మంచి కథతో సినిమా తీస్తా!

ABN , First Publish Date - 2020-10-27T16:59:36+05:30 IST

దర్శకుడ్ని కావాలన్న కోరికతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టా. ఒక సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. అనుకోకుండా వచ్చిన అవకాశాలతో...

మంచి కథతో సినిమా తీస్తా!

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం

హాస్యంతో తగిన గుర్తింపు 

50కిపైగా సినిమాల్లో నటించా 

సినీ హాస్యనటుడు సత్య


కశింకోట(విశాఖపట్నం): దర్శకుడ్ని కావాలన్న కోరికతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టా. ఒక సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. అనుకోకుండా వచ్చిన అవకాశాలతో హాస్య నటుడిగా సిర్థపడ్డానని సత్య (సత్యనారాయణ) చెప్పారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం కశింకోట వచ్చిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో  ముచ్చటించారు. 


ప్రశ్న: సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది?

జవాబు: మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. నటనపై ఆసక్తితో ఈటీవీ జబర్దస్త్‌లో కొంతకాలం పనిచేశా. ఆ అనుభవంతో 2008లో పిల్ల జమీందార్‌ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేసే అవకాశం వచ్చింది. అలా సినీ ప్రయాణం మొదలయింది.  


ప్రశ్న: ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు?  గుర్తింపు తెచ్చినవి ఏవి?

జవాబు: ఇప్పటివరకు 50కు పైగా తెలుగు సినిమాల్లో నటించా. స్వామిరారా, పిల్ల జమీందార్‌, ఛలో, కార్తీకేయ, మత్తు వదలరా, గద్దల కొండ గణేష్‌ (వాల్మీకి)  సినిమాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి.


ప్రశ్న: మీరు మెచ్చే ిహీరోలు, దర్శకులు?

జవాబు: శంకర్‌ దర్శకత్వం వహించే సినిమాలంటే  ఇష్టం. తెలుగులో రాజమౌళి, పూరీ జగన్నాథ్‌, సుకుమార్‌ వంటి దర్శకులను ఇష్టపడతా. బాగా ఇష్టపడే హీరోలు రజనీకాంత్‌, చిరంజీవి.


ప్రశ్న: రాబోయే చిత్రాలు? మంచి అనుభూతి మిగిల్చిన సినిమా?

జవాబు: శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న శ్రీకారం, రామ్‌ హీరోగా నటిస్తున్న రెడ్‌, గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాల్లో  మంచి హాస్యాన్ని పండించే పాత్రలు వచ్చాయి. ఛలో సినిమాకి సైమా అవార్డు దక్కడం మరచిపోలేని అనుభూతి.


ప్రశ్న: ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? బలమైన కోరిక ఏంటి?

జవాబు: అన్నిరకాల పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే కోరిక. ఎప్పటికైనా సినిమా కోసం మంచి కథ రాసి సొంతంగా నిర్మించాలన్నది బలమైన కోరిక. ఇప్పటికే కథ రాయడం ప్రారంభించా. 


Updated Date - 2020-10-27T16:59:36+05:30 IST