గ్రామ సమీపంలో మైనింగ్‌ పనులు ఆపండి

ABN , First Publish Date - 2021-02-25T04:34:21+05:30 IST

మండల పరిధిలోని కొత్త చౌటిపల్లి పునరావాసం కేంద్రం సమీపంలోని కొండలో నిర్వహిస్తున్న సిలికాన్‌ మైనింగ్‌ పనులు ఆపాలని పునరావాస ప్రజలు బుధవారం తహసీల్ధారు వెంకట సుబ్బయ్యకు వినతి పత్రం అందించారు.

గ్రామ సమీపంలో మైనింగ్‌ పనులు ఆపండి
తహసీల్దారుకు వినతిపత్రం అందిస్తున్న పునరావాస కేంద్రం ప్రజలు

ముద్దనూరు ఫిబ్రవరి 24: మండల పరిధిలోని కొత్త చౌటిపల్లి పునరావాసం కేంద్రం సమీపంలోని కొండలో నిర్వహిస్తున్న సిలికాన్‌ మైనింగ్‌ పనులు ఆపాలని పునరావాస ప్రజలు బుధవారం తహసీల్ధారు వెంకట సుబ్బయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సం దర్భంగా వారు తహసీల్దారుకు వివరిస్తూ కొండాపురం మండలం చౌటిపల్లె గ్రామం గండికోట ప్రాజెక్టు ముంపునకు గురైందన్నారు. ముద్దనూరు మండలం శెట్టివారిపల్లె పంచాయతీలో 200 కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పించిందన్నారు. ప్రస్తుతం కొండ ప్రాంతంలో మైనింగ్‌ యాజమాన్యం బ్లాస్టింగ్‌ చేపడుతోందన్నారు. పునరావాస కాలనీలో మైనింగ్‌ ప్రాంతం దాదాపు 800 మీటర్లు ఉంటుందన్నారు. దీంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయన్నారు. జీవాలు, గేదెలు మేత కోసం కొండకు తోలుకెళ్లేందుకు  వీలుండదని, దీంతో ప్రజలు జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా సిలికాన్‌ పౌడర్‌ వర్షపు నీటితో కలిసి భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. గ్రామంలో మైనింగ్‌కు సంబంధించి ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించలేదన్నారు. పునరావాస కేంద్రం ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటిపల్లె మాజీ సర్పంచ్‌ రామసుబ్బారెడ్డి, సుధాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, గురివిరెడ్డి, రామిరెడ్డి, బెస్త సత్యం, నవీన్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T04:34:21+05:30 IST