ఆన్‌లైన్‌ క్లాస్‌లకు విద్యార్థులు డుమ్మా..!

ABN , First Publish Date - 2021-06-15T16:53:07+05:30 IST

కరోనా నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులను

ఆన్‌లైన్‌ క్లాస్‌లకు విద్యార్థులు డుమ్మా..!

  • 26 శాతం మంది వినలేదు..
  • 83,774 మందిలో 58,376 హాజరు
  • 3,326 పిల్లలకు టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేని పరిస్థితి
  • కనీస అభ్యాసన సామర్థాలు కోల్పోతున్న విద్యార్థులు
  • తాజాగా ఉపకరణాలపై కొనసాగుతున్న సర్వే

హైదరాబాద్‌ సిటీ : కరోనా నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులను కొంతమంది విద్యార్థులు పట్టించుకోవడం లేదు. గంటల తరబడి టీవీలు, కం ప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల ఎదుట కూర్చుని పాఠాలు వినేందుకు ఆసక్తి చూపించడం లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది మార్చి 16 నుంచి ప్ర భుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే  పై తరగతికి ప్రమోట్‌ చేశారు. కాగా, పదో తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించిన తర్వాత కరోనా తీవ్రతతో అర్ధంతంగా రద్దు చేసి అందరినీ పాస్‌ చేశారు. ఇదిలా ఉండగా, కరోనా మొదటి దశ కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్‌ 12 నుంచి టీ-శాట్‌, దూరదర్శన్‌ చానళ్ల ద్వారా 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పారు.


74 శాతం మందే హాజరు

కరోనా కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో ఏడాదిగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదని తెలుస్తోంది. 2020-21 విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ జిల్లాలోని 689 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి పిల్లలను 83,774 మందిని గుర్తించారు. ఈ మేరకు సాంకేతిక పాఠాలు వినేందుకు కావాల్సిన టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టా్‌పలపై ఇంటింటి సర్వే చేపట్టగా మొత్తం విద్యార్థుల్లో 3,326 ఇళ్లలో లేవని తేలిపింది. అయితే ఉపకరణాలు లేని పిల్లలను ఇంటి పక్కన ఉండే తోటి విద్యార్థులతో కలిసి వారి సాధనాల ద్వారా పాఠాలు వినాలని చెప్పినా 26 శాతం మంది పట్టించుకోలేదు. ఈ క్రమంలో దాదాపు ఏడునెలల పాటు విరామం లేకుండా నిర్వహించిన ఆన్‌లైన్‌ క్లాసులకు 83,774 మందిలో 58,376 పిల్లలే హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారులు వెల్లడించారు.


పట్టించుకోని తల్లిదండ్రులు, టీచర్లు..

కరోనా మహమ్మారి కారణంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు  తగ్గిపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆన్‌లైన్‌ క్లాసులను కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రధానం గా ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు పిల్లలను ఆన్‌లైన్‌ క్లాసులకు దూ రంగా ఉంచుతున్నారు. సాంకేతిక పాఠాలను నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు, ఉపాధ్యాయుల్లో కొంతమంది తమకేం పట్టిందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో కనీస అభ్యసన సా మర్థ్యాలు తగ్గిపోతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. వేలాది రూపాయల వేతనాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం తగదని పే ర్కొంటున్నారు. ఉపకరణాలు లేని కారణంగా ఆన్‌లైన్‌ క్లాసులను అభ్యసించని పిల్లలకు ప్రత్యామ్నాయం చూపించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.


గతేడాది ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరైన విద్యార్థులు..

మొత్తం పాఠశాలలు : 689

3 నుంచి 10 విద్యార్థులు : 83,774

టీ-శాట్‌, డీడీ చానల్‌ ద్వారా పాఠాలు విన్నవారు : 42,248

స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌, కంప్యూటర్ల ద్వారా విన్నవారు:16,128

ఆన్‌లైన్‌లో పిల్లలతో మాట్లాడిన అధికారులు, టీచర్లు: 3,172

ఉపకరణాలు లేని విద్యార్థులు: 3,326

పాఠశాలల వారీగా వాట్సాప్‌ గ్రూపుల సంఖ్య: 3076


సర్వే చేయిస్తున్నాం

త్వరలో ప్రారంభంకానున్న 2021-22 విద్యా సంవత్సరం సందర్భంగా ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంతమంది విద్యార్థుల ఇళ్లలో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, లాప్‌ టాప్‌లు లేవనే విషయంపై సర్వే నిర్వహిస్తున్నాం. ఉపకరణాలు లేని పిల్లలను తోటి విద్యార్థుల ఇళ్లలో కలిపి కూర్చోబెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. గతేడాది కంటే ఈసారి వందశాతం మంది ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం - రోహిణి, జిల్లా విద్యాశాఖాధికారి.

Updated Date - 2021-06-15T16:53:07+05:30 IST