- పండిట్ బిర్జూ మహరాజ్ ఇకలేరు
- కథక్ నృత్యానికి ప్రపంచఖ్యాతి
- పద్మవిభూషణ్, కాళిదాస్
- సమ్మాన్లాంటి ఎన్నో పురస్కారాలు
- దేవ్‌దాస్, బాజీరావు మస్తానీ
- సినిమాలకు కొరియోగ్రాఫర్
- రాష్ట్రపతి, ప్రధాని, పలువురి సంతాపం
భువనేశ్వర్, జనవరి 17: ప్రముఖ కథక్ నృత్యకళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్(83) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన మధుమేహం, కిడ్నీ సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. లఖ్‌నవూ ‘కల్కా-బిందాదిన్ ఘరానా’ సంప్రదాయానికి చెందిన ఆయన కథక్‌ను దేశవిదేశాలకు వ్యాప్తి చేయడంలో విశేష కృషి చేశారు. అభిమానులు మహరాజ్ అని పిలుచుకునే ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కు మార్తెలు, ఐదుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు.
దేవ్‌దాస్, బాజీరావు మస్తానీ, విశ్వరూపం, గదర్ లాంటి బాలివుడ్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు. నాట్యకళకు అందించిన సేవలకుగాను పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ, కాళిదాస్ సమ్మాన్, ఫిల్మ్ఫేర్లాంటి పలు పురస్కారాలను అందుకున్నారు. మహరాజ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కూచిపూడి నృత్యకారుడు రాజారెడ్డి, నటులు కమల్‌హసన్, కరీనా కపూర్, మాధురి దీక్షిత్, పలువురు కళాకారులు సంతాపం తెలిపారు.
పర్యావరణవేత్త ప్రసాద్ కన్నుమూత
కేరళకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెస ర్ ఎంకే ప్రసాద్(89) సోమవారం కోచీలో చనిపోయా రు. జలవిద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు ‘సైలెంట్ వ్యాలీ’లో చెట్లను నరకాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రతిఘటించి విజయం సాధించారు. ప్రజల్లో శాస్త్రవిజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌కు నేతృత్వం వహించారు. విద్యావేత్తగా పలు పదవులు నిర్వహించారు. పర్యావరణం, విజ్ఞానశాస్త్రం లాంటి అంశాలు జనాలకు అర్థమయ్యేలా మళయాలంలో ప్రసాద్ ఎన్నో రచనలు కూడా చేశారు.
కార్మికనేత నారాయణ్ పాటిల్ మృతి
మహారాష్ట్రకు చెందిన కార్మికనేత, ప్రగతిశీల ఆలోచనాపరుడు నారాయణ్ ధ్యాన్‌దేవ్ పాటిల్ (94) తీవ్ర అస్వస్థతతో కొల్హాపూర్‌లో సోమవారం చనిపోయారు. రైతులు, కార్మికుల న్యాయమైన హక్కుల కోసం 1948లో ఏర్పాటైన షెట్కారి కామ్‌గార్ పక్ష(ఎస్కేపీ)లో చేరిన ఆయన జీవితాంతం వారికోసమే పోరాడారు. 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన సహకారమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఒడిశాకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త శాంతిదేవి(88) గుణుపురంలోని ఓ ఆశ్రమంలో మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. సామాజిక సేవకుగాను ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది.