ఈసారైనా ఇటు చూస్తారా

ABN , First Publish Date - 2022-09-07T06:30:28+05:30 IST

మన్యం బిడ్డలను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది పోడుభూముల సమస్య కాగా నేటికి విద్యుత్‌ సౌకర్యం లేని కొండరెడ్డి గ్రామాలు ఉన్నాయి.

ఈసారైనా ఇటు చూస్తారా
విద్యుత్‌, రోడ్డు మార్గం లేని మోదేలు కొండరెడ్డి గ్రామం

సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజనం

పరిష్కారం చూపని పాలకులు..అధికారులు

నేటి ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ప్రస్తావించేనా?


బుట్టాయగూడెం, సెప్టెంబరు 6 : మన్యం బిడ్డలను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది పోడుభూముల సమస్య కాగా నేటికి విద్యుత్‌ సౌకర్యం లేని కొండరెడ్డి గ్రామాలు ఉన్నాయి. కెఆర్‌ పురం ఐటీడీఏ సమావేశ మందిరం వేదికగా బుధవారం జరగనున్న సర్వసభ్య సమావేశంలో అడవి బిడ్డలు నిత్యం ఎదుర్కుంటున్న సమస్యలు ప్రస్తావనకు వచ్చేనా..? అంటూ గిరిపుత్రులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఐటిడిఎ చైర్మన్‌గాను, ఎమ్మెల్యే కన్వీనర్‌గా ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం జరిపి ఏజెన్సీలో గిరిపుత్రులు ఎదుర్కుంటున్న సమస్యలను చర్చించి పరిష్కారానికి కృషి చేయాలి. వాయిదా పడుతూ వస్తున్న సమావేశం ఈనెల 7న బుధవారం జరగనున్న తరుణంలో ఈ సారైనా తమ సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చూపాలని కోరుతున్నారు. 


పోడుభూముల కోసం పోరాటాలు


పోడుభూములకు హక్కులు కల్పించాలని గిరిజనులు దశాబ్దాలు కాలంగా కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అటవీ హక్కుల చట్టంలో పట్టాల కోసం వేలాది మంది గిరిజనులు దరఖాస్తు చేసుకుంటే 2 వేల మందికి పట్టాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారనే ఆరోప ణలు లేకపోలేదు. పోడుభూముల కోసం కోట్లాటలు జరిగాయి. వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గిరిజనులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుగా ఉంది. 


ఇంకా పుంతదారులే దిక్కు


రహదారుల విషయానికి వస్తే ఏజెన్సీలో అనేక గ్రామాలు రోడ్ల ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నాయి. అటవీ ప్రాంతంలోని అనేక గ్రామాలకు నేటికి రోడ్డు సదుపాయం లేదు. పుంతదారుల్లోనే కొండరెడ్లు ఇళ్ళకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ పాలకులకు, అధికారులకు తెలియంది కాదు. చూద్దాం..చేద్దాం.. అంటారు తప్పా అడుగు ముందుకు పడదు. కొండవాగులపై వంతెనల నిర్మాణం, వాగులపై లోలెవల్‌, హైలెవల్‌ కల్వర్టుల నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. ప్రణాలను అరచేతిలో పెట్టుకుని వాగులను దాటి ఇళ్ళకు వెళ్ళవలసిన పరిస్థితుల ఉన్నాయి. వంతెనలు కల్వర్టులు నిర్మించి పుణ్యం కట్టుకోరూ అంటూ మన్యం బిడ్డలు ఘోషిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. 


వెంటాడుతున్న అనేక సమస్యలు


మంచినీరు, విద్య, వైద్యం సమస్యలు గిరిజనులను వెంటాడుతూనే ఉన్నాయి. సత్యసాయి మంచినీటి కోసం అనేక గ్రామాలకు చెందిన గిరిజ నులు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. నూతన విద్యా విదానంతో పాఠ శాలల విలీనంతో చిన్నపిల్లలను దూరప్రాంతాల్లోని బడులకు పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఇటీవలే లంకపాకల ఆశ్రమ పాఠశాలలో డ్రాప్‌వుట్స్‌ను వేరే పాఠశాలలో చేర్పించడాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు పిల్లలను ఇళ్ళకు తీసుకువెళ్లిపోగా అధికారులు, ఉపాధ్యాయులు తల్లి దండ్రులకు నచ్చజేప్పి పిల్లలను బడుల్లో చేర్పించారు. తల్లిదండ్రులు అయి ష్టంగానే ఉన్నారు. మెరుగైన వైద్యం నేటికి అందని ద్రాక్షగానే మారింది. జ్వరంతో ఆసుపత్రికి వస్తే కొన్నిరకాల రక్తపరీక్షలు తప్ప టైఫాయిడ్‌, కామెర్లు, చికున్‌ గున్యా ఇతర పరీక్షలు బయట చేయించుకోవలసిందే.  సర్కారీ వైద్యంపై గిరిపుత్రులకు నేటికి పూర్తిస్థాయిలో నమ్మకం కలిగించలేక పోతు న్నారు. వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తున్నా గిరిజనుల్లో నిర్లిప్తత తొలగిపోవడం లేదు. వీటితోపాటు పింఛన్లు తొలగింపు, రేషన్‌ అందక పోవడం, భూములు లేకపోయినా ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపడం సంక్షేమ పథకాలు తొలగించడం అనేక సమస్యలు మన్యం బిడ్డలను వెంటాడుతుండగా ఇవన్నీ నేడు జరగబోవు సమావేశంలో ప్రస్తావనకు వచ్చి పరిష్కారం కావాలని గిరిజనులు కోరుతున్నారు.


ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు


ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్డి గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కుం టున్నారు. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ఆందోళనలు చేశాం. మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పిం చాలని, రోడ్లు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశాం. పోడుభూముల సమస్యను పరిష్కరించాలని కోరాం...ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. 

– కారం రాఘవ, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకుడు 

Updated Date - 2022-09-07T06:30:28+05:30 IST