Abn logo
Jun 6 2020 @ 02:46AM

సాగని నిర్మాణం

విపరీతంగా పెరిగిన సిమెంట్‌ ధర

లాక్‌డౌన్‌కు ముందు రూ.280, ఇప్పుడు రూ.420

ఇటుక అప్పుడు రూ.4-8, ఇప్పుడు రూ.10

ఇప్పటికీ అందుబాటులోకి రాని ఇసుక

మరింత భారం కానున్న నిర్మాణాలు

అమ్మకాలూ అంతంతమాత్రమే

ఆగిపోయిన పనులు

నగర పరిధిలో నిర్మాణాలు 

పనులు ప్రారంభమైనవి:  సుమారు 10 వేలు 

సగానికి పైగా పనులు పూర్తైన నిర్మాణాలు : 1,600

పూర్తయ్యే దశలో ఉన్న భవనాలు : 1,000

భవన నిర్మాణ కార్మికులు : సుమారు లక్ష మంది

 

భవన నిర్మాణ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఏడాదిగా ఇదే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా...దీనికి లాక్‌డౌన్‌ తోడవడంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సిమెంట్‌, ఇటుక ధరలు విపరీతంగా పెరిగిపోవడం, అలాగే అవసరమైనంత ఇసుక లభించకపోవడం వంటి కారణాలు పరిస్థితిని మరింత జటిలం చేసేశాయి. ఫలితంగా నగరంలో భవన నిర్మాణ రంగం దాదాపు నిలిచిపోయే స్థితికి చేరింది.


మద్దిలపాలెం, జూన్‌ 5:

నగరంలో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏడాదిగా ఇసుక కొరత, లాక్‌డౌన్‌, నిర్మాణ సామగ్రి ధరల పెంపు ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. పలు రకాల ఆంక్షలతో ఇసుక లభించక 2019 సెప్టెంబరు వరకు భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ తరువాత ఇసుక యార్డులు ఏర్పాటుచేసి ప్రభుత్వం ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం అందుబాటులోకి వచ్చినా అవసరం మేరకు ఇసుక లభించడం కష్టమయింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఇసుక కష్టాలకు కాస్త విముక్తి లభించింది.


అయితే మార్చిలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నిర్మాణ రంగాన్ని కుదిపేసింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఈమధ్య కాలంలో నిర్మాణ పనులకు అనుమతులు లభించినప్పటికీ ఒక్కసారిగా పెరిగిపోయిన సిమెంట్‌ ధరలు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారాయి. లాక్‌డౌన్‌కు ముందు రూ.280 వున్న సిమెంట్‌ బస్తా ధర ఒక్కసారిగా రూ.420కి ఎగబాకింది. అదే సమయంలో రూ.4 నుంచి రూ.8 మధ్య లభించే ఇటుక ధర రూ.10కి చేరింది. ఈ ధరలతో నిర్మాణాలు పూర్తిచేయడం సాధ్యంకాదని నిర్మాణదారులు పేర్కొంటున్నారు. 


నగరంలో సగం వరకు నిర్మాణాలు పూర్తిచేసుకున్న భవనాలు వేలల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని ఫ్లాట్‌లను అప్పటి ధరలకు విక్రయించారు. ప్రస్తుతం నిర్మాణ రంగ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో పనులు పూర్తి చేస్తే అప్పటి అంచనా వ్యయం కంటే అధికమవుతుంది. ఫలితంగా నష్టపోయే పరిస్థితి వుందని బిల్డర్లు ఆలోచనలో పడ్డారు. దీంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిపివేశారు. రానున్న రెండు నెలల్లో ధరలు అందుబాటులోకి వస్తే నిర్మాణాలు పూర్తి చేయవచ్చుననే ఆలోచనలో ఉన్నారు. 


అమ్మకాలూ అంతంత మాత్రమే

అచ్యుతాపురం నుంచి తగరపువలస, ఎన్‌ఏడీ నుంచి పెందుర్తి వరకు విశాఖ నిర్మాణ రంగం విస్తరించింది. ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖ ప్రకటన ఒక రకంగా అందరినీ గందరగోళంలోకి నెట్టింది. రాజధాని తరలింపుపై జరుగుతున్న జగడాలతో వినియోగదారులు అయోమయంలో పడ్డారు. ఇల్లు అవసరమనుకునేవారు తప్ప పెట్టుబడి పెట్టాలనుకునే వారు మాత్రం రాజధానిపై స్పష్టత వచ్చేంత వరకు వేచిచూసే ఆలోచనలో ఉన్నారు.  


ఇప్పటికీ లభించని ఇసుక  

పెరిగిన భవన నిర్మాణ సామగ్రి ధరలకు తోడు ఇసుక కొరత ఇప్పటికీ వెంటాడుతోంది. నగరంలో ఏర్పాటుచేసిన యార్డుల్లో బుకింగ్‌ చేసిన పది రోజుల తరువాతే ఇసుక అందుబాటులోకి వస్తోంది. యార్డుల్లోకి వచ్చిన ఇసుక రెండు, మూడు రోజులకే అయిపోతోంది. మళ్లీ స్టాక్‌ వచ్చిన తర్వాత బుక్‌ చేస్తే పది రోజులకు డెలివరీ అవుతోంది. యార్డుల్లో టన్ను ఇసుక ధర రూ.1250. రవాణా చార్జీ కిలోమీటరుకు రూ.16 తీసుకుంటున్నారు. బుక్‌ చేసినప్పుడే ఎన్ని గజాల స్థలంలో భవనం నిర్మిస్తున్నామో నమోదుచేయాలి. 100 గజాలైతే 5 టన్నులు, 200 గజాలకు 10 టన్నులు, 300 గజాలకు 18 టన్నులు మాత్రమే ఇసుక ఇస్తారు. ఒకసారి బుక్‌ చేసిన తర్వాత మళ్లీ పది రోజుల వరకు ఇసుక ఇచ్చే అవకాశం లేదు.


అయితే భారీ నిర్మాణాలకు పది టన్నుల ఇసుక ఒకటి, రెండు రోజుల్లోనే అయిపోతోంది. మళ్లీ ఇసుక కావాలంటే 8 రోజులు పని నిలిపివేయాలి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా ధర కూడా ఎక్కువగానే చెల్లించాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. ఇసుక రీచ్‌లలో టన్ను ఇసుకకు ప్రభుత్వానికి చెల్లించేది రూ.325 మాత్రమే. దానిని యార్డులకు తరలించి, ఇక్కడి ఉద్యోగుల జీతాలతో కలిపి టన్ను ఇసుక రూ.1250కి విక్రయిస్తున్నారు.


అదే యార్డులు లేకుండా వినియోగదారులకు రీచ్‌ల వద్దే టన్ను ఇసుక రూ.325కు అందిస్తే రవాణాతో కలిపి రూ.600కే లభ్యమవుతుంది. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. దీంతో పూర్తిస్థాయిలో ఇసుక అందుబాటులోకి వచ్చిన తరువాతే నిర్మాణాలు పూర్తిచేయవచ్చుననే ఆలోచనలో చాలామంది ఉన్నారు. కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలిన వున్న వారు ధరలు పెరిగినప్పటికీ నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. 


కష్టాల్లో కార్మికులు 

నగరంలో భవన నిర్మాణ రంగాన్నే నమ్ముకుని వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. తాపీమేస్త్రిలు, కూలీలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వీరంతా నిత్యం పనులతో బిజీగా ఉండేవారు. దాదాపు ఏడాదిగా వీరిలో అధికశాతం మందికి పని లేకుండా పోయింది. దీంతో కొంతమంది ప్రత్యామ్నాయాలను చూసుకోగా, మరికొంతమంది అవస్థల మధ్య జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో జరుగుతున్న కొద్దిపాటి పనులూ ఆగిపోతున్నాయని, దీంతో పనులు లేకుండా పోతున్నాయని వారంతా వాపోతున్నారు. మొత్తమ్మీద నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల, ఇసుక కొరత,  భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement