ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని దివ్య
మదనపల్లె రూరల్, జనవరి 16: ప్రేమించమంటూ వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తంబళ్లపల్లె మండలంలో జరిగింది. మదనపల్లె జిల్లా ఆస్పత్రి అవుట్‌పోస్టు పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు... తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లెకు చెందిన వెంకటరమణ కుమార్తె స్వాతి(18) కలికిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరికి వచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించాలని వేధింపులకు గురి చేయడంతో ఆదివారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందుతాగింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందింది. అవుట్‌పోస్టు పోలీసుల సమాచారంతో తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.