ప్రమాదపు అంచుల్లో సుంకేసుల డ్యాం కరకట్ట..

ABN , First Publish Date - 2021-05-17T05:01:25+05:30 IST

సుంకేసుల జలాశయానికి అనుసంధానంగా నిర్మించిన కరకట్ట రహదారి ప్రమాదకరంగా మారింది.

ప్రమాదపు అంచుల్లో సుంకేసుల డ్యాం కరకట్ట..
రక్షణ గోడలు లేక, ప్రమాదకరంగా మారిన కరకట్ట

- జలాశయంకు ఇరువైపులా రక్షణ గోడలు కరువు

- ఆదమరిస్తే.. అంతే సంగతులు  

రాజోలి, మే 16: సుంకేసుల జలాశయానికి అనుసంధానంగా నిర్మించిన కరకట్ట రహదారి ప్రమాదకరంగా మారింది. నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారికి రక్షణ గోడ లేక ప్రమాదకరంగా మారినా... అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2009 అక్టోబర్‌ 2న వచ్చిన వరదల్లో పాత కరకట్ట  కొట్టుకుపోగా, తిరిగి రూ. 22 కోట్లతో మట్టితో కరకట్ట పనులు చేపట్టారు. అదేవిధంగా రహదారికి ఇరువైపులా రక్షణ దిమ్మెలు ఏర్పాటు చేయలేదు. రహదారి ఎత్తు నదికి తక్కువ డ్యాం కంటే దిగువలో ఉంది. రక్షణ దిమ్మె లేని కారణంగా వాహనాలు నడిపే వారు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వెళ్లినా నదిలో పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు రహదారి గోతుల మయంగా మారింది.  ఇరు రాష్ట్రాలను కలిపే అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా ఉంది. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. 500 మీటర్లు మేర ఉన్న ఈ రహదారికి పూర్తిగా మరమ్మతులు చేపట్టి కరకట్టను బందోబస్తుగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

   వర్షాకాలంలో డ్యాంకు భారీగా నీరు వస్తే, ఆ నీటిని చూసేందుకు అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి, ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి సందర్శకులు భారీగా వస్తుంటారు. అయితే వారు డ్యాంను చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. డ్యాంకు ఇరువైపులా రక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-17T05:01:25+05:30 IST