విద్యార్థులు లక్ష్యం దిశగా చదవాలి

ABN , First Publish Date - 2022-05-23T04:40:54+05:30 IST

విద్యార్థులు లక్ష్యం దిశగా చదవాలని హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ (డీఎస్‌ఏ) డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ సూచించారు.

విద్యార్థులు లక్ష్యం దిశగా చదవాలి
ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో సత్యనారాయణ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు యాదగిరి

జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీఎస్‌ఏ డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ

సిద్దిపేట రూరల్‌, మే 22: విద్యార్థులు లక్ష్యం దిశగా చదవాలని హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ (డీఎస్‌ఏ) డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ సూచించారు. సిద్దిపేట రూరల్‌ మండలంలోని తోర్నాల వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం రాత్రి జరిగిన వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ భవిష్యత్‌ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నదని చెప్పారు. కూలీల కొరతను అధిగమించేందుకు  యంత్రాల వినియోగం పెరిగిందన్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులను రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం వల్ల అధిక దిగుబడులు లభిస్తాయని తెలిపారు. డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు సమయం వృధా చేయకుండా ఉన్నత చదువులు చదవాలని సూచించారు. కళాశాలలో ఉన్నన్ని రోజులు ఇబ్బందిగా అనిపించినా మీ బంగారు భవిష్యత్‌ కోసమేనన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మజ సూచించారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ మాట్లాడుతూ భవిష్యత్‌లో వ్యవసాయ రంగంలో మార్పులు జరుగుతాయని చెప్పారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీదేవి గతేడాది కళాశాలలో చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. వివిధ అంశాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన ‘నేలను కాపాడుకుందాం’ దృశ్య నాటకం ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు యాదగిరి, తోర్నాల గ్రామం వార్డుసభ్యులు, పరిశోధనా సహాయ సంచాలకులు డాక్టర్‌ ఉమారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T04:40:54+05:30 IST