నిస్వార్థ రాజకీయాలకు విద్యార్థులు నడుం బిగించాలి

ABN , First Publish Date - 2022-08-14T05:38:35+05:30 IST

కుళ్లూ... కుతంత్రాలతో నిండిపోయిన రాజకీయాలకు చరమగీతం పలికి నిస్వార్థ రాజకీయాలకు నాంది పలకాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే టీసీరాజన్‌ పేర్కొన్నారు

నిస్వార్థ రాజకీయాలకు విద్యార్థులు నడుం బిగించాలి
టీసీ రాజన్‌కు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే టీసీరాజన్‌ పిలుపు


గంగవరం, ఆగస్టు 13: కుళ్లూ... కుతంత్రాలతో నిండిపోయిన రాజకీయాలకు చరమగీతం పలికి నిస్వార్థ రాజకీయాలకు నాంది పలకాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే టీసీరాజన్‌ పేర్కొన్నారు. శనివారం పలమనేరు మండలంలోని కేటిల్‌ఫాం ఇమాసిస్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...  స్వాతంత్య్రమే ఊపిరి నినాదంతో బ్రిటీషోళ్ల దెబ్బలకు బయపడకుండా దేశవ్యాప్తంగా అన్నికులాలు, మతాల వారు కలసికట్టుగా పోరాడి సాధించిన విజయమే స్వాతంత్య్ర దినోత్సవమన్నారు. అలా సాధించిన దేశంలో కుతంత్రాలు, స్వార్థం పేరుకుపోయాయన్నారు. ఆనాడు ఎమ్మెల్యే, ఎంపీలు అవ్వాలంటే నీతి, నిజాయితీ చూసి ఓట్లు వేసేవారన్నారు. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఎమ్మెల్యేలు అయి ప్రజలకు సేవ చేసినట్టు తెలిపారు. కానీ నేడు రాజకీయాల్లోకి చాలామంది డబ్బులున్నవారు, కేసులు ఉన్న వారు ప్రవేశించి రాజకీయం అనే పదానికి విలువలేకుండా చేస్తుండడం బాధగా ఉందన్నారు. నేటి ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన తరువాత, అంతకు రెట్టింపు సంపాదించుకొని దండుకోవడమే లక్ష్యంగా పలువురు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా కుతంత్రాలతోపాటు ప్రజాస్వామ్యంలో అత్యున్నత దేవాలయంగా కొలిచే అసెంబ్లీ, పార్లమెంట్‌లో భూతులు తిట్టుకొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ, కక్షపూరిత పాలనలకు దారితీయడం కలచివేస్తోందన్నారు. దేశంలో నెలకొన్న స్వార్థ రాజకీయాలు, లంచగొండీ తనం అంతమెందించాలంటే నేటి విద్యార్థి దశలో ఉన్న యువకులే కీలకమన్నారు.  ఏ రంగంలో స్థిరపడినా దేశంలో స్వార్థం లేని రాజకీయ వాతావరణం నెలకొల్పడానికి ప్రతిఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. అనంతరం టీసీరాజన్‌ను దుశ్శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం క్యాతలిన్‌ జాకబ్‌, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:38:35+05:30 IST