సబ్సిడీ విత్తనం పక్కదారి

ABN , First Publish Date - 2022-05-28T05:54:05+05:30 IST

మండలంలోని ఆర్‌.లోచర్ల రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లో రైతులకు అందించే సబ్సిడీ విత్తన వేరుశనగ 141 బ్యాగులు పక్కదారి పట్టించారు.

సబ్సిడీ విత్తనం పక్కదారి
ఆర్బీకేలో విచారిస్తున్న అధికారులు, పోలీసులు

- ఆర్‌ లోచర్ల ఆర్బీకే నుంచి 141 బ్యాగులు కర్ణాటకకు..

- వీఏఏపై పోలీసులకు ఫిర్యాదు


 రొద్దం, మే 27: మండలంలోని ఆర్‌.లోచర్ల రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లో రైతులకు అందించే సబ్సిడీ విత్తన వేరుశనగ 141 బ్యాగులు పక్కదారి పట్టించారు. గ్రామ సమీపంలో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ) నయాజ్‌ గురువారం సాయంత్రం సబ్సిడీ వేరుశనగను కర్ణాటక ప్రాంతానికి తరలించిన విషయం బయటపడింది. పెనుకొండ ఏడీఏ స్వయంప్రభ రొద్దం వ్యవసాయాధికారి నివేదిత.. లోచర్ల ఆర్బీకేను తనిఖీచేసి, 141 బ్యాగుల వేరుశనగ పక్కదారి పట్టిందని తేల్చారు. ఆర్‌.లోచర్ల ఆర్బీకేకి 334 బ్యాగుల విత్తన వేరుశనగ మంజూరు కాగా.. 2 బ్యాగుల విత్తనం బాగోలేదని వెనక్కు పంపారు. మిగిలిన 332 బ్యాగుల్లో 191 మాత్రమే ఉండగా.. 141 బ్యాగులు వీఏఏ పక్కదారి పట్టించాడని ఏడీఏ స్వయంప్రభ.. ఉన్నతాధికారులకు నివేదించారు. విత్తనం నిలువ ఉంచిన గదిని రొద్దం పోలీసుల సహకారంతో వ్యవసాయాధికారులు సీజ్‌ చేశారు. వీఏఏ నయాజ్‌పై ఏడీఏ స్వయంప్రభ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్సిడీ వేరుశనగ పక్కదారి పట్టించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా నయాజ్‌ ఎరువులు, పప్పుశనగ పక్కదారి పట్టించి, రూ.1.20 లక్షలు స్వాహా చేయగా.. వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టలేదనీ, దీంతో మరోమారు ఇలా చేశాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నయాజ్‌.. ఉన్నతాధికారులపై రాజకీయ ఒత్తిళ్లు చేయించి రూ.1.20 లక్షలు కట్టకుండా మిన్నకుండిపోయినట్లు తెలిసింది. విత్తన వేరుశనగ పక్కదారి పట్టినా వ్యవసాయాధికారులు వీఏఏను సస్పెండ్‌ చేయకుండా వెనకేసుకొస్తారా అంటూ ఏడీఏ స్వయంప్రభపై రొద్దం వైసీపీ జడ్పీటీసీ భర్త అక్కులప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సస్పెండ్‌ చేయాలని మండిపడ్డారు.



 నిగ్గుతేల్చాలి: బీకే 


సబ్సిడీ వేరుశనగ పక్కదారి పట్టించడంపై ప్రభుత్వం నిగ్గుతేల్చాలని టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి డిమాండ్‌ చేశారు. అధిక వర్షాలతో పంటలు నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోకపోగా అవినీతికి పాల్పడుతున్న అధికారులను వెనకేసుకొస్తోందని విమర్శించారు. గతంలో తప్పుచేసినపుడే చర్యలు చేపట్టి ఉండుంటే మళ్లీ ఇలా జరిగేది కాదన్నారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.



Updated Date - 2022-05-28T05:54:05+05:30 IST