అయోధ్య రామాలయం ఘనత ఆ ఇద్దరిదే: గుజరాత్ సీఎం

ABN , First Publish Date - 2020-08-05T21:59:14+05:30 IST

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇవాళ జరిగిన భూమిపూజతో ఏళ్లనాటి పోరాటానికి తెరపడినట్టైందని....

అయోధ్య రామాలయం ఘనత ఆ ఇద్దరిదే: గుజరాత్ సీఎం

అహ్మదాబాద్: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇవాళ జరిగిన భూమిపూజతో ఏళ్లనాటి పోరాటానికి తెరపడినట్టైందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పేర్కొన్నారు. ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీరాముడి భవ్య మందిర నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా బీజేపీ తన మాట నిలబెట్టుకుంటుందని మరోసారి రుజువైందని రూపానీ పేర్కొన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభించిన ఘనత ఇద్దరు ‘‘గుజరాతీ బిడ్డలదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఇవాళ ట్విటర్లో ఆయన ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.


 ‘‘జై శ్రీరాం! 21 శతాబ్దం చరిత్ర పుస్తకాల్లో ఆగస్టు 5 సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఐదు దశాబ్దాల నాటి తపస్సు, పోరాటం ఇవాళ రామ్ లల్లా ఆలయ భూమిపూజతో ముగిసింది. అయోధ్యలో రామాలయం కట్టితీరుతామన్న మా నినాదం ఇవాళ నిజమైంది. దేశవ్యాప్తంగా దీపావళిని తలపించేలా వేడుకలు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణం కోసం ఎంతో మంది గుజారాతీలు ‘‘కర సేవ’’లో పాల్గొన్నారు...’’ అని రూపానీ గుర్తుచేసుకున్నారు. అయోధ్యలో అత్యంత సామరస్య పూర్వక వాతావరణంలో ఇవాళ భూమిపూజ జరిగేందుకు కారణం ‘‘ఇద్దరు గుజరాతీ బిడ్డలే’’ అంటూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కొనియాడారు. రామాలయ నిర్మాణం దేశ నిర్మాణానికి, ప్రగతికి మార్గనిర్దేశనం చేస్తుందని తాను బలంగా నమ్ముతున్నట్టు రూపానీ పేర్కొన్నారు. కాగా సీఎం రూపానీ ఇవాళ అయోధ్యలో జరిగిన భూమిపూజ కార్యక్రమం లైవ్‌ను గాంధీ నగర్‌లోని తన అధికారిక నివాసంలో భారీ స్క్రీన్‌పై తిలకించారు.



Updated Date - 2020-08-05T21:59:14+05:30 IST