చీకట్లలో చదువులు

ABN , First Publish Date - 2022-04-13T05:42:01+05:30 IST

పరీక్షలు దగ్గర పడ్డాయి. విద్యుత్‌ కోతల వల్ల విద్యార్థులు స్థిమితంగా చదువుకోలేకపోతున్నారు.

చీకట్లలో చదువులు

27న పది, మే 6న ఇంటర్‌ పరీక్షలు 

వెంటాడుతున్న విద్యుత్‌ కోతలు 

పగలు ఉక్కపోత, రాత్రి చీకటి 

ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు 


రుద్రవరం, ఏప్రిల్‌ 12: పరీక్షలు దగ్గర పడ్డాయి. విద్యుత్‌ కోతల వల్ల విద్యార్థులు స్థిమితంగా చదువుకోలేకపోతున్నారు. ఏడాది పాటు ఫీజులు కట్టి కష్టపడి చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తును కరెంట్‌ కోతలు అంధకారంలో ముంచెత్తుతాయనే ఆందోళన మొదలైంది. పరీక్షల సమయంలో విద్యుత్‌ కోతలు ఏమిటని విమర్శలు తలెత్తుతున్నాయి. పగలు చదువుకోవాలంటే ఉక్కపోత, రాత్రి చదువుకోవాలంటే ఏకంగా లైట్లు వెలగవు. ఈ స్థితిలో ఎలా చదవాలి? ఎలా పరీక్షలు గట్టెక్కాలని పదోతరగతి, ఇంటర్‌ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి పదో తరగతి, మే 6 నుంచి ఇంటర్‌ పరీక్షలు మొదలువుతాయి. ఇలాంటి సమయంలో విద్యుత్‌ కోతలు తమ పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


పది పరీక్షల టైమ్‌ టేబుల్‌ ఇలా.. 


పదోతరగతి పరీక్షలు ఈనెల 27న ప్రారంభం కానున్నాయి. 27న ఫస్ట్‌ లాగ్వేజ్‌ గ్రూప్‌-ఎ, 28న సెకండ్‌ లాగ్వేజ్‌, 29న ఇంగ్లీషు, మే 2న గణితం, 4న ఫిజికల్‌ సైన్స్‌, 5న బయలాజికల్‌ సైన్స్‌, 6న సోషల్‌, 7న ఫస్ట్‌లాగ్వేజ్‌ పేపర్‌- 2, సంస్కృతం,  అరబిక్‌, పర్షియన్‌, 9న మెయిన్‌ లాగ్వేజ్‌ పేపర్‌ -2, సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌ పరీక్షలు కొనసాగుతాయి. 


ఇంటర్‌ పరీక్షలు ఇలా.. 


మే 6వ తేదీ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమై 24వ తేదీ వరకు జూనియర్‌, సీనియర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. 


రుద్రవరం మండలంలో పది విద్యార్థులు ఇలా.. 


రుద్రవరం మండలంలో పదోతరగతి విద్యార్థులు పాఠశాలల వారీగా ఇలా ఉన్నారు. ఎల్లావత్తుల 55, పెద్దకంబలూరు 20, ఎర్రగుడిదిన్నె 10, రుద్రవరం 81, రుద్రవరం కస్తూర్బా గాంధీ విద్యాలయం 44, ఆదర్శ పాఠశాల 83, మందలూరు ఎయిడెడ్‌ 15, నరసాపురం 24, నరసాపురం ప్రైవేటు పాఠశాలలో 18 మంది, ఆలమూరు ఉన్నత పాఠశాలో 71 మంది మొత్తం 417 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 


కొవ్వొత్తులతో తల్లిదండ్రుల నిరసన 


రుద్రవరం మండలంలోని కోటకొండ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్‌ కోతలు విధిస్తే రాత్రిపూట విద్యార్థులు ఎలా చదువుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు దగ్గర పడటంతో వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందోని వాపోయారు. 


పగలు ఉక్కపోత.. రాత్రి చీకటి


విద్యుత్‌ కోతలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. పగలు ఉక్కపోత, రాత్రి చీకటి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెడుతున్నాయి.  విద్యార్థులు కొవ్వొత్తులు, లాంతర్లు, సెల్‌ చార్జింగ్‌ లైట్‌లతో చదువుకుంటున్నారు. రాత్రిళ్లు కరెంట్‌ లేకపోవడంతో నెట్‌ ద్వారా పరీక్షల సమాచారం విద్యార్థులు  డౌన్‌లోడ్‌ చేసుకోలేకపోతున్నారు. 


చీకటితో ఇబ్బంది పడుతున్నాం


పరీక్షలు దగ్గర పడుతున్నాయి.  చీకట్లో ఎలా చదువుకోవాలి? ఆదర్శ పాఠశాల హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నా. ఇటీవల కరెంట్‌ కోతల సమయంలో ఓ విద్యార్థినికి పురుగు కాటేసింది. విద్యార్థినులంతా నిద్రపోకుండా భయపడ్డాం


-ధర్మావతి, పదోతరగతి విద్యార్థిని, ఆదర్శ పాఠశాల . 


పరీక్షలు దగ్గర పడుతున్నాయి


పరీక్షలు దగ్గర పడుతున్నాయి. విద్యుత్‌ కోతలు వెంటాడుతున్నాయి. రాత్రి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇలాగైతే పది పరీక్షలు ఎలా రాయాలి?


-సురేష్‌, పదోతరగతి విద్యార్థి 


ఇబ్బందిగా ఉంది 


పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్ది కరెంట్‌ కోతలు వెంటాడుతున్నాయి. కొవ్వొత్తుల వెలుతురులో చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాగైతే పరీక్షలు గట్టెక్కగలమా? 


-చంద్రపాల్‌, సీనియర్‌ ఇంటర్‌, రుద్రవరం 


కొవ్వొత్తి వెలుతురులో..


పరీక్షల భయం వెంటాడుతోంది. ఇంకో పక్క కరెంట్‌ ఉండటం లేదు. కొవ్వొత్తుల వెలుతురులో చదువుకుంటున్నాం. విద్యుత్‌ కోత విద్యార్థులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. 


-ప్రసన్న, జూనియర్‌ ఇంటర్‌, శ్రీరంగాపురం 


సెల్‌ లైట్‌ సహాయంతో.. 


పరీక్షలు దగ్గర పడుతున్నాయని సెల్‌ టైల్‌ సహాయంతో చదువుకుంటున్నా. పరీక్షల సమయంలో విద్యుత్‌ కోతలు సబబు కాదు. విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నారు.


-పవన్‌, జూనియర్‌ ఇంటర్‌, నాగులవరం 


ఇలాగైతే ఎలా..


ఒక వైపు ఎండల ఉక్కపోత, మరో వైపు కరెంట్‌ కోతలు వెంటాడుతున్నాయి. ఇలాగైతే పరీక్షలు రాసేదెలా. పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పరీక్షల సమయంలో విద్యుత్‌ సరఫరా చేసి విద్యార్థులను ఆదుకోవాలి.


-మహేంద్ర, జూనియర్‌ ఇంటర్‌, పెద్దకంబలూరు

Updated Date - 2022-04-13T05:42:01+05:30 IST