అడవిని మింగేస్తున్నారు!

ABN , First Publish Date - 2022-09-22T06:58:02+05:30 IST

అది 3333 ఎకరాల అటవీ భూమి. ఇప్పటికే చాలా వరకూ అన్యాక్రాంతమైంది.

అడవిని మింగేస్తున్నారు!
కాట్రేనిపాడులోని అటవీ భూముల్లో జరిగిన అక్రమ తవ్వకాలు

ఖాళీ అవుతున్న చెట్లు.. గ్రావెల్‌ గుట్టలు

ఇప్పటికే కనుమరుగైన వేలాది ఎకరాల అడవి

మిగిలిన కొద్దిపాటి భూమి ఆక్రమణకూ యత్నాలు

ప్రభుత్వం మేల్కోకుంటే.. అడవి కనుమరుగే!


నూజివీడు, సెప్టెంబరు 21: అది 3333 ఎకరాల అటవీ భూమి. ఇప్పటికే చాలా వరకూ అన్యాక్రాంతమైంది. పెద్ద పెద్ద గుట్టలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు వాటిపైనా కన్నేసిన అక్రమా ర్కులు చెట్లను నరికేసి.. గుట్టలు, రాళ్లను తొలగించి సుమారు 50 ఎకరాల్లోని భూమిని అమ్మేసుకోడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు అటవీ శాఖ పరిధిలోని బలివే, కాట్రేని పాడు, సుంకొల్లు, సిద్దార్ధనగర్‌, మడిచర్ల అటవీ బ్లాకులు ఉన్నాయి. దీనిలో కాట్రేని పాడులో 3,333 ఎకరాలు, బలివే, సిద్దార్ధ నగర్‌, సుంకొల్లు బ్లాకుల్లోని ఒక్కో బ్లాక్‌లో సుమారు రెండు వేల ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ బ్లాకుల్లోని వేలాది ఎకరాల అటవీ భూమి దశల వారీగా అన్యాక్రాంతమైంది. అటవీ భూమిపై గతంలో పేదలకు రెండు ఎకరాల చొప్పున ప్రభుత్వం పంట హక్కులు కల్పిస్తూ చెట్టు పట్టాలివ్వగా.. ఆ పట్టాలను అడ్డం పెట్టుకుని పేదల నుంచి కొందరు పెద్దలు భూమిని కొనుగోలు చేశారు. వారి పక్కనే ఉన్న వందలాది ఎకరాల అటవీ భూములనూ ఆక్రమించేసుకున్నారు. నకిలీ పత్రాలతో ఏలూరు సెటిల్‌మెంట్‌ కోర్టు ద్వారా గతంలోనే కొందరు పెద్దలు అటవీ భూమిని సొంతం చేసుకున్నారు. 


50 ఎకరాలకు జోరుగా బేరాలు


ముసునూరు మండలం కాట్రేనిపాడు బ్లాక్‌లో ఉన్న 3,333 ఎకరాల అటవీ భూ మి దశలవారీగా ఆక్రమణలకు గురవుతోంది. గతంలో ఆక్రమణలకు గురైన అటవీ భూమి సేద్య భూమిగా మారిపోయింది. మధ్యలో పెద్ద పెద్ద గుట్టలుగా ఉన్న ప్రాంతంలో గుట్టలను తొలగించి, భూమిని చదును చేసి అమ్మేసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గత కొద్ది నెలలుగా గుట్టలను తొలగించి గ్రావెల్‌, రాయి అమ్ముకుంటున్నారు. సుమారు 50 ఎకరాల భూమిని అమ్ముకోవడానికి బేరసారాలు కుదిరినట్లు తెలిసింది. ఈ ఆక్రమణలపై అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో ఇటీవల ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీట్‌ స్థాయి అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందుకోసం శాఖాపరమైన రహస్య విచారణ జరుగుతున్నట్లు సమాచారం. నూజివీడు ప్రాంతంలోని అటవీ భూములపై అటవీశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే అక్రమాలను అడ్డుకుని అటవీ భూమిని కాపాడుకోవచ్చు.

Updated Date - 2022-09-22T06:58:02+05:30 IST