అమ్మెయ్‌!

ABN , First Publish Date - 2022-06-04T06:31:33+05:30 IST

కల్లుగీత కార్మికుల జీవనం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో లే ఔట్‌ వేసి ప్లాట్ల అమ్మకానికి రంగం సిద్ధం చేశారు.

అమ్మెయ్‌!
గోవిందంపల్లి గ్రామంలో రూ.కోట్ల విలువ చేసే సొసైటీ భూమి ఇదే..

కల్లుగీత సొసైటీ భూమితో వ్యాపారం

పక్కనే ఉన్న పోరంబోకు, శ్మశానం కబ్జా

రియల్టర్లతో కలిసి సొసైటీ చైర్మన దందా

అధికార పార్టీవారికీ వాటా


- బుక్కరాయసముద్రం

కల్లుగీత కార్మికుల జీవనం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో లే ఔట్‌ వేసి ప్లాట్ల అమ్మకానికి రంగం సిద్ధం చేశారు. పనిలో పనిగా, పక్కనే ఉన్న వంక పోరంబోకు, శ్మశాన స్థలాన్ని కూడా ఆక్రమించి.. ప్లాట్లు వేశారు. కొందరు రియల్టర్లతో సొసైటీ చైర్మన ఒప్పందం చేసుకుని, ఈ దందాకు తెరలేపారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఎక్సైజ్‌ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీవారి హస్తం ఉండటంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది.


ఎన్నెన్నో ఎత్తుగడలు..

బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్ల గ్రామానికి చెందిన 11 మంది కల్లుగీత కార్మికులు ‘టాడీ ట్యాపర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ’ ఏర్పాటు చేసుకున్నారు. 2003లో  అప్పటి ప్రభుత్వం వీరి జీవనం కోసం గోవిందంపల్లి సర్వే నెంబర్‌ 56-2లో  10.85 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ  భూమిలో ఈత చెట్లు పెట్టుకుని ఉపాధి పొందాలి. ఇతర కార్యకలపాలకు వినియోగించకూడదు. అమ్మడానికి అనుమతి లేదు. కానీ సొసైటీ చైర్మన ఈడిగ రామసుబ్బయ్య పేరిట సొసైటీ సభ్యులు 2018లో పట్టాదారు పాస్‌పుస్తకం పుట్టించారు. 2021 జనవరి 20న రామసుబ్బయ్య అదే సొసైటీలో ఉన్న ఈడిగ శ్రీరాములుకు రూ.37.98 లక్షలకు ఆ భూమిని అమ్మినట్లు పత్రాలు పుట్టించారు. ఈడిగ శ్రీరాములు  ఈ ఏడాది మార్చి 23న రిజిస్ట్రేషన రద్దు చేసుకున్నాడు. ఇదే భూమికి రామసుబ్బయ్య ఈ ఏడాది మే 12న అనంతపురం నగరానికి చెందిన భువిత ఇనఫ్రా కంపెనీ ఎండీ చల్లా శేఖర్‌నాయుడుకు పవర్‌ ఆఫ్‌ పట్టా చేయించారు. ఈ డీల్‌ వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ భూమిలో కొంత వాటాను వైసీపీ నాయకులకు ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. 


60.. 40 వాటాలు

కల్లుగీత కార్మికులు రియల్‌ ఎస్టేట్‌ మాఫియాతో మిలాఖత అయ్యారు. ప్రభుత్వం సొసైటీకి కేటాయించిన భూమిలో లే ఔట్‌ వేసి, 60:40 ప్రకారం వాటా వేసుకున్నారు. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసేందుకు కుట్ర చేశారు. సొసైటీ భూమితో పాటు పక్కనే ఉన్న  ఎర్రవంక భూమి, ఎస్సీల శ్మశాన స్థలాన్ని చదును చేసి కబ్జా చేశారు. పక్కనే ఉన్న సుమారు ఐదు ఎకరాల వంక పోరంబోకు భూమిని కూడా కబ్జా చేశారు. అందులో కూడా లే ఔట్‌ వేసి, అమ్మేందుకు రియల్‌ మాఫియా ఏర్పాట్లు చేసుకుంది. రెవెన్యూ అధికారులు అడ్డుపడకుండా, నియోజక వర్గంలోని అధికార పార్టీ నాయకుడి ద్వారా అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. 


రద్దు చేయిస్తాం..

కల్లుగీత కార్మికలకు ఇచ్చిన భూమిని అమ్మేందుకు వీలులేదు. అమ్మినవారితోపాటు కొన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సొసైటీ చైర్మన రామసుబ్బయ్య చేసిన పవర్‌ ఆఫ్‌ పట్టాను రద్దు చేయిస్తాం. ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్‌కు దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే నివేదిక పంపి రద్దు చేయిస్తాం.

- కుమరీశ్వరన, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 



Updated Date - 2022-06-04T06:31:33+05:30 IST