కోతల వ్యవ‘సాయం’

ABN , First Publish Date - 2020-06-05T10:47:46+05:30 IST

రైతు పచ్చగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు సంతోషమే దేశానికి సౌభాగ్యం. రైతుకు పెద్ద పీట వేయని ప్రభుత్వం రైతునేస్తం..

కోతల వ్యవ‘సాయం’

 రాయితీలు, ప్రోత్సాహకాలు రద్దు

లాక్‌డౌన్‌లో మరింత నష్టం.. ప్రత్యామ్నాయం చూపడంలో విఫలం


చిత్తూరు-ఆంధ్రజ్యోతి:రైతు పచ్చగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు సంతోషమే దేశానికి సౌభాగ్యం. రైతుకు పెద్ద పీట వేయని ప్రభుత్వం రైతునేస్తం కాబోదు. అప్పుల్లో కూరుకుపోతే ఆదుకుంటూ, పంట నష్టపోతే అండగా ఉంటూ, సబ్సిడీలతో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సాగేదే రైతుజనరంజక పాలన అవుతుంది. దురదృష్టవశాత్తూ గత ఏడాది కాలంగా అన్నదాత కష్టాన్ని కంటజూసే వారుకూడా కరువయ్యారు. నవరత్నాల పేరుతో నిధుల పంపకాల మీద పెట్టిన శ్రద్ద, రైతును ఆదుకోవడం మీద చూపలేదు. నడిరోడ్డుమీద చితికిన టమేటాపంట జిల్లా రైతు దుస్థితికి అద్దం పడుతోంది. పండిన కాస్తో కూస్తో పంటను కూడా గిట్టుబాటుగా అమ్ముకోలేని పరిస్థితి మామిడిరైతుది. సహకార చక్కెర ఫ్యాక్టరీలు, పాలడెయిరీ తెరుస్తామన్న పాదయాత్ర హామీ కూడా ఒట్టిదే అని ఏడాదిలో తేలిపోయింది. మొత్తం మీద ఏడాది వైసీపీ పాలనలో అన్నదాతకు ఒరిగిందేమీ లేదు. 


 మరింత చితికిపోయిన టమేటా రైతు

జిల్లాలోని పడమటి మండలాల్లో 32,093 హెక్టార్లలో టమోటా పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 10.20 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా టమోటాకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రవాణా లేకపోవడం, మార్కెటింగ్‌కు అవకాశం లేకుండా పోవడం వంటి కారణాలు టమోటా రైతులను తీవ్రంగా నష్టం కలిగించాయి. రైతులు టన్నులకు టన్నులు రోడ్లమీద పారబోయాల్సి వచ్చింది. పొలాల్లోనే ఎకరాలకు ఎకరాలు విరగ్గాసిన పంట వదిలేశారు. రెండు నెలల కాలంలో 2.5 లక్షల టన్నుల టమోటా నష్టపోయినట్లు ఓ అంచనా. రూ.250 కోట్ల రాబడిని టమేటా రైతులు నష్టపోయారు. ప్రభుత్వమే చొరవ తీసుకుని టమేటా కొనుగోలు చేయాలని రైతులు ఆశించినా అది జరగలేదు. ఇక  జిల్లాలో శీతల గిడ్డంగుల సౌకర్యం , పల్ప్‌ పరిశ్రమల స్థాపన వంటివి నోటి మాటగానే ఉండిపోయియి.


నాడు: మామిడికి మద్దతు ధర

 జిల్లాలో 1.12 లక్షల హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. ఏడాదికి సగటున 10.60 లక్షల టన్నుల దిగుబడి ఉంటుంది. 30శాతం దిగుబడి మాత్రమే వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లాకడౌన్‌ కారణంగా జిల్లాలో 25శాతం మండీలు మాత్రమే తెరిచారు.  ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావడం లేదు. దీంతో ఉన్న దిగుబడిని కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడినపుడు ప్రభుత్వం మామిడిరైతులను ఆదుకుంది.2018-19 సంవత్సరంలో కిలో మామిడికు రూ.2.5 చొప్పున 1.05 టన్నుల మామిడి కాయలకు రూ.26.25 కోట్లను అందించింది. సుమారు 68 వేల మంది జిల్లా రైతులు లబ్ధిపొందారు. 


నేడు: మామిడి రైతును ఆదుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.


నాడు: బిందుసేద్యంలో ఫస్ట్‌

2018-19 సంవత్సరానికిగానూ బిందు సేద్యం కోసం రూ.267 కోట్లను ఖర్చు పెట్టారు. దీనివల్ల 31,260 హెక్టార్లలో పంట సాగు చేసే 33,258 మంది రైతులకు లబ్ధి చేకూరింది. బిందుసేద్యం విషయంలో మన జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.


నేడు: బిందు, తుంపర్ల సేద్యాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ఏడాదిగా ఒక్క పైసా నిధులు కూడా విడుదల చేయలేదు.


నాడు: ఉద్యాన పంటల కళకళ

ప్రస్తుతం జిల్లాలో 2,25,765 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. 2018-19లో 70 వేల హెక్టార్లలో పండ్ల తోటల విస్తీర్ణాన్ని సాగులోకి తీసుకురావడంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది.


నేడు: ఉద్యాన పంటల గురించి వైసీపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. 


నాడు: ప్రకృతి సేద్యంలో దేశంలోనే ప్రథమం

ప్రకృతి వ్యవసాయం టీడీపీ హయాంలో ప్రారంభమైంది. 2018-19 లో 1.59 లక్షల హెక్టార్లలో జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయం చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 


నేడు: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకృతి వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. సాగు విస్తీర్ణం 50 వేల హెక్టార్లకు పడిపోయింది.


నాడు: రుణమాఫీ

 2014-15 సంవత్సరానికిగానూ జిల్లాలోని 3,37,210 మంది రైతులకు రూ.1430.13 కోట్ల రుణాలను టీడీపీ ప్రభుత్వం మాఫీ చేసింది. ఇందులో మొదటి విడతలో రూ.512.97 కోట్లు, రెండో విడత రూ.232 కోట్లు, మూడో విడత రూ.274 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన 4, 5 విడతలు జమ చేసే సమయంలో ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. 


నేడు: రైతు భరోసా

వైసీపీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీని కొనసాగించలేదు. అయితే రైతు భరోసా పథకం అమలులోకి తెచ్చింది. జిల్లాలో 6.20 లక్షల మంది రైతులుండగా.. మొదటి విడతలో 4.56 లక్షల మందికి రూ.321 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేశారు. రెండో విడత రూ.200 కోట్ల వరకు రైతులకు అందాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ యోజన పేరుతో ఇస్తున్న నిధులు మాత్రం జిల్లాలోని ప్రతి రైతుకూ అందుతున్నాయి. 


నాడు: తేనెటీగల పెంపకం

 అప్పటి కలెక్టర్‌ ప్రద్యుమ్న చొరవతో 2018 సంవత్సరంలో జిల్లాలో తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించారు. 1075 మంది రైతులు తేనెటీగల్ని పెంచేవారు. నెలకు రూ.10 వేల వరకు ఆదాయం లభించేది. ఒక్కో రైతుకు రూ.12 వేల సబ్సిడీ ఇచ్చి అప్పటి ప్రభుత్వం ప్రోత్సహించేది.


నేడు:  ప్రస్తుతం 400 మంది రైతులు మాత్రమే తేనెటీగల పెంపకంలో ఉన్నారు. అధికారులూ దీన్ని పట్టించుకోవడం లేదు.


నాడు: వేరుసెనగతో పాటూ నవధాన్యాలు

జిల్లాలోని రైతులకు గత ఏడాది 71 వేల క్వింటాళ్ల వేరుసెగన విత్తనాలతో పాటు రూ.280 విలువ చేసే కంది, జొన్నలు, రాగులు, అలసంద, అనప వంటి ఐదు రకాల నవధాన్యాలు కిట్‌లను ఉచితంగా అందించారు. అవసరమున్నవారికి సుమారు 55 వేల కిట్‌లను అందించారు. 


నేడు:  ఈసారి 73 వేల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఇతర ధాన్యాలు ఇవ్వలేదు.



నాడు: మల్బరీసాగుకు ఎన్నో ప్రోత్సాహకాలు

2018-19లో 45,594 ఎకరాల్లో 26,905 మంది రైతులు మల్బరీ సాగు చేశారు. ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇచ్చేది. వీ1 మల్బరీ వంగడాల నారు మొక్కలు సాగు చేస్తే ఎకరాకు రూ.10,500 రాయితీ ఇచ్చేవారు. పట్టుపురుగుల పెంపకపు గది నిర్మించుకునే రైతులకు గది సైజును బట్టి రూ.90 వేల నుంచి 2.75 లక్షల వరకు రాయితీ ఇచ్చేవారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బైవోల్టీన్‌ పట్టుగూళ్లు ఉత్పత్తి చేసిన రైతుకు కిలోకు రూ.50 చొప్పున రాయితీ ఇచ్చేవారు.


నేడు: ప్రోత్సాహక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మల్బరీ సాగు సగానికి సగం పడిపోయింది.  2019-20లో 23,112 ఎకరాల్లో 15,346 మంది రైతులు మాత్రమే మల్బరీ సాగు చేస్తున్నారు.

నాడు: మహిళలకు సాగు యంత్రాలు

 జిల్లాలోని 43 మహిళా గ్రూపులకు 40శాతం రాయితీతో ట్రాక్టర్లు, ట్రాక్టరుతో నడిచే సాగు యంత్రాలను అందించారు. ఈ పరికరాలను మహిళా సభ్యులు అద్దెకు ఇచ్చి ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఈ ప్రయోగాన్ని తొలుత మన జిల్లాలోనే ప్రయోగాత్మకంగా ఈ పథకం ప్రారంభించి క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. మండలానికి ఒక గ్రూపు చొప్పున 43 మండలాలకు అందించారు. ఒక్కో గ్రూపులో సగటున 10 మంది మహిళలుంటారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ.20 లక్షలు కాగా.. అందులో 40 శాతం, అంటే రూ.8 లక్షల రాయితీ అందించారు. ఇలా 43 గ్రూపులకు రూ.8 లక్షల చొప్పున రూ.3.44 కోట్ల రాయితీని అందించారు. ఈ పథకం ద్వారా 430 మంది మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యారు.


నేడు: ఈ పథకం ఊసే లేదు


నాడు: రైతుకు రథం

రైతన్నల మేలు కోరి టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 2017-18, 2018-19 సంవత్సరాల్లో జిల్లాలో రూ.460 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క 2017-18వ సంవత్సరంలోనే 970 ట్రాక్టర్లను రైతు రథం పథకం ద్వారా జిల్లా రైతులకు అందించారు.


నేడు: వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని రద్దు చేసింది. 

Updated Date - 2020-06-05T10:47:46+05:30 IST