సన్నాల సంగతేంటి?

ABN , First Publish Date - 2020-10-20T07:06:41+05:30 IST

ప్రభుత్వం వ్యవసాయ విధానంలో కొత్త మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు అన్నదాతల పాలిట శాపంగా మారింది

సన్నాల సంగతేంటి?

దొడ్డు రకం ధాన్యానికే మద్దతు ధర

సన్న రకం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కరువు

కామన్‌ రకంగానే కొనుగోలు

గుదిబండగా మారిన ప్రభుత్వ నిర్ణయం

నియంత్రిత విధానంలో భారీగా పెరిగిన సాగు విస్తీర్ణం


నెన్నెల, అక్టోబరు 19: ప్రభుత్వం వ్యవసాయ విధానంలో కొత్త మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు అన్నదాతల పాలిట శాపంగా మారింది. దొడ్డు రకం సాగుతో ఇబ్బందిగా ఉందని రైతులు ఈ వానాకాలంలో సన్న రకం వరిధాన్యం వేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అందుకు అనుగుణంగా సన్నరకం వరిధాన్యం జిల్లాలో రైతలు అధికంగా సాగు చేశారు. ముందస్తు నాట్లు వేసుకున్న రైతుల పొలాలు మరో వారం,పది రోజుల్లో కోతకు రానున్నాయి. సన్నం వడ్లకు మద్దతు ధర లభించే అవకాశం కానరావడం లేదు.


ఈ పాటికే ప్రభుత్వం దొడ్డు రకాల్లో ఏ గ్రేడ్‌ వరికి రూ. 1,888లు, బి గ్రేడ్‌ వరికి రూ. 1,868లు మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో 250 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, నవంబరు 1నుంచి కొనుగొళ్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.  కాగా ప్రభుత్వం సన్నాల మద్దతు ధర గూర్చి ఊసెత్తకపోగా.. కొనుగోలు కేంద్రాల్లో కొంటుందా లేదా అనే విషయం కూడా ఎటూ తేల్చలేదు. అతి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యే దొడ్డు రకాలను కొనుగోలు చేసి 80 శాతం సాగయ్యే సన్నాలను కొనకపోతే దళారులు, ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో  రైతులు మోసపోయే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా సన్నాలకు సరైన మార్కెటింగ్‌ లేక రైతులు ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.  వరస నష్టాలతో సన్నం వడ్ల సాగు మానేయాలనుకునే తరుణంలో ప్రభుత్వం నియంత్రిత పంటల సాగులో సన్నాలు సాగు చేయాలని సూచించింది. దగీంతో మద్దతు ధర లభిస్తుందనే ఆశతో సన్న రకాలను సాగు చేశారు. కోతల సమయం సమీపిస్తున్నప్పటికీ సన్నాల కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


లక్ష 40 వేల ఎకరాల్లో సన్నాల సాగు..

ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో మంచిర్యాల జిల్లాలోని 80 శాతం రైతులు సన్నాలనే సాగు చేశారు.  జిల్లాలో 1,62,330 ఎకరాల్లో వరి సాగైంది. 3.37 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికా రులు అంచనాకు వచ్చారు. అందులో 1,40,220 ఎకరాల్లో సన్నాలు సాగవుతున్నాయి. 2.80లక్షల టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. 22,110 ఎకరాల్లో మాత్రమే దొడ్డు రకం వరి పండించారు. దొడ్డు ధాన్యం 57 వేల టన్నుల దిగుబడి రానుంది. అతి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యే దొడ్డు రకాలను కొను గోలు చేసి 80 శాతం రైతులు పండించిన పంటను కొనకపోతే ఎలాగని రైతులు ప్రశ్నిస్తున్నారు. 


దొడ్డు రకం ధాన్యం..

ప్రభుత్వ మద్దతు ధర దొడ్డు రకం ధాన్యం 1001, 1010 రకాలకు మాత్రమే చెల్లిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నాలను కొనుగోలు చేయరు. గత ఐదారు ఏళ్ల కిందటి వరకు బహిరంగ మార్కెట్లో సన్నరకం వడ్లకు మంచి ధర ఉండేది. ప్రభుత్వ మద్దతు ధర కంటే క్వింటాలుకు ఐదారు వందల రూపాయలు ఎక్కువ పలికేవి.  పొరుగు రాష్ట్రాల్లో సైతం విపరీత మైన డిమాండ్‌ ఉంటుంది. బీపీటీ, హెచ్‌ఎంటీ, జగిత్యాల కల్చర్‌ లాంటి సన్నరకాల తో పాటు జైశ్రీరాం, నర్మద, శ్రీరామ, కావేరిచింటు, శ్రీ101లాంటి సూపర్‌ఫైన్‌ రకాలను ఎక్కువగా పండిస్తారు.   గత మూడేళ్లుగా పరిస్థితి భిన్నంగా మారింది. వరుసగా మూడేళ్లుగా నష్టాలను చవిచూశారు. ఒక సంవత్స రం  దోమపోటుతో పంట మొత్తం దెబ్బతిన్నది. రెండేళ్లుగా ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకున్నారు. నష్టాలను మిగులుస్తున్న సన్నాలను ఇక సాగు చేయడం మానేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంలో సన్నాలను సాగు చేయాలని సూచించడంతో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం సూచన మేరకు సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే సన్నాలకు పూర్వ వైభవం వస్తుందనే ఆశతో రైతులున్నారు. 


ప్రభుత్వం కొనుగోలు చేసినా..

ప్రభుత్వం ఒక వేళ కొనుగోలు చేసినా దొడ్డు రకాల కంటే ఎక్కువ ధర సన్నాలకు అందే అవకాశం కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సన్నధాన్యం సాధారణ రకం కేటగిరీలోకి వస్తుంది. ఏ గ్రేడ్‌కు రూ. 1,888, సాదరణ రకానికి రూ. 1,868 మద్దతు ధర కేంద్రం ప్రకటించింది. దొడ్డు రకాలు, సన్న రకాలు అంటూ ప్రత్యేక ధరలు ప్రకటించలేదు. ఎల్‌బి (లెంత్‌ అండ్‌ బ్రిడ్త్‌) ప్రకారం ధాన్యం గింజ అడ్డం (వెడెల్పు) కంటే పొడవు రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటే దానిని ఏ గ్రెడ్‌ రకం కింద, నిర్ణీత పొడవు కంటే తక్కువ ఉన్న ధాన్యాన్ని సాధారణ రకంగా పరిగణిస్తారు.  సన్నధాన్యం దొడ్డు వడ్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది కాబట్టి సాధారణ కేటగిరి కిందకే వస్తుంది. జిల్లాలో సాగు చేసిన సూపర్‌ ఫైన్‌ రకాలు జైశ్రీరాం, సాయిరాం, కావేరి చింటు, హెచ్‌ఎంటీ, తదితర రకాలతో పాటు బీపీటీ, జేజేఎల్‌, తెలంగాణ సోనాలు సన్నగా ఉండి పొడవు తక్కువగా ఉంటాయి. దీంతో వాటికి ప్రభుత్వ లెక్క ప్రకారం ఏ గ్రేడ్‌ కన్నా రూ. 20 తక్కువగా వస్తుంది.


ప్రభుత్వ సూచన మేరకు సన్నాలు పండించడం తో పాటు పెట్టుబడి, పంటకాలం, చీడపీడల బెడద ఎక్కువే అయినప్పటికీ సాగు చేసిన రైతుల దొడ్డు రకాలకంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంద నే ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం గతంలో కందులకు ప్రోత్సాహకంగా బోనస్‌  చెల్లించిందని అదే విధంగా సన్నాలకు రూ. 400 బోనస్‌ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. క్వింటాలుకు రూ. 2,200ల కంటే ఎక్కువ ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని సన్నాలు సాగు చేసిన రైతులు చెబుతున్నారు.  

Updated Date - 2020-10-20T07:06:41+05:30 IST