ప్రశాంత ఎన్నికలకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2021-03-04T05:12:56+05:30 IST

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని , ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్‌ దండే తెలిపారు.

ప్రశాంత ఎన్నికలకు పటిష్ట చర్యలు
సాలూరులో ఏర్పాట్లు పరిశీలిస్తున్న దృశ్యం

   జిల్లా ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్‌ దండే 

   అందరూ స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలని అధికారులకు సూచన

పార్వతీపురంటౌన్‌, మార్చి 3: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని , ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని  జిల్లా ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్‌ దండే తెలిపారు. బుధవారం మునిసిపల్‌ కార్యాలయంలోని ఓట్ల లెక్కింపు కేంద్రంతోపాటు బ్యాలెట్‌ బ్యాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ అధికారులతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికారులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 10న  ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 

  సాలూరు : ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్‌ దండే తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక మునిసిపాలిటీలో ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సజావుగా ఎన్నికల సామగ్రి పంపిణీ చేయాలని ఆదే శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల ఉపసంహరణ కౌంటర్లు, స్ర్టాంగ్‌ రూం వద్ద ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.  మొత్తం ఎన్ని కౌంటర్లు...? పంపిణీ ప్రక్రియ ఎలా నిర్వహిస్తారు! తదితర  విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉందాలని తెలిపారు.  జాయింట్‌ కలెక్టర్‌ కిషోర్‌ కుమార్‌, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, సబ్‌ కలెక్టర్‌ విధేఖర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ రమణమూర్తి తదితరులు ఉన్నారు. 

 ఏజెన్సీలో పర్యటన 

గుమ్మలక్ష్మీపురం: రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే బుధవారం ఏజెన్సీలో పర్యటించారు. ఆకస్మిక సందర్శనలు చేశారు. మునిసిపల్‌ ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న ఆయన మంగళవారం రాత్రి భద్రగిరి కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బస చేశారు. బుధవారం ఉదయం 5 గంటలకు మార్నింగ్‌ వాక్‌లో భాగంగా సవరకోటపాడు నర్సరీని సందర్శించారు. సవరకోటపాడు గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై  ఆరాతీశారు. అనంతరం భద్రగిరి గిరిజన గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి కొద్దిసేపు నడిచారు. పాఠశాలలో వసతి, మౌలిక సౌకర్యాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను గుంటూరు జిల్లా తాడికొండ గురుకుల పాఠశాలలో చదువు కున్నానని, కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎల్విన్‌పేట సీఐ టీవీ తిరుపతిరావు తదితరులు ఉన్నారు.

 

Updated Date - 2021-03-04T05:12:56+05:30 IST