కరోనా రోగుల ఆత్మహత్యలు కొవిడ్‌ మరణాలే!

ABN , First Publish Date - 2021-09-14T10:01:55+05:30 IST

కొవిడ్‌ సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అది కొవిడ్‌ మరణం కిందికి రాదంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది.

కరోనా రోగుల ఆత్మహత్యలు కొవిడ్‌ మరణాలే!

  • ఆత్మహత్య నిబంధన పునఃపరిశీలించాలి.. 
  • ఫిర్యాదులపై కమిటీ ఎప్పుడు వేస్తారు?.. 
  • కొవిడ్‌ పరిహార మార్గదర్శకాలపై సుప్రీం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: కొవిడ్‌ సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అది కొవిడ్‌ మరణం కిందికి రాదంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. కొవిడ్‌ మృతుల కుటుంబీకులకు పరిహారం చెల్లింపునకు రూపొందించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో సమర్పించిన సంగతి తెలిసిందే. దీనిలో ఒక నిబంధనపై ద్విసభ్య ధర్మాసనం సోమవారం కేంద్రానికి సూచన చేసింది. కరోనా పీడితులు విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాదాలు, ఇంకా ఇతర కారణాలతో చనిపోతే అవి కొవిడ్‌ మరణాల కిందికి రావని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా సుప్రీంకోర్టు జూన్‌ 30న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.


‘‘ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను మేము పరిశీలించాము. దాదాపుగా అంతా బాగానే ఉంది. అయితే రెండు మూడు విషయాలపై సూచనలిస్తున్నాము’ అని జస్టిస్‌ ఎంఆర్‌ షా ఎస్జీ తుషార్‌ మెహతాకు తెలిపారు. కరోనా పీడితులు ఆత్మహత్య చేసుకుంటే వారి పరిస్థితి ఏంటని జస్టిస్‌ షా ప్రశ్నించారు. ‘కొవిడ్‌ రోగులు ఆత్మహత్య చేసుకుంటే వారు పరిహారానికి అర్హులు కారని నిర్ణయించడాన్ని అంగీకరించబోము. దీన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలి’ అని జస్టిస్‌ షా స్పష్టం చేశారు.  అంతేకాకుండా ధర్మాసనం కేంద్రానికి కొన్ని ప్రశ్నలు వేసింది. కేంద్ర ప్రకటించిన మార్గదర్శకాల మేరకు ఆయా రాష్ట్రాలు అమలు చేసే విధానాన్ని ధర్మాసనం అడిగింది. మరణ ధ్రువీకరణ పత్రాలలో ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీని ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. 

Updated Date - 2021-09-14T10:01:55+05:30 IST