‘ఎల్‌హెచ్‌ఎంఎ్‌స’తో చిక్కాడు.. ఎస్కార్ట్‌ నుంచి తప్పించుకున్నాడు!

ABN , First Publish Date - 2022-05-15T08:39:26+05:30 IST

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఓ గజదొంగను పోలీసులకు పట్టించింది. ఎస్కార్ట్‌ సిబ్బంది ఆదమరిచి ఉండటంతో తప్పించుకున్నాడు.

‘ఎల్‌హెచ్‌ఎంఎ్‌స’తో చిక్కాడు.. ఎస్కార్ట్‌ నుంచి తప్పించుకున్నాడు!
పరారైన గజదొంగ మూర్తి నవీన్‌

తిరుపతి సబ్‌ జైలు వద్ద నుంచి పరారైన గజదొంగ

రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పోలీసులు


తిరుపతి(నేరవిభాగం), మే 14: ఎల్‌హెచ్‌ఎంఎస్‌ (లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) ఓ గజదొంగను పోలీసులకు పట్టించింది. ఎస్కార్ట్‌ సిబ్బంది ఆదమరిచి ఉండటంతో తప్పించుకున్నాడు. వివరాలిలా.. బెంగళూరుకు చెందిన నరసింహమూర్తి కుమారుడు మూర్తి నవీన్‌ అలియాస్‌ అశోక్‌ (28) చిన్నప్పటి నుంచే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. రాజమండ్రి నుంచి నెల్లూరు, తిరుపతి వరకు అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు. పట్టపగలే ఇళ్లల్లో దొంగతనాలు చేసేవాడు. కొంతకాలంగా తిరుపతిలో ఉన్న నవీన్‌ దృష్టి ఎంఆర్‌పల్లె పోలీసు స్టేషన్‌ పరిధిలోని టీటీడీ ఫ్లాట్స్‌లో తాళంవేసి ఉన్న ఓ ఇంటిపై పడింది. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో ఆ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. ఇంటి యజమానులు ఊరెళుతూ ఎల్‌హెచ్‌ఎంఎ్‌సను ఏర్పాటు చేయించుకున్నారు. దాంతో నిందితుడు లోపలకు ప్రవేశించగానే ఎల్‌హెచ్‌ఎంఎస్‌ తనపని తాను చేసింది. సమాచారం అందుకున్న ఎంఆర్‌పల్లె పోలీసులు వెంటనే ఆ ఇంటి వద్దకు చేరుకుని గజదొంగను పట్టుకున్నారు. ఈ సమయంలో పోలీసులను ప్రతిఘటించి తప్పించుకునేందుకు నవీన్‌ విఫలయత్నం చేశాడు.  విచారణ తర్వాత నిందితుడిని శనివారం రాత్రి పోలీసులు తిరుపతి కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడంతో నిందితుడికి రిమాండ్‌ విధించారు. రిమాండ్‌ ఆదేశాలకు సంబంధించిన పత్రాలతోపాటు నిందితుడిని అప్పగించడానికి తిరుపతి సబ్‌జైలు వద్ద వేచి ఉన్నారు. ఎస్కార్ట్‌ సిబ్బంది ఆదమరిచి ఉండగా రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో నిందితుడు తప్పించుకున్నాడు. పోలీసులు తేరుకుని వెంబడించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గజదొంగ కోసం గాలిస్తున్నారు. వెస్ట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సబ్‌జైలు వద్దనుంచి పారిపోవడంతో ఎంఆర్‌పల్లె పోలీసులు వెస్ట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2022-05-15T08:39:26+05:30 IST