బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకే మద్దతు : బీజేపీ

ABN , First Publish Date - 2021-01-25T06:26:27+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ విషయంలో కష్ట,నష్టాలను ఎదుర్కొంటున్న భైంసాలోని భట్టిగల్లికి చెందిన 34 బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకే వారి ఆందోళనకు మద్దతుగా నిలిచామని బీజేపీ జిల్లా అద్యక్షురాలు పి.రమాదేవి పేర్కొన్నారు.

బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకే మద్దతు : బీజేపీ
మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి

భైంసా, జనవరి 24: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ విషయంలో కష్ట,నష్టాలను ఎదుర్కొంటున్న భైంసాలోని భట్టిగల్లికి చెందిన 34 బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకే వారి ఆందోళనకు మద్దతుగా నిలిచామని బీజేపీ జిల్లా అద్యక్షురాలు పి.రమాదేవి పేర్కొన్నారు. ఆదివారం స్థానికంగా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆరు సంవత్సరాలుగా బాధిత కుటుంబాలు ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరిగితిరిగి వేసారిపోయి మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనలకు దిగారని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మున్సిపల్‌ కార్యాలయంలో భైఠాయించిన బాధిత కుటుంబాల మహిళలకు పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. దీంతో బాధిత కుటుంబాలు తమకు సమాచారం అందించిన మేరకు మున్సిపల్‌ కార్యాలయానికి తరలివెళ్లి మద్దతుగా నిలిచామన్నారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ పార్టీల ప్రతినిధులు ఆరోపించినట్లుగా తాము రాజకీయ లబ్ధి పొందే చర్యలేవి చేపట్టలేదన్నారు. అంతేకాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగిం చే రీతిలో వ్యవహరించలేదన్నారు. బీజేపీ జోక్యంతో సమస్యను పరిష్కరిం చే  దిశగా మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు చర్యలు చేపట్టారని వెల్లడించారు. ఇందులో బీజేపీకి పేరు వస్తోందన్న అక్కసుతోనే వారు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక నుంచి భైంసా మున్సిపల్‌ పరిధిలో ఎంఐఎం పార్టీ అవలంభించే ఒంటెద్దు పోకడలను, ప్రజా వ్యతిరేక విధానాలను అన్ని విధాలుగా అడ్డుకుంటామన్నారు. రెడ్‌ జోన్‌లలో రియల్‌ వ్యాపారానికి, భవన నిర్మాణాలకు అనుమతలనిచ్చే విషయంలో ఆందోళనలను చేపడుతామన్నారు. ఇదే క్రమంలో ప్రధాన రోడ్డు మార్గంలో ఫుట్‌పాత్‌, వీధి వ్యాపారులకు జరిగే అన్యాయాలపై పోరాడుతామన్నారు. ఇందులో బీజేపీ భైంసా పట్టణ కమిటీ అద్యక్షుడు బాలాజీ సూత్రావే, మున్సిపల్‌ కౌన్సిలర్‌ గౌతం పింగ్లే, బీజేపీ ప్రతినిధులు మల్లేష్‌, రావుల పోశెట్టి,భూషణ్‌, తాళ్లోడ్‌ శ్రీనివా్‌స, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T06:26:27+05:30 IST