HYD : వచ్చే ఎన్నికలకు వారసులొచ్చేస్తున్నారు.. వ్యూహాత్మకంగా రంగంలోకి.. గతంలో ఎదురు దెబ్బ..!

ABN , First Publish Date - 2022-05-30T17:45:51+05:30 IST

రాజకీయ వాతావరణం క్రమేణా వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికలుంటాయా, లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత ప్రభుత్వానికి మరో యేడాదిన్నర మాత్రమే సమయముంది..

HYD : వచ్చే ఎన్నికలకు వారసులొచ్చేస్తున్నారు.. వ్యూహాత్మకంగా రంగంలోకి.. గతంలో ఎదురు దెబ్బ..!

  • వ్యూహాత్మకంగా రంగంలోకి దించుతున్న నేతలు
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ప్రయత్నాలు
  • వెన్నంటి ప్రోత్సహిస్తోన్న నేతలు
  • పలు నియోజకవర్గాల్లో వారే కీలకం
  • సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి..
  • అధికారిక, పార్టీ కార్యక్రమాల్లోనూ వారిదే హవా

రాజకీయ వాతావరణం క్రమేణా వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికలుంటాయా, లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత ప్రభుత్వానికి మరో యేడాదిన్నర మాత్రమే సమయముంది. దీంతో వచ్చే ఎన్నికలు లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పకడ్భందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో వారసుల రాజకీయ ఆరంగేట్రానికి  గ్రేటర్‌లోని నేతలు పావులు కదుపుతున్నారు.


హైదరాబాద్‌ సిటీ : ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల వారసులు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు/నేతలు తాము తప్పుకొని వారసులను బరిలో దింపాలని భావిస్తుండగా, ఇంకొందరు తమతోపాటు పిల్లలకూ అవకాశం దక్కేలా పావులు కదుపుతున్నారు.


- విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) తనయుడు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్‌ నుంచి పోటి చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. రెండు నియోజకవర్గాల పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటోన్న ఆయన.. మంత్రి తనయుడి హోదాలో తన వద్దకు వచ్చే ప్రజలకు వివిధ పనులకు సంబంధించి మాట సాయం చేస్తున్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ (Prakash Gowd) ఈ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించారు. 


- కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి. సాయన్న (Sayanna) వీలైతే.. కూతురు, మాజీ కార్పొరేటర్‌ లాస్య నందితను బరిలో నిలపాలని భావిస్తున్నారు. కుదరని పక్షంలో తనకే మరోసారి అవకాశం ఇవ్వాలని పట్టుబట్టే అవకాశముంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఇతర నేతలూ ఆసక్తి చూపుతున్నారు. 


- సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి తనయుడు, టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఇన్‌చార్జి సాయికిరణ్‌ యాదవ్‌ను (Sai Kiran Yadav) మరోసారి పోటీ చేయించే ఆలోచనలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (Minister Talasani) ఉన్నారు. నగరంలో కీలకంగా వ్యవహరించే ఆయన.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.


- ముషీరాబాద్‌ నియోజకవర్గంలో వారసుల రంగ ప్రవేశానికి పావులు కదులుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ (Muta Gopal).. తనయుడు జైసింహను బరిలో నిలిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అనంతరం గోపాల్‌ కోలుకున్నా.. ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జైసింహ ఉంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు, మాజీ కార్పొరేటర్‌ శ్రీనివా‌స్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. నాయిని నరసింహా రెడ్డి ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 


- కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌ (Anjan Kumar Yadav) తనయుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌  (Anil Kumar Yadav) మరోసారి బరిలో నిలిచే అవకాశముంది. బీజేపీ తరపున పోటీ చేసేందుకు గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆసక్తి చూపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ మరోసారి పోటీ చేయాలనుకుంటోన్న నేపథ్యంలో టికెట్‌ ఎవరికి దక్కుతందున్నది ఆసక్తికరంగా మారింది.


- సికింద్రాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటి స్పీకర్‌ టి. పద్మారావుగౌడ్‌.. (T Padmarao  Gowd) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనయుడు రామేశ్వర్‌గౌడ్‌ను పోటీ చేయించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రామేశ్వర్‌ అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పద్మారావు అందుబాటులో లేని సమయంలో అధికారులు, పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతుంటారు.


- గోషామహల్‌ నుంచి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ (Mukhesh Gowd) తనయుడు విక్రం గౌడ్‌ బీజేపీ తరఫున మరోసారి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటి చేసిన ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.


- మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్‌ను (Rohit) తన సిటింగ్‌ స్థానం నుంచి పోటి చేయించే యోచనలో ఉన్నట్టు సమాచారం. నిజామాబాద్‌ నుంచి బరిలో నిలిచేందుకు హన్మంతరావు ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరికి అవకాశం ఇస్తే.. రెండు చోట్లా గెలిచి చూపిస్తామని పార్టీ పెద్దలకు చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికే రోహిత్‌ మల్కాజ్‌గిరిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


- మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అన్న కుమారుడు కాసాని వీరేష్‌.. టీఆర్‌ఎస్‌ (TRS) తరఫున కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ కేపీ వివేకాంద అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు.


- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి (Bikshapathi) తనయుడు రవికుమార్‌ బీజేపీ తరఫున బరిలో దిగాలని భావిస్తున్నాడు. 


- మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ (Veerender Gowd) గతంలో చేవేళ్ల పార్లమెంట్‌ నుంచి పోటీ చేశారు. బీజేపీలో చేరిన ఆయన మహేశ్వరం అసెంబ్లీ లేదా చేవేళ్ల లోక్‌సభ (Loksabha) స్థానంలో బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


- సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి (Marri Sasidhar Reddy) రెండో తనయుడు పూరూరవ రెడ్డి ఈ సారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. శశిధర్‌రెడ్డి తప్పుకొని కుమారుడికి అవకాశం ఇస్తారా, లేక పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా..? అన్నది చూడాలి.


వారసులకు ఎదురు దెబ్బ..

2018 ముందస్తు అసెంబ్లీ, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన  వారసులకు ఎదురుదెబ్బలు తగిలాయి. తలసాని తనయుడు సాయికిరణ్‌యాదవ్‌.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి కిషన్‌రెడ్డి చేతిలో (Kishan Reddy) ఓటమి పాలయ్యారు. దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ చేవేళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజితులయ్యారు. గోషామహల్‌లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన విక్రమ్‌గౌడ్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు సాయన్న కూతురు లాస్యనందిత, గోపాల్‌ సోదరుడి భార్య పద్మ, భేతి సుభా‌ష్‌రెడ్డి సతీమణి స్వప్న పరాజితులయ్యారు.

Updated Date - 2022-05-30T17:45:51+05:30 IST