సూపర్‌ మార్కెట్లలో ధరల బాదుడు

ABN , First Publish Date - 2020-04-09T12:07:33+05:30 IST

శ్రీకాకుళంలోని సూపర్‌ మార్కెట్లపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అధిక ధరలకు

సూపర్‌ మార్కెట్లలో ధరల బాదుడు

పండ్ల దుకాణాలదీ ఇదే పరిస్థితి

విజిలెన్స్‌ దాడుల్లో తేటతెల్లం

8 దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు.. కేసుల నమోదు


శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 8: శ్రీకాకుళంలోని సూపర్‌ మార్కెట్లపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తున్నట్టు విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ ఎస్పీ పనసారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నగరంలో ఆ శాఖాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు కిరాణా దుకాణాలు, మూడు మందుల షాపులు, ఒక పండ్ల దుకాణంలో విక్రయాలను పరిశీలించారు. అత్యధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తున్న శివానంద సూపర్‌ మార్కెట్‌, శ్రీరాజేశ్వరి డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లపై 6ఏ సెక్షన్‌ ప్రకారం కేసులు నమోదు చేశారు.  శివానంద సూపర్‌ మార్కెట్‌కి రూ.4,300, శ్రీ రాజేశ్వరీ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌కు రూ.3,300 అపరాధ రుసుం విధించారు. డే అండ్‌ నైట్‌ కూడలిలోని వీనస్‌ మెడికల్స్‌, శ్రీదేవీ ఫార్మసీ, డేఅండ్‌నైట్‌ మెడికల్స్‌పై డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ యాక్ట్‌ 1940 రూల్స్‌ ఆఫ్‌ 1945 సెక్షన్‌ ప్రకారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. పీఎస్‌ఎన్‌ఎం స్కూల్‌ ఎదురుగా ఉన్న జన్నాన రాజశేఖర్‌, ఎ.దుర్గాప్రసాదరావుల పండ్ల దుకాణాల్లోనూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వారిపైనా కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ సీఐ ఎంవీ నారాయణ, డీఈఈ సీహెచ్‌ సత్యనారాయణ, అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ సీహెచ్‌ సూర్యత్రినాథరావు, ఏఈఈలు రాజేంద్రప్రసాద్‌, ప్రేమ్‌కుమార్‌, రవికిశోర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ కుమార స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T12:07:33+05:30 IST