Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 23 Jan 2022 23:30:26 IST

నాకు చనిపోవటానికి అనుమతివ్వండి!

twitter-iconwatsapp-iconfb-icon

కారుణ్య నియామకం, ఇతర లబ్ధి కోసం మా అక్క, బావ హింసిస్తున్నారు

లేఖ ద్వారా కోరిన నేలకొండపల్లికి చెందిన మైనర్‌ 

నేలకొండపల్లి, జనవరి 23 : ‘తల్లి,తండ్రి లేని నన్న మా అక్కబావ కారుణ్య నియామకం ద్వారా వచ్చే ఉద్యోగం, ఉద్యోగి మరణానంతరం వచ్చే డబ్బు కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. నాకు చనిపోయేందుకు అనుమతివ్వండి’ అంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన 17ఏళ్ల గోరింట్ల సాయిచంద్‌ అనే బాలుడు తన ఆవేదనను, బాధను ఓ లేఖ ద్వారా వెలిబుచ్చాడు. ఖమ్మం, సూర్యాపేట కలెక్టర్లు, సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, గుంతకండ్ల జగదీష్‌రెడ్డిలకు విన్నవిస్తూ రాసిన ఈ లేఖ ఆదివారం తీవ్ర కలకలం  రేపింది. నేలకొండపల్లికి చెందిన గోరింట్ల లక్ష్మీనారాయణ, సుజాత దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తెలున్నారు. నేలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ లక్ష్మీనారాయణ మృతి చెందడంతో ఆయన స్థానంలో భార్య సుజాతకు స్కూల్‌ సబార్డినేట్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఇక వారి కూతురైన సాయిప్రత్యూషను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ అంబేద్కర్‌ పట్టణానికి చెందిన గుండా గోపికిచ్చి వివాహం చేశారు. అనంతరం తల్లి,దండ్రిలేని తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

సాయిచంద్‌ లేఖలో పేర్కొన్న వివరాలివీ.. 

‘వివాహమైన అనంతరం ఎక్కువ కట్నం ఇవ్వాలని మా బావ.. మా అక్కను ఇబ్బంది పెట్టేవాడు. తొందరగా నువ్వు చచ్చిపోతే నీ ఉద్యోగం నీకూతురైన నాభార్యకు ఇప్పించుకుంటానని మా అమ్మను కూడా వేధించేవాడు. 2020లో మా అమ్మ అస్వస్థతకు గురవగా.. సమయం కోసం ఎదురు చూసిన మా బావ గోపి హుజూర్‌నగర్‌లో మంచి వైద్య సదుపాయాలున్నాయని, అక్కడ వైద్యం చేయిద్దామని చెప్పి హుజూర్‌నగర్‌ తీసుకెళ్లాడు. చికిత్సకు రూ.4లక్షల దాకా ఖర్చు అవుతుందని అమ్మతో చెప్పి డబ్బులు వడ్డీకి తెప్పించుకుని మరీ దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత మా అమ్మను చంపి కొవిడ్‌తో మృతి చెందిందని చెప్పి మృతదేహాన్ని బావ వాళ్ల ఇంటికే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. నాకు అనుమానం వచ్చి మాబావను నిలదీస్తే.. నీకేం తెలవదు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా చంపేస్తా, ఉద్యోగం విషయంలో నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలనిబెదిరించాడు. అదే విధంగా బెనిఫిట్స్‌ వచ్చేందుకూ సహకరించాలని, లేదంటే నిన్ను కూడా చంపేస్తా అని బెదిరించాడు. అలాగే హుజూర్‌నగర్‌లో పని చేసే ఓహెడ్‌మాస్టర్‌తో, న్యాయవాదితో  సత్పంబంధాలు పెట్టుకుని కారుణ్య నియామకం, బెనిఫిట్స్‌ ఇన్సూరెన్స్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంటు, పింఛన్లను నాతో సంబంధం లేకుండా తీసుకోవటానికి ప్రయత్నాలు చేశాడు. అంతే గాకుండా మాఅమ్మకు సంబంధించిన అన్ని వస్తువులను తీసుకున్నాడు. ఇంతకాలం తల్లిచాటు బిడ్డగా బతికిన నాకు ఇంత చిన్న వయసులో ఒక్కసారే ఇన్ని సమస్యలు రావటంతో నా బతుకు నాకే భారంగా అనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక నేను కారుణ్య మరణాన్ని కోరుకుంటున్నాను. నా ఈ మరణానికి కారణమవుతున్న నాఅక్క సాయిప్రత్యూష, గోపిలతో పాటు మాబావ తల్లిదండ్రులు గుండా శివప్రసాద్‌పద్మలపై చర్యలు తీసుకుని, నా కారుణ్య మరణానికి అనుమతిప్పించాల్సిందిగా కోరుతున్నా. వచ్చే జన్మలోనైనా స్వేచ్ఛగా తల్లిదండ్రులతో, స్నేహితులతో మంచి కుటుంబంతో బతకాలని పుట్టెడు దుఃఖంతో కోరుకుంటున్నా’ అని సాయిచంద్‌ వేడుకుంటున్నాడు. సాయిచంద్‌ రాసిన ఈ ఉత్తరం సామాజిక మాద్యమాలలో హల్‌చల్‌ చేస్తోంది. 

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ప్రత్యూష..

కాగా సాయిచంద్‌ అక్క సాయి ప్రత్యూష హుజూర్‌నగర్‌లో తన తమ్ముడిపై ఫిర్యాదు చేసింది. తన తమ్ముడు తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని, అతడు చేస్తున్న ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సాయిప్రత్యూష నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారని, తన తమ్ముడిని పిలిపించి మాట్లాడాలని ఎస్‌ఐను కోరారని సమాచారం. అయితే సాయిచంద్‌ మైనర్‌ కావడంతో తాము పోలీస్‌స్టేషన్‌కు పిలిపించలేమని, అతని అంతట అతను వస్తే మాట్లాడతామని ఎస్‌ఐ స్రవంతిరెడ్డి చెప్పినట్టు తెలిసింది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.