రైతుకు మొండిచేయి.. వ్యాపారికి జై

ABN , First Publish Date - 2022-05-23T05:56:49+05:30 IST

ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అన్నదాతల బతుకులతో ఆడుకుంటోంది.

రైతుకు మొండిచేయి.. వ్యాపారికి జై

  1. వేరుశనగ సేకరణలో మారిన ప్రభుత్వ నిర్ణయం
  2. వ్యాపారుల నుంచి కొనుగోలుకు సిద్ధం
  3. గతంలో రైతుల నుంచి క్వింటాలు రూ.6వేలకు కొనుగోలు 
  4. ఇప్పుడు వ్యాపారులకు రూ.8వేలు ఇచ్చేలా వ్యూహం
  5. 3.94 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకు ఏపీ సీడ్స్‌ నిర్ణయం 
  6. ప్రభుత్వానికి రూ.59.16 కోట్ల భారం 

ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అన్నదాతల బతుకులతో ఆడుకుంటోంది. సాయం చేసి సాగును ప్రోత్సహించాల్సిన సర్కారే వ్యవసాయాన్ని భారంగా మార్చుతోంది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూనే వ్యాపారులతో కుమ్కక్కై కర్షకుల నోటికాడి కూడును లాక్కుంటోంది. గతం సంవత్సరం వేరుశనగ విత్తనాలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ సారి ఆ పనిని వ్యాపారులకు అప్పగించింది. అది కూడా వారి నుంచి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తామని చెప్పింది. రైతుల నుంచి రూ.6,500కు కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈసారి వ్యాపారులకు రూ.8వేలకు పైగానే చెల్లించడానికి సిద్ధపడుతోంది.


కర్నూలు (అగ్రికల్చర్‌), మే 22: ఈ రైతు పేరు చిన్న రాముడు. కృష్ణగిరి మండలం ఎర్రబాడు గ్రామం. తనకున్న మూడెకరాల పొలంలో గత రబీలో కే-6 రకం వేరుశనగ సాగు చేశాడు. దాదాపు  20 క్వింటాళ్ల దిగుబడి చేతికి అందింది. గత సంవత్సరం ఖరీ్‌ఫలో మాదిరే ఈసారి కూడా ఏపీ సీడ్స్‌ అధికారులు కొనుగోలు చేస్తారేమోనని నెల రోజుల నుంచి ఎదురు చూశారు. అధికారులు ఈసారి రైతుల నుంచి కాకుండా వ్యాపారుల నుంచి వేరుశనగ విత్తన కాయలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ రైతు ఇదేమి దారుణమంటూ మరోదారి లేక కర్నూలు మార్కెట్‌యార్డుకు విత్తన కాయలను తీసుకువచ్చి వ్యాపారులకు విక్రయించారు. క్వింటం రూ.6వేలకు ఆ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఏపీ సీడ్స్‌ అధికారులు కొనుగోలు చేసి ఉంటే మరో రూ.500 తమ చేతికి అందేవని సదరు రైతు వాపోతున్నాడు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో గత రబీలో కే-6 రకం వేరుశనగను సాగు చేసిన రైతులందరిదీ ఇదే పరిస్థితి. ఏపీ సీడ్స్‌ అధికారులు రైతుల నుంచి కాకుండా వ్యాపారుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించడం వెనుక ప్రభుత్వ స్థాయిలో లాబీయింగ్‌ జరిగినట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. 

    ఖరీఫ్‌ సీజన్‌ ప్రధాన పంటగా రాయలసీమలో వేరుశనగను సాగు చేస్తారు. దీంతో ప్రభుత్వం వేరుశనగ విత్తన కాయలను సేకరించి రైతులకు 40 శాతం సబ్సిడీపై అందించేందుకు నిర్ణయించింది. గత సంవత్సరం కే-6తోపాటు నారాయణ, కదిరి, లేపాక్షి రకాల విత్తనాలను రైతుల నుంచే సేకరించి రాయితీపై పంపిణీ చేశారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో గానీ.. ఈసారి రైతుల నుంచి కాకుండా వ్యాపారుల నుంచి వేరుశనగ విత్తన కాయలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమ నుంచి క్వింటా వేరుశనగ విత్తనాలను రూ.6,500కు గత ఏడాది కొనుగోలు చేశారని... ఈసారి వ్యాపారుల వద్ద క్వింటాలు రూ.8వేలకు పైగానే చెల్లించి కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పడం ఎంతవకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. 


3.94 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకు నిర్ణయం 

ప్రభుత్వం వ్యాపారుల నుంచి 3.94 లక్షల క్వింటాళ్ల విత్తనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారం కిందట విత్తనాలను సేకరించేందుకు ఏ ధర ఆశిస్తున్నారో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ టెండరు నోటీసును కూడా ఏపీ సీడ్స్‌ అధికారులు జారీ చేశారు. శనివారం లోపల టెండరు వేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో కర్నూలు, అనంతపురం, కళ్యాణదుర్గం, కడప తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున అమరావతిలోని ఏపీ సీడ్స్‌ కార్యాలయానికి చేరుకొని క్వింటాకురూ.8వేలకు పైగానే ధర చెల్లిస్తే.. విత్తనాలను సరఫరా చేస్తామని టెండరు వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కర్నూలు జిల్లాకు 20,380 క్వింటాళ్లు, అదేవిధంగా నంద్యాలకు 5,720 క్వింటాళ్లు, వైఎస్సార్‌ కడప జిల్లాకు 8,600 క్వింటాళ్లు, అన్నమయ్య జిల్లాకు 75,500 క్వింటాళ్లు, అనంతపురం జిల్లాకు 1,08,440 క్వింటాళ్లు, సత్యసాయి జిల్లాకు 1,33,979 క్వింటాళ్లు, చిత్తూరుకు 41,892 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసేందుకు ఏపీ సీడ్స్‌ రాష్ట్ర ఉన్నతాధికారులు టెండర్లను పిలిచారు.


ప్రభుత్వంపై రూ.59 కోట్ల భారం:

రాయలసీమలోని వ్యాపారులు ప్రభుత్వ పెద్దలతో జరిపిన మంతనాల కారణంగా ఈ సారి ప్రభుత్వం నిర్ణయం మారినట్టు తెలుస్తోంది. గత సంవత్సరం మాదిరి రైతుల నుంచి కొనుగోలు చేస్తే ఇటు రైతులకు గిట్టుబాటు ధర అందించడంతోపాటు అటు ప్రభుత్వానికి కూడా కొంత భారం తగ్గి ఉండేది. రాయలసీమ మొత్తానికి సేకరించాల్సిన 3.94 లక్షల క్వింటాళ్లపై క్వింటానికి రూ.1,500లు ఎక్కువగా చెల్లించడం వల్ల ప్రభుత్వంపై రూ.59.16 కోట్ల అదనపు భారం పడుతుంది. అయితే ప్రభుత్వం ఈ భారాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా వ్యాపారుల నుంచే వేరుశనగ విత్తనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించడంపై మతలబు ఏంటో అర్థంగాని పరిస్థితి. ఈ నిర్ణయంపై రైతు సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


మార్కెట్‌ యార్డులకు వ్యాపారుల పరుగులు

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరుతోపాటు రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ సాగు చేసిన రైతుల వద్ద క్వింటాలు రూ.6వేల నుంచి రూ.6,500కు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు మార్కెట్‌ యార్డులో క్వింటాలు రూ.6వేల నుంచి నాణ్యతను బట్టి రూ.6,500 కూడా చెల్లించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. కొంతమంది వ్యాపారులు నాసిరకం విత్తనాలను కూడా రూ.5వేల నుంచి రూ.6వేల లోపు (క్వింటంపై) ధర చెల్లించి లారీల్లో తీసుకెళ్తున్నారు. ఒక క్వింటాలుపై ఖర్చులన్నీపోను రూ.1500 దాకా గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు అంచనా వేసుకుంటున్నారు. ఈ లెక్కన రాయలసీమ జిల్లాల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్న 3.94 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలపై వ్యాపాలకు చేకూరే లాభం సుమారు రూ.59 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఈ మొత్తంలో కొంత అధికారులకు, మరికొంత ప్రభుత్వ పెద్దలకు ఇచ్చుకున్నా తమకు రూ.20 నుంచి రూ.30 కోట్ల మేర లాభం చేకూరుతుందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


నాణ్యతపై రైతుల ఆందోళన

గత రబీలో ప్రభుత్వం కోరిన కే-6, నారాయణ, కదిరి, లేపాక్షి రకం విత్తనాలను తాము ఎంతో వ్యయప్రయాసలకోర్చి పండించామని... ఈ సంవత్సరం తమ నుంచే ఏపీ సీడ్స్‌ అధికారులు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందిస్తారని ఆశించామని కర్నూలు, నంద్యాల తదితర రాయలసీమలోని జిల్లాల రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం వ్యాపారుల నుంచే ఈ విత్తన కాయలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించడం వల్ల తమకు తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వ్యాపారులు మార్కెట్‌ యార్డుల్లో నాసిరకం విత్తనాలను తక్కువ ధరకే కొనుగోలు చేసి ఏపీ సీడ్స్‌ అధికారులకు అప్పగించే ప్రమాదం ఉందని, దీని వల్ల తమకు పంట దిగుబడి తగ్గిపోగలదని విచారం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నాణ్యమైన విత్తనాలైనా తమకు అందించాలని.. రబీలో వేరుశనగను సాగు చేస్తున్న రైతులు ఏబీ సీడ్స్‌ ధికారులకు మొర పెట్టుకుంటున్నారు. 


రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదు: శ్రీనివాసులు, మేనేజర్‌, ఏపీసీడ్స్‌ సంస్థ కర్నూలు: 

రాబోయే ఖరీ్‌ఫలో నాణ్యమైన వేరుశనగ విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం రైతుల నుంచి వేరుశనగ విత్తనాలను కొనుగోలు చేసింది. ఈసారి అలా కొనుగోలు చేయడం లేదు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారం రోజుల్లో ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాన్ని   పంపిణీ చేస్తాం. 


తక్కువ ధర చెల్లిస్తామంటున్నారు - చిన్న అబ్బి, రైతు చిలబండ గ్రామం, కోడుమూరు: 

 గత సంవత్సరం ఏపీ సీడ్స్‌ అధికారులే కే-6 రకం వేరుశనగ విత్తనాలను మా నుంచి కొనుగోలు చేశారు. ఈసారి వారు కొనుగోలు చేయరంట. వ్యాపారులు కేవలం క్వింటాలుపై రూ.5,500 చెల్లిస్తామని చెప్పారు. మరో దారి లేక కర్నూలు మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చాను. గత సంవత్సరం ఏపీ సీడ్స్‌ అధికారులు క్వింటాలకు రూ.6,500 చెల్లించారు. ఈసారి వ్యాపారులకు అమ్ముకోవాల్సి రావడం వల్ల నష్టపోయాను.



Updated Date - 2022-05-23T05:56:49+05:30 IST