నిరుపయోగంగా యాచారం బస్టాండ్‌

ABN , First Publish Date - 2021-10-19T05:06:28+05:30 IST

యాచారం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్‌

నిరుపయోగంగా యాచారం బస్టాండ్‌
యాచారం బస్టాండ్‌

  • ఆగని ఆర్టీసీ బస్సులు.. పట్టింపులేని ఉన్నతాధికారులు 
  • ఎండ, వానలో ప్రయాణికుల నిరీక్షణ 
  • వృథాగా కోట్ల రూపాయల విలువ చేసే బస్టాండ్‌ స్థలం     


యాచారం :  యాచారం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్‌ నిరుపయోగంగా మారింది. ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా బస్టాండ్‌లోకి బస్సులు ఆగడం లేదు. దీంతో రూ.మూడు కోట్ల20లక్షల ఆర్టీసీ ఆస్తి వృథాగా మారింది. 

గతంలో యాచారం మండల కేంద్రంలో బస్టాండ్‌ లేక వివిధ గ్రామాలకు చెందిన ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. బస్సుల కోసం అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఎండ ఎండుతూ.. వానకు తడుస్తూ వేచి ఉండేవారు. దీంతో మండల కేంద్రానికి చెందిన ఓ రైతు తన సొంత భూమిని ఆర్టీసీకి అర ఎకరానికి మించి దానం చేశాడు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్ర మంత్రులు టి.దేవేందర్‌గౌడ్‌, కొండ్రు పుష్పలీల బస్టాండ్‌ ఏర్పాటు కోసం నిధులు విడుదల చేశారు. కేవలం 16నెలల్లో బస్టాండ్‌ నిర్మాణం పూర్తి చేశారు, నిర్మాణం పూర్తయిన తర్వాత బస్టాండ్‌లోకి దేవరకొండ, ఇబ్రహీంపట్నం, ఫలక్‌నుమా, మాచర్ల తదితర డిపోల బస్సులు ఆగడంతో కొంతకాలం ప్రయాణికులు ఇబ్బందులు తొలగాయి. 


మళ్లీ మొదటికొచ్చిన సమస్య

ఇబ్రహీంపట్నం డిపో అధికారులు యాచారం బస్టాండ్‌లో కంట్రోలర్‌ను నియమించకపోవడంతో పదేళ్లుగా ఆయా డిపోలకు చెందిన బస్సులు బస్టాండ్‌లో ఆగడం లేదు. దాంతో హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణికులు అంబేద్కర్‌ విగ్రహం వద్ద, మాల్‌ వైపు వెళ్లేవారు మస్జీద్‌ వద్ద రోడ్డుపక్కనే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇరువైపులా రోడ్డుపై బస్సులు ఆపుతుండటంతో ట్రాఫిక్‌జాం అయి స్థానికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. బస్టాండ్‌లో ఆయా డిపోలకు చెందిన బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.  బస్టాండ్‌లో ప్రతిరోజూ ఒక కంట్రోలర్‌ను నియమిస్తే ఆర్థికంగా తమపై భారం పడుతుందని ఆర్టీసీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 


పంచాయతీల పరిష్కార వేదికగా బస్టాండ్‌ 

యాచారం మండల కేంద్రంలోని బస్టాండ్‌లోకి బస్సుల రాకపోకలు లేకపోవడంతో పంచాయతీల పరిష్కార వేదికగా మారింది. పోలీ్‌సస్టేషన్‌లో అందిన ఫిర్యాదులు ఇరువర్గాలవారు ఇందులో కూర్చొని తగాదాలు తీర్చుకునే వేదికగా మిగిలిపోయింది. అదేవిధంగా బిక్షాటన చేసేవారికి ఇది ప్రధాన ఆవాసంగా మారింది. దీంతో దాదాపు రూ. మూడు కోట్ల 20లక్షల విలువైన బస్టాండ్‌ ఆస్తి నిరుపయోగంగా మారింది. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్టాండ్‌లో వివిధ డిపోలకు చెందిన బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.


బస్టాండ్‌లోకి బస్సులు రాక ఇబ్బంది పడుతున్నాం

బస్టాండ్‌లోకి ఆర్టీసీ బస్సులు రాక గోస తీస్తున్నాం. ఇక్కడ అన్ని వసతులున్నా బస్సులు ఆపకపోవడం దారుణం. బస్టాండ్‌ ఉన్న విషయం అధికారులకు తెలుసు. తెలిసి కూడా కావాలనే బస్సులు ఆపడం లేదు. త్వరలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.

- సంజీవ, రైతు చిన్నతూండ్ల


అధికారులు చొరవ చూపాలి

మండలకేంద్రంలో కోట్ల రూపాయల విలువ చేసే బస్టాండ్‌ ఉన్నా బస్సులు ఆపకపోవడం ఇబ్బందిగా ఉంది. ఇబ్రహీంపట్నం డిపో అధికారులు ఓ కంట్రోలర్‌ను నియమించి ఇబ్రహీంపట్నం, దేవరకొండ తదితర డిపోల బస్సులు ఆగేలా చొరవ తీసుకోవాలి. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 

- ఖాజు, వ్యాపారి, యాచారం 




Updated Date - 2021-10-19T05:06:28+05:30 IST