సుత్తితో మోదాడు... మృతిచెందిందని పరారయ్యాడు

ABN , First Publish Date - 2021-07-31T06:08:29+05:30 IST

కుమార్తె పెళ్లి విషయంలో జరిగిన ఘర్షణ భార్య ప్రాణాల మీదకు తెచ్చింది. చివ్వెంల మం డలం మాన్యానాయక్‌తండా ఆవాసం పీక్లానాయక్‌తండాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.

సుత్తితో మోదాడు...   మృతిచెందిందని పరారయ్యాడు
దాడిలో గాయపడిన శారద

భార్య పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు 

కుమార్తె పెళ్లి విషయంలో తరుచూ భార్యాభర్తల ఘర్షణలు  

చివ్వెంల, జూలై 30 : కుమార్తె పెళ్లి విషయంలో జరిగిన ఘర్షణ భార్య ప్రాణాల మీదకు తెచ్చింది. చివ్వెంల మం డలం మాన్యానాయక్‌తండా ఆవాసం పీక్లానాయక్‌తండాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన బానోతు వెంకన్న, శారదలకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, కుమార్తె ఇంటర్‌ పూర్తి చేసింది. వెంకన్న లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ, మద్యానికి బానిసయ్యాడు. శారద కూలీపనిచేస్తూ కుటుంబ పోషణకు ఆసరాగా ఉంటోంది. అయితే కుమార్తె పెళ్లి విషయంలో కొంతకాలంగా భార్యాభర్తల నడుమ ఘర్షణలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శారదపై వెంకన్న సుత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, శారద మృతి చెందిందని భావించిన వెంకన్న అక్కడినుంచి పరారయ్యాడు. కొంత సమయం తర్వాత చుట్టుపక్కల వారు గమనించి, రక్తపు మడుగులో ఉన్న శారదను ఆటోలో సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ తరలించారు. సమాచారం తెలుసుకున్న సీఐ విఠల్‌రెడ్డి, ఎస్‌ఐ విష్ణుమూర్తి సంఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శారద సోదరుడు లూనావత్‌ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడు వెంకన్న పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.  


Updated Date - 2021-07-31T06:08:29+05:30 IST