక్కజొ

మద్దతు ధర అంతంతే..

- వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

- నామమాత్రంగా పెరిగిన మద్దతు ధరలు

- జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటలకు స్వల్పంగా పెరుగుదల

- ధాన్యానికి రూ.72, మొక్కజొన్నకు రూ.20 మాత్రమే పెంపు

- పెదవి విరుస్తున్న జిల్లా రైతాంగం

- పెరిగిపోతున్న పెట్టుబడులతో అన్నదాతల సతమతం

- నువ్వులు, పప్పు దినుసులకు మాత్రం ఊరట 

ఆర్మూర్‌, జూన్‌ 9: వ్యవసాయ ఉత్పత్తులకు ఈ యేడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలపై జిల్లాలోని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర బాగానే పెంచినా.. మరికొన్ని పంటలకు నామమాత్రంగా పెంచింది. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరి, మొక్కజొన్న, సోయా పంటలకు మద్దతు ధర స్వల్పంగానే పెరిగింది. ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు కేవలం రూ.72 మాత్రమే పెంచింది. గత సంవత్సరం రూ.53 పెంచింది. గత సంవత్సరం కంటే రూ.19 ఎక్కువే పెంచినప్పటికీ.. పెరుగుతున్న పెట్టుబడులకు ఇదీ సరిపోదని రైతులు అంటున్నారు. తాజా పెంపు ప్రకారం ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ.1888 నుంచి రూ.1960, కామన్‌ రకం ధాన్యం రూ.1868 నుంచి రూ.1940 పెరగనుంది. వరి తర్వాత మొక్కజొన్న జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పంట. దీనికి కేవలం క్వింటాకు రూ.20 మాత్రమే పెరిగింది. గత సంవత్సరం మక్కలకు కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.90 పెంచింది. ఈసారి కేవలం రూ.20 పెంచడంతో రైతులు తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మక్కల ధర క్వింటాలేకు రూ.1870కి చేరనుంది. సోయా మద్దతు ధర గత సంవత్సరం క్వింటాలేకు రూ.170 పెంచగా.. ఈసారి కేవలం రూ.70 మాత్రమే పెంచింది. ప్రస్తుతం సోయా ధర క్వింటాలుకు రూ.3950కి చేరనుంది. పొద్దుతిరుగుడు ధర గత సంవత్సరం రూ.135 పెంచగా.. ఈసారి రూ.130 పెంచింది. ప్రస్తుతం పొద్దుతిరుగుడు ధర క్వింటాలుకు రూ.6015కి చేరనుంది. పత్తికి గత సంవత్సరం క్వింటాలుకు రూ.165 పెంచగా.. ఈసారి రూ.211 పెంచింది. పత్తి ధర క్వింటాలుకు రూ.5726కి చేరనుంది. గోధుమలకు క్వింటాలుకు కేవలం రూ.50 మాత్రమే పెంచింది. 

నువ్వులకు పెరిగిన ‘మద్దతు’

 నువ్వులకు మద్దతు ధర బాగా పెంచింది. వీటికి కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.452 పెంచింది. వేరు శేనగలకు రూ.275 పెంచింది. వేరుశెనగలకు గత సంవత్సరం రూ.185 పెంచగా.. ఈసారి రూ.275 పెంచడం గమనార్హం. వేరుశేనగలు ధర క్వింటాలుకు రూ.5550కి చేరనుంది. పప్పు దినుసులకు క్వింటాలుకు రూ.300 చొప్పున పెంచింది. గత సంవత్సరం కందులకు రూ.200, మినుములకు రూ.300 పెంచగా.. ఈ సారి కూడా అదే స్థాయిలో పెంచింది. కందులు, మినుముల ధర క్వింటాలుకు రూ.ఆరు వేల నుంచి రూ.6300 వరకు చేరనుంది. 

ఈ‘సారీ’.. నామమాత్రంగానే!!

స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు రైతులకు పెట్టుబడి మీద 50 శాతం లాభం వచ్చేలా ధర నిర్ణయిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల క్రితం మద్దతు ధరలు బాగా పెంచడంతో రైతులకు ఊరట లభించింది. కానీ గత సంవత్సరం అంతంత మాత్రంగానే మద్దతు ధరలు పెంచింది. ఈసారి కూడా నామమాత్రంగానే పెంచింది. రైతులకు పెట్టుబడి ప్రతీయేడు బాగా పెరిగిపోతుంది. కేవలం మందు సంచులు, పురుగు మందులు, విత్తనాల ధర ఆధారంగా ఉత్పత్తి వ్యయాన్ని లెక్కగట్టి మద్దతు ధర నిర్ణయిస్తున్నారనే విమర్శ ఉంది. కూలీల ఖర్చు అనూహ్యంగా పెరిగిపోతోంది. అన్‌సీజన్‌లో కూలీలకు రోజుకు రూ.500, సీజన్‌లో రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నారు. పెట్రోల్‌ ధరలు పెరగడంతో ట్రాక్టర్‌, కోత మిషన్‌ల అద్దె కూడా బాగా పెరిగిపోయింది. వీటిని లెక్కలోకి తీసుకుంటే రైతులకు ఏమీ మిగలడం లేదు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధాన్యం ఉత్పత్తి ఖర్చు రూ.1293 అయినందున, రూ.72 పెంచామని ప్రకటించింది. క్వింటాలు మక్కల ఉత్పత్తికి రూ.1246, క్వింటాలు పత్తి ఉత్పత్తికి రూ.3817, క్వింటాలు వేరుశెనగ ఉత్పత్తికి రూ.3699, పొద్దుతిరుగుడు క్వింటాలు ఉత్పత్తికి రూ.4010 ఖర్చు అవుతుందని.. దీనికి అనుగుణంగా రైతులకు లాభం వచ్చేలా ధర నిర్ణయించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఎంత ఖర్చవుతుందో? దానిని లెక్కలకు తీసుకుని మద్దతు ధర ప్రకటిస్తే బాగుంటుందని జిల్లాలోని రైతులు కోరుతున్నారు.

ఫ గత ఐదుళ్లుగా పెరిగిన మద్దతు ధరలు

పంటలు 2017-18 2018-19 2019-20 2020-21 2021-22

ధాన్యం(ఏ గ్రేడ్‌) 1590         1770         1835         1888             1960

దాన్యం(బి గ్రేడ్‌) 1550         1750         1815         1868             1940

మొక్కజొన్న         1425         1700         1760         1850             1870

సోయా         3050         3399         3710         3880              3950

పత్తి         4320         5150         5350         5515              5726

పొద్దుతిరుగుడు  4100         5383         5650         5885             6015

కందులు 5450         5675         5800         6000             6300

పెసర         5575         6975         7050         7196            ..........

మినుములు         5400         5600         5700         6000             6300

వేరుశనగ         4450         4890         5090         5275             5550



Updated Date - 2021-06-10T06:46:51+05:30 IST